విద్యాసేవలో సెయింట్ జోసఫ్ పాఠశాలకు 60 ఏండ్లు

– లాభాపేక్షలేని ఏకైక పాఠశాల
– సేవ స్ఫూర్తి కి మారుపేరు సెయింట్ జోసఫ్ 
– అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
– ఎంతోమంది పూర్వ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన పాఠాశాల
– ఎయిడెడ్ స్కూళ్లపై ఆరోపణలు అవాస్తవం
–  ప్రైబా ఎడ్యుకేషన్ సొసైటీ సంబంధం లేదు 
– సెయింట్ జోసఫ్ యాజమాన్యం వెల్లడి
నవతెలంగాణ నాగార్జునసాగర్: గత 60 ఏండ్లుగా విద్యార్థులకు ఏలాంటి లాభాపేక్ష లేకుండా విద్యాబోధన అందిస్తోన్న ఏకైక పాఠశాల నాగార్జుననసాగర్‌లోని సెయింట్ జోసఫ్ స్కూల్ పాఠశాల అని ఆ పాఠశాల యాజమాన్యం తెలిపింది. శుక్రవారం పాఠశాల యాజమాన్యం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1967లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఈ స్కూల్‌ను ప్రారంభించారని అప్పటి నుండి ఇప్పటివరకు ఈ స్కూల్ పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధిరోహించారని అంతటి ఘనచరిత్ర కలిగిన స్కూల్‌పై ఆరోపణలు ప్రచురించడం తగదని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. విలువలే లక్ష్యంగా నాణ్యమైన విద్యను అందిస్తున్న మా పాఠశాలపై ‘నల్లగొండలో ఎయిడెడ్ దందా’ అనే శీర్షికతో ఒక దినపత్రికలో కథనం ప్రచురించడం ఏమాత్రం సమంజసం కాదని, మా పాఠశాలలో చదువుకున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు ఆయా రంగాల్లో అత్యున్నత స్థానాల్లో నిపుణులుగా సేవలందిస్తున్నారన్నారు. అలాంటి మా పాఠశాలపై లేనిపోని అబాండాలు వేస్తూ దుష్ర్పచారాలు చేయడం పంట్ల పాఠశాల యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


స్కూల్ యాజమాన్యంపై అదనపు భారం..
జీసస్ మేరీ జోసెఫ్(జేఎంజే) సొసైటీ 1967లో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ కిండర్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ అప్పర్ ప్రైమరీ స్కూల్, సెయింట్ జోసఫ్ ప్రైమరీ స్కూల్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్స్‌ను నర్సరీ టూ టెంత్ క్లాస్ వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో పాఠశాలను నడిపిస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది. అయితే తెలుగు మీడియం ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి కేవలం 4 విద్యార్థులు మాత్రమే ఉండడం.. ఇద్దరు ఉపాధ్యాయులు, మరో ఇద్దరు బోధనేతర సిబ్బంది ఉండడంతో ఈ ఎయిడెడ్ పాఠశాలను మూసివేసేందుకు జిల్లా విద్యాశాఖాధికారి ప్రతిపాదనలు పంపామని యాజమాన్యం ప్రకటింది. మరోవైపు 406 మంది విద్యార్థులు ఉన్న స్కూల్‌కు కేవలం ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండడం వల్ల సెయింట్ జోసెఫ్ అప్పర్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నిర్వహణ యాజమాన్యానికి భారంగా మారింది. దీంతో పాఠశాలను మూసివేసేందుకు ప్రతిపాదనలు పంపగా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జిల్లా విద్యాశాఖ యంత్రాంగం మూసివేతను నిరాకరించింది.
మధ్యాహ్నా భోజనం అందించడంలో బెస్ట్..
పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్నా భోజన పథకం నిర్వహణ మండలంలోనె బెస్ట్‌గా నిలుస్తోంది. అధికారులు సైతం పలుమార్లు మధ్యాహ్నా భోజనాన్ని పరిశీలించి అత్యంత సంతృప్తిని వ్యక్తం చేశారు. మధ్యాహ్నా భోజన పథకం విషయంలో ఏక్కడా చిన్న పొరపాట్లకు తావివ్వకుండా సేవలు అందిస్తుంటే.. కొంతమంది కావాలని పని గట్టుకుని తప్పుడు ప్రచారానికి తేరలేపడం సమంజసం కాదని యాజమాన్యం పేర్కొంది. మరోవైపు స్కూల్ నిర్వహణకు తీసుకున్న స్థలం లీజు గడువు ఇంకా పూర్తికాలేదు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యావసరాలను దృష్టిలో పెట్టుకుని లీజు గడువు పొడగించాలని సంబంధిత అధికారులను సంప్రదించారు.
ప్రైబా ఎడ్యుకేషన్ సొసైటీ సంబంధం లేదు
నాగార్జునసాగర్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలకు ప్రైబా ఎడ్యుకేషన్ సొసైటీతో ఏలాంటి సంబంధం లేదని స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. జిల్లా విద్యాశాఖ యంత్రాంగం సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించినట్టు చెప్పారు. స్కూల్ నిర్వహణకు సంబంధించి ఏలాంటి అనుమానాలు ఉన్నా.. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, పూర్వ విద్యార్థులు పాఠశాల పనిదినాల్లో ఏ సమయంలోనైనా సందర్శించి తెలుసుకోవచ్చని సెయింట్ జోసఫ్ స్కూల్ యాజమాన్యం ప్రకటించింది.

Spread the love