– వాతావరణంలో మార్పు వల్లే అంటువ్యాధుల వ్యాప్తి
– దవాఖానలో క్యూ కడుతున్న రోగులు
– జాగ్రత్తలు తీసుకోవాలి, సూపరింటెండెంట్ భానుప్రసాద్
నవతెలంగాణ – నాగార్జునసాగర్
గత కొద్ది రోజులుగా ప్రబలుతున్న విష జ్వరాలతో నాగార్జునసాగర్, పరిసర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు విష జ్వరాల బారిన పడిన మంచానికే పరిమితమవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా జ్వరం తగ్గక పోవడంతో వేలకువేలు వైద్యానికి ఖర్చుచేసే స్తోమత లేక నాగార్జునసాగర్ లోని స్థానిక కమలా నెహ్రూ దవాఖాన బాట పడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పు వలనే ప్రజలు రోగాల బారిన పడుతుండడం విశేషం. వాతావరణం మార్పు వల్ల చర్మం పొడిబారి దురద పెట్టి దద్దుర్లు ఏర్పడుతుందని అనంతరం జ్వరాల బారిన పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఒక అంటూ వ్యాధి అని రోగి బయటికి పోయేటపుడు,ఇంట్లో ఉన్న ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. విష జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య నానాటికీ పెరుతోంది. ఇంటి చుట్టుపక్కల గుంతలు, కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కలుషిత నీరు కూడా జ్వరాల పెరుగుదలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. చలి జ్వరం, జలుబు, దగ్గు తదితర వ్యాధులతో పాటు కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దీంతో వైరల్ ఫీవర్స్, మలేరియా తదితర రోగాలతో చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.
వ్యక్తిగత శుభ్రతతో అంటువ్యాధులు దూరమవుతాయి: సూపరింటెండెంట్ భాను ప్రసాద్
వాతావరణంలో మార్పు వలన చర్మం పొడి బారి దురద వచ్చి దద్దుర్లు ఏర్పడుతుందని అనంతరం జ్వరాల బారిన పడుతున్నారు. ఇలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే కాచి వడపోసిన నీటిని తాగాలి. కలు షిత, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినరాదు. వేడిగా ఉన్న ఆహారాన్ని భుజించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. జ్వరం వస్తే వైద్యుల సలహామేరకు మందులు వాడాలి.