ముర్షిదాబాద్‌లో సలీంకే ప్రజల మద్దతు

 ముర్షిదాబాద్‌లో సలీంకే ప్రజల మద్దతు– సీపీఐ(ఎం) నుంచి పోటీ
– బెంగాల్‌లో అత్యంత పోటీ గల నియోజకవర్గాల్లో ఇదొకటి
– కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతుొ టీఎంసీ, బీజేపీకి చెమటలు
ముర్షిదాబాద్‌ బెంగాల్‌లోని అత్యంత పోటీగల నియోజకవర్గాలలో ఒకటి. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. సలీంకు కాంగ్రెస్‌ సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో టీఎంసీ, బీజేపీ పార్టీలకు చెమటలు పడుతున్నాయి.
బ్రిటిష్‌ పాలనకు ముందు ముర్షిదాబాద్‌ గ్రేటర్‌ బెంగాల్‌ రాజధాని. బ్రిటిష్‌ వారిని వణికించిన సిరాజ్‌ ఉద్‌ దౌలాతో సహా నవాబులే పాలకులు. అనేక స్మారక కట్టడాలతో కూడిన చారిత్రక భూమి మత సామరస్యానికి కూడా అనుకూలంగా ఉంటుంది. 65 శాతం ముస్లిం మైనారిటీ కమ్యూనిటీలతో ఈ ప్రాంతం మత సామరస్యానికి ప్రతిరూపం. మెజారిటీ రైతులే. బీడీ పరిశ్రమకు, హస్తకళలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతం చాలా కాలంగా కమ్యూనిస్టు ఉద్యమాలకు బలమైన పునాది. పలుమార్లు ఇక్కడ కమ్యూనిస్టులు గెలిచారు. తృణమూల్‌ పాలన అణచివేతలను తట్టుకుని, సీపీఐ(ఎం) బలమైన పునరాగమనం చేస్తోంది. సలీం అభ్యర్థిత్వం అందుకు పెద్ద మేల్కొలుపు.
దేశ మనుగడ కోసం వామపక్ష లౌకిక శక్తులను గెలిపించేందుకు ద్వేషపూరిత రాజకీయాలకు ప్రతిరూపమైన బీజేపీని, తణమూల్‌ను ఓడించాల్సిన అవసరాన్ని సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ సలీం వివరించారు. మహిళలు, యువకులు కూడా పెద్ద ఎత్తున ఎన్నికల సభలకు తరలిరావడం ఉత్కంఠ రేపుతోంది. 2014 వరకు నిరంతరంగా సీపీఐ(ఎం) గెలిచిన ఈ నియోజకవర్గాన్ని 2019లో తృణమూల్‌ గెలుచుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తృణ మూల్‌దే పైచేయి. అయితే, 2023లో పంచాయతీ ఎన్ని కల్లో విస్తృత హింసను ఎదు ర్కొన్న లెఫ్ట్‌ ఫ్రంట్‌, కాంగ్రెస్‌ బలమైన పునరాగమనం చేశాయి.
ముర్షిదాబాద్‌లోని రాణి నగర్‌ సారవంతమైనది. వరి, జనపనారతో నిండిన పొలాలు. పొలాల్లో ఎక్కడ చూసినా నాగలి దున్నే, ఎరువు చల్లే రైతులతో అరటి, మునగ పంటలు కనిపిస్తాయి. ఇది రాజకీయంగా కూడా చురుకైన ప్రాంతం. గ్రామాల్లో ఇళ్ల గోడలపై రాజకీయ పార్టీల చిహ్నాలు ఉన్నాయి. సీపీఐ(ఎం) ఎన్నికల గుర్తు సుత్తి, కొడవలి నక్షత్రం ఎక్కువగా గోడలపై కనబడుతుంది. ముర్షిదాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థి ముహమ్మద్‌ సలీమ్‌ పర్యటనతో రాణినగర్‌ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. సలీం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మక్తపాడు గ్రామానికి చేరుకోగా.. మహిళలు, చిన్నారులు సహా వందలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొన్ని మాటల్లో వారికి కృతజ్ఞతలు తెలిపిన సలీం సమీపంలోని రెండు మూడు ఇండ్లకు వెళ్లి వద్ధ తల్లులను కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముందుకు సాగిన కాన్వారులో ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్‌ ఆటోలు బారులు తీరాయి. గ్రామీణ రహదారులపై పూల వర్షం కురిపిస్తూ చేతులు ఊపుతూ శుభాకాంక్షలు తెలిపారు. నిర్దేశిత రిసెప్షన్‌ సెంటర్లతో పాటు, రోడ్లపై బైక్‌పై సలీం గ్రామస్తులను పలకరించారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా మెరిసిన రాష్ట్ర మాజీ మంత్రి సలీం అందరికీ సుపరిచితమే. డీవైఎఫ్‌ఐ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి సలీం చేసిన పోరాటాలను ఈ ప్రాంతం కూడా చూసింది. పల్లెల నుంచి పట్టణాలకు చేరుకునే సరికి ఈ యాత్ర పెద్ద ఊరేగింపుగా మారింది. సంగీత బృందాలతో పాటు, కార్యకర్తలు సైకిళ్లపై, కాలినడకన ప్రయాణించారు. దారి పొడవునా స్వాగతాలను అందుకోవాల్సినందున ప్రజలు అనుకున్న దానికంటే ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆయన వేచి ఉన్నారు. చిన్న చిన్న ప్రసంగాలలో సలీం టీఎంసీ, బీజేపీని ఎండగడుతున్నప్పుడు ఏకధాటిగా చప్పట్లు మార్మోగాయి. బెంగాల్‌ నుంచి ఎర్రజెండాను పంపించాలని పిలుపునిచ్చిన వారు అవినీతిలో కూరుకుపోయారని ఆయన ఎత్తిచూపారని పేర్కొన్నారు.
2014లో చిన్న రైతులు, కూలీలు ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్‌లో సీపీఐ(ఎం) చెందిన బదరు దోసాఖాన్‌ విజయం సాధించారు. గత సారి టీఎంసీ అభ్యర్థి అబూ తాహిర్‌ ఖాన్‌ గెలిచారు. ఈసారి కూడా తాహిర్‌ ఖాన్‌ టీఎంసీ అభ్యర్థి. బీజేపీ అభ్యర్థి గౌరీ శంకర్‌ ఘోష్‌. అయితే సీపీఐ(ఎం), టీఎంసీ మధ్యే ప్రధాన పోటీ ఉంది. ముర్షిదాబాద్‌ 15 లక్షల మంది ఓటర్లతో అత్యధిక జనాభా కలిగిన నియోజకవర్గం. జాతీయోద్యమంలో మరువలేని పాత్ర పోషించిన ముర్షీదాబాద్‌ లౌకికవాదాన్ని, పోరాట పటిమను కాపాడుకునేందుకు సిద్ధమవుతోంది.

Spread the love