– ఎన్నికల సంఘం ఆదేశాలతో బారీగా జరుగనున్న బదిలీలు..
– మూడేళ్లుగా ఉన్న అధికారుల జాబితా సిద్దం చేసిన జిల్లా యంత్రాగం…
– జిల్లాలో త్వరలో జిల్లా అధికారుల బదిలీలు..
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలోని కీలకమైన వివిధ ప్రభుత్వ విభాగాల్లో మూడేళ్ల గా పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం చేశారు. పలు శాఖల అధికారులు సుమారు ఏండ్ల తరబడి ఒకే సీటులో ఉండడంతో విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో మూడేళ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఇందుకు అనుగుణంగా బదిలీల మార్గదర్శకాలను విడుదల చేసింది.ఈ నెల లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో జిల్లాలో మూడేళ్లుగా ఒకే సీటులో పాతుకుపోయిన అధికారులతో పాటు సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, గతంలో జరిగిన ఎన్నికల్లో పలు ఆరోపణలు, ఫిర్యాదులు ఎదుర్కొన్న అధికారులు, జూన్‌లోగా పదవీ విరమణ చేయనున్న అధికారులు ఇలా పలు జాబితాలను సిద్ధం చేయడంపై ఉన్నతాధికారులు కసరత్తులు చేస్తున్నారు.జిల్లాలో సుమారు 40 మందికిపైగా కీలక అధికారులు బదిలీ కానున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇందుల్లో జిల్లా అధికారులు 16 మంది ఉన్నట్లు సమాచారం.
మూడేళ్లుగా ఉన్న అధికారుల జాబితా సిద్దం..
జిల్లాలో మూడేళ్లుగా కీలక పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల జాబితాను ఉన్నతాధికారులు ఇప్పటికే ఇప్పటికే ప్రాథమికంగా జాబితాను రెడీ చేశారు. ఇందులో భాగంగా దీని పై పరిశీలన జరిపి ఉన్నతాధికారుల విచారణ అనంతరం తుది జాబితాను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో రెవెన్యూ శాఖలో ఆర్‌డీవోలు, పంచాయతీ రాజ్‌శాఖలో డీఆర్‌డీవో, జెడ్పీ సిఈవో, డీఆర్‌డీఏ శాఖలో ఈజీఎస్ ఏపీడీ, వ్యవసాయ శాఖలో జిల్లా వ్యవసాయ అధికారి, బీసీ వెల్ఫేర్ శాఖలో డీబీసీడీవో, ఎబిసిడిఓ, స్టేట్ ఆడిట్ డిపార్ట్ మెంట్‌లో జిల్లా ఆడిట్ అధికారి, స్కూల్ ఎడ్యూకేషన్ శాఖలో డీఈవో, ఉపాధి కల్పనా శాఖలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ అధికారిలు ఉన్నారు. ఉద్యనావన శాఖలో జిల్లా హార్టీకల్చర్ అధికారి, లీగల్ మెట్రోలాజీలో జిల్లా లీగల్ మెట్రోలాజీ అధికారి, మైన్స్ అండ్ జియోలాజీలో మైన్స్ అండ్ జియోలాజీ జిల్లా అధికారి, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో జిల్లా ప్లానింగ్ అధికారి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో డీపీఆర్‌ఈ, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఆర్‌అండ్‌బీ ఈఈ, డీఈలు, ఎస్‌సీ కార్పోరేషన్‌లో ఎస్‌సీ కార్పోరేషన్ ఈడీ, ఎస్‌సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్‌సీడీఓ, జిల్లా స్పోర్ట్స్ అధికారి, సర్వే సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డు విభాగంలో ఎస్‌అండ్‌ఎల్‌ఆర్ ఏడీ ఈ జాబితాలో ఉన్నారు.
జిల్లాలో కీలక అధికారులు వీరే…
సొంత జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కీలక అధికారుల ప్రాథమిక జాబితాను సైతం ఉన్నతాధికారులు రూపొందించారు. ఇందులో ప్రధానంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో డీఆర్‌డీఏ, ఈజీఎస్ ఏపీడీ, సహకార శాఖలో జిల్లా సహకార అధికారి, హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ విభాగంలో జిల్లా హార్టికల్చర్ అధికారి, ఎస్‌సీ కార్పొరేషన్‌లో ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా సంక్షేమ విభాగంలో డీడబ్ల్యూవోలు ఉన్నట్లు ప్రాథమికంగా జాబితా సిద్ధమైంది.
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు..
రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అధికారుల బదిలీలు నిర్వ హించడానికి ఉన్నతాధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు. జూన్‌లోగా పదవీ విరమణ చేయనున్న వారిని బదిలీ జాబితాలోకి తీసుకోవడం లేదు. నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆర్‌డివోలు, తహశాల్దార్‌లు మినహా పెద్దగా బదిలీలు జరుగలేదు. ప్రస్తుత దఫాలో మునుపటితో పోలీస్తే పెద్దగా బదిలీలు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై ఎన్నికల సంఘం క్రమ శిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తే అలాంటి వారికి మళ్లీ ఎన్నికల విధులు అప్పగించకుండా ఉండేందుకు కసరత్తులు చేస్తున్నారు. చర్యలు పెండింగ్‌లో ఉన్న అధికారులను సైతం ఎన్నికల విధులకు దూరంగా ఉంచడానికి యోచన చేస్తున్నారు. ఎలాంటి చర్యలకు సిఫార్సు చేయకుండా కేవలం బదిలీ చేయాలని సూచించిన వారిని మాత్రం బదిలీల పరిధిలోకి తీసుకున్నారని అభిప్రాయాలున్నాయి. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి ఎన్నికల సంఘానికి నివేదిక అందించారు. అంతర్గత బదిలీలు, డిప్యూటేషన్లపై వచ్చిన వారిని వెనక్కి పంపడానికి సైతం అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఈవ్యవహా రం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.