నవతెలంగాణ హైదరాబాద్: కోదాడ ప్రజలను అరాచకపు పాలన నుండి కాపాడుకునేందుకే తాను బీఆర్ఎస్ ను వీడితున్నట్టు మాజీ ఎమ్మెల్యే చందర్రావు అన్నారు. ఆయన తోపాటు కోదాడ బీఆర్ఎస్ అగ్రనాయకులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే తామంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆదివారం కోదాడ పట్టణంలోని డేగ బాబు ఫంక్షన్ హాల్ లో జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావుతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లారెడ్డి, ఎంపీపీలు ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి, చుండూరు వెంకటేశ్వర్లు, ఎలక బిందు నరేందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జడ్పీటీసీలు పందిళ్ళపల్లి పుల్లారావు, ఉమా శ్రీనివాస్ రెడ్డి, నల్లపాటి ప్రమీల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ పద్మ గుండపు నేని నాగేశ్వరరావు, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు అల్తాఫ్ హుస్సేన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లుతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కోదాడ బీఆర్ఎస్ నాయకత్వంలో నాయకులకు కార్యకర్తలకు స్వేచ్ఛ స్వతంత్రాలు లేవని గత ఐదేండ్లుగా అడుగడుగునా అవమానాలకు గురై తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరడం శుభపరిణామని అందరికీ తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కాగా కోదాడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, పట్టణాధ్యక్షులు వంగవీటి రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, అభిమానులు పాల్గొన్నారు.