నందికొండలో మళ్లీ కరోనా కలకలం

– మళ్లీ కరోనా అలజడి
– భయపడాల్సిన అవసరం లేదంటున్న వైద్యులు

– రెండు పాత వేరియంట్ కేసులు నమోదు
 – కమలా నెహ్రూ దవాఖానలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు
– వైరస్‌ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచన

– మాస్క్‌ తప్పనిసరి అంటున్న వైద్యులు
నవతెలంగాణ – నాగార్జునసాగర్
కరోనా వైరస్‌ మళ్లీ అలజడి సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలతో పాటు భారత్‌లోనూ కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో  గురువారం నాగార్జునసాగర్ నందికొండలో రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి. కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న ఇద్దరు స్థానిక కమలా నెహ్రూ దవాఖానకు  వెళ్లి కరోన పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. వీరు ఒకరు హిల్ కాలాని, మరొకరు సాగర్ పరిసర ప్రాంతంకు చెందినవారిగా అధికారులు చెబుతున్నారు. కొత్తగా వ్యాప్తి చెందుతున్న జెఎన్1 కరోనా వేరియంటా?, కాదా?…అనే విషయం నిర్ధారించేందుకు బాధితుల నుంచి నమూనాలు సేకరించనున్నారు. జెఎన్1 నిర్ధారణ పరీక్షలు కమలా నెహ్రూ దవాఖానలో లేవని, మరోచోటికి శాంపిల్స్ ను పంపించిన అనంతరం రెండు, మూడు రోజుల్లో ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి కొత్త కేసులు కావని, గతంలో కరోన సోకి కోలుకున్న రోగికి మాత్రమే ఈ లక్షణాలు బయటపడుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్లకి దగ్గు, జలుబు ఉన్న కూడా కరోన పాజిటివ్ చూపిస్తుందని, పాత వేరియంట్ ఉన్న మూడు రోజులలో తగ్గుతుందని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సీజన్లో కరోన వ్యాధి చూపిస్తుండడం సహజమని చెబుతున్నారు. కరోనా దగ్గు, జలుబు లాగా మామూలు రోగంగా మారిందని డాక్టర్లు చెబుతున్నారు. పాత కరోన కిట్లతో పరీక్షలు చేయవద్దని డాక్టర్లకు సూచనలు ఉన్నాయని, వచ్చే 17వ తేదీ బుధవారం కొత్త వేరియంట్ కిట్లు రానున్నట్లు కమలా నెహ్రూ దవాఖాన సూపరింటెండెంట్ భాను ప్రసాద్ తెలిపారు. కొత్త కేసుల పట్ల ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇవీ లక్షణాలు :
కోవిడ్‌ వైరస్‌ బారినపడిన వారిలో పొడి దగ్గు, తుమ్ములు, ఒళ్లు నొప్పులు, బలహీనత, అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ తరహా లక్షణాలతో మూడు నుంచి ఐదు రోజులపాటు బాధపడుతూ మందులు వాడుతున్నా ప్రయోజనం లేకపోతే కరోనా నిర్ధారిత పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి – డాక్టర్ భాను ప్రసాద్, కమలా నెహ్రూ దవాఖాన సూపరింటెండెంట్
డాక్టర్ భాను ప్రసాద్, కమలా నెహ్రూ దవాఖాన సూపరింటెండెంట్
డాక్టర్ భాను ప్రసాద్, కమలా నెహ్రూ దవాఖాన సూపరింటెండెంట్
వైరస్‌కు సంబంధించిన వేరియంట్‌ ఏదైనా తీసుకునే జాగ్రత్తల్లో మార్పు లేదని కమలా నెహ్రూ దవాఖాన సూపరింటెండెంట్ భాను ప్రసాద్ అన్నారు. జనసమూహంగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, మాస్క్‌ ధరించడం, చేతులు తరచూ శుభ్రపరుచుకోవడం, వ్యాధి లక్షణాలు ఉంటే సకాలంలో పరీక్ష చేయించుకుని వైద్య సేవలు పొందడం చేయాలంటున్నారు. కొత్త వేరియంట్‌ కొంత ఇబ్బందికరమైనది అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. గర్భిణులు, దీర్ఘకాలిక రోగులు, చిన్నారులు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తత అవసరమని ఆయన పేర్కొన్నారు.జేఎన్1 లక్షణాల గురించి మాట్లాడుతూ.. ఇది సోకినవారికి జలుబు తీవ్రంగా ఉంటుందన్నారు. విపరీతమైన దగ్గు, ఆయాసం వస్తుందని చెప్పారు. జ్వరంతో ఈ లక్షణాలు మొదలవుతాయన్నారు. పిల్లికూతలు కూడా వస్తాయని తెలిపారు. న్యుమోనియా తరహా లక్షణాలకు దగ్గరగా తీసుకువెళుతుందని, కానీ ఆ దశకు చేరుకోకపోవచ్చని చెప్పారు.
Spread the love