మణిపూర్‌కు అఖిలపక్షాన్ని పంపాలి

 Akhilapaksha should be sent to Manipur– అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్‌ 1
– కేంద్రం నయా పైసా సాయం చేయటం లేదు : బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు
మణిపూర్‌కు అఖిలపక్షాన్ని పంపా లని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. వ్యవసాయం, విద్యుత్‌, సాగు, తాగు నీటి వంటి రంగాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని, కేంద్రం మాత్రం నయాపైసా సాయం చేయడం లేదని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తొమ్మిదేండ్లుగా కేంద్రం అన్యాయమే చేస్తోందని, రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకంత వివక్ష అని ప్రశ్నించారు. బుధవారం అవిశ్వాసంపై జరిగిన చర్చలో నామా నాగేశ్వరరావు మాట్లాడారు. ‘దేశం అంటే రాష్ట్రల సమూహం. ప్రధాని స్థానంలో ఉన్నవారికి చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, మద్దతిచ్చే రాష్ట్రం, మద్దతుగా లేని రాష్ట్రం అన్న వ్యత్యాసం ఉండరాదు. కానీ తెలంగాణను కేంద్రం విస్మరిస్తోంది. తొమ్మిదేండ్లుగా అన్యాయం చేస్తూనే ఉంది’ అని దుయ్యబట్టారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు స్టీల్‌ప్లాంట్‌, ఖాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, ఐఐఎం, ట్త్రెబల్‌ యూనివర్సిటీలు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదన్నారు. మెడికల్‌ కళాశాలలు, నవోదయ విద్యాలయాలు ఒక్కటీ ఇవ్వకుండా తెలంగాణను విస్మరించిందన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు మంజూరైనా దాన్ని రద్దు చేశారని, దీనిపై కేంద్రం సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణే అని కేంద్రం స్వయంగా మెచ్చుకుందని, అయితే ఈ ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్ల సాయం అందించాలని నిటి ఆయోగ్‌ చెప్పినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.
కేంద్రం ఏమాత్రం సహకారం అందించకున్నా, విద్యుత్‌ పంపిణీలో, తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ 9ఏండ్ల హయాంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఇక మణిపూర్‌ ఘటనలు సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయాలని, ఇలాంటి సంఘటనల వల్ల దేశం ప్రతిష్ట అంతర్జాతీయంగా దిగజారిందని అన్నారు. ఈ అన్ని అంశాల దృష్ట్యా అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తున్నట్టు తెలిపారు.

Spread the love