కవిత అరెస్టుపై ఈడీ కీలక ప్రకటన

నవతెలంగాణ ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌ (ఈడీ) కీలక విషయాలు వెల్లడించింది. ఈ మేరకు ఈడీ సోమవారం కవిత అరెస్ట్‌పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల15న కవితను అరెస్ట్‌ చేసినట్టు పేర్కొంది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఈ నెల 23 తేదీ వరకు కవిత కస్టడికి తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. ‘ఢిల్లీ లిక్కర్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేశాం. ఆస్తుల జప్తును అడ్జుడికేటింగ్‌ అథారిటీ ఆమోదించింది. మద్యం విధానం రూపకల్పనలో కవిత ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేతలు సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర చేశారు.

ఈ వ్యవహారంలో ఆప్‌ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు అప్పజెప్పడంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారు. ఈ మొత్తాన్ని హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి ఇప్పించారు. తిరిగి ఆ డబ్బును లాభాలను రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు పన్నారు. ఈ కేసులో మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం. 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. ఒక ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఐదు సప్లిమెంటరీ కంప్లైంట్స్ ఫైల్ చేశాం. కవిత ఏడు రోజుల ఈడి కస్టడీలో ఉంది. ఆమెను అరెస్టు చేసే సమయంలో బంధువులు మాకు ఆటంకం కలిగించారు.

Spread the love