నితిన్ గ‌డ్క‌రీతో తెలంగాణ సీఎం భేటీ

నవతెలంగాణ న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ – శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ – కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడం, రీజినల్ రింగ్ రోడ్డు (RRR)దక్షిణ భాగం అభివృద్ధి, హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడంపై గడ్కరీతో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించారు. సెంట్ర‌ల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఫండ్ (CRIF) నుండి తెలంగాణకు నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండలో ట్రాన్స్‌పోర్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

Spread the love