కాంగ్రెస్ చేతగానితనం వల్లే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత

– ప్రాజెక్టుల అప్పగింతతో నల్లగొండ తీవ్ర నష్టం
– చలో నల్లగొండ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర
– ఆరు నూరైనా సభను విజయవంతం చేస్తాం
– బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలి
– మాజీ ఎమ్మెల్యే, చలో నల్లగొండ భువనగిరి కోర్డినేటర్ సుంకె రవిశంకర్
– భువనగిరిలో సభ సన్నాహక సమావేశం
నవతెలంగాణ – భువనగిరి: శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, చలో నల్లగొండ భువనగిరి కోర్డినేటర్ సుంకె రవిశంకర్ చెప్పారు. గురువారం భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భువనగిరి నియోజకవర్గం ముఖ్య నేతలతో చలో నల్లగొండ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిట్టా బాలకృష్ణ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు తదితరులతో కలిసి చలో నల్లగొండ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం సుంకె రవిశంకర్ మాట్లాడుతూ కృష్ణా జలాల పంపిణీని కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించటం వల్ల ఎడమ కాల్వ రైతాంగం మళ్ళీ తిరోగమనం అయ్యేలా పరిస్థితి వచ్చిందని వాపోయారు. సాగర్ డ్యామ్ కేంద్ర బలగాల చేతికి పోయాయని, మనల్ని అడుగు పెట్టనియ్యడం లేదన్నారు. ఇది కాంగ్రెస్ వాళ్లు చేసిన నిర్వాకమని ద్వజమెత్తారు. కృష్ణా జలాలపై కేంద్రం పెతనంతో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు సాగు, తాగునీరు కోసం కేంద్రం అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పదేళ్లుగా ప్రాజెక్టులను కాపాడుకుంటూ వచ్చారని, అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుమని రెండు నెలలు గడవకు ముందే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల కోసం మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చేరు నల్గొండ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని, ఆరు నూరైనా సభను నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. పోలీస్ యాక్ట్ లు, నిర్బందాలు సంకెళ్లు తమకు కొత్త కాదన్నారు. సభలో కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిన కాంగ్రెస్ నాయకులు బాగోతం అంతా బట్టబయలు అవుతుందన్నారు. కేంద్రం నుంచి ఏదో ఆశించే కాంగ్రెస్ ప్రాజెక్టులను అప్పజెప్పుతున్నాదని ఆరోపించారు. చలో నల్లగొండ సభకు భువనగిరి నియోజకవర్గం నుంచి 20 వేల మంది పైగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివెలన్నట్టు తెలిపారు. చలో నల్గొండ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Spread the love