లండన్‌లో పలువురిపై కత్తితో దాడి .. నిందితుని అరెస్ట్‌

నవతెలంగాణ – లండన్‌ : కత్తితో పలువురిపై దాడి చేసిన ఓ వ్యక్తిని తూర్పు లండన్‌లోని హైనాల్ట్‌ నుండి అదుపులోకి తీసుకున్నట్లు మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలిపారు. ఉదయం 7 గంటలకు ఓ వాహనం ఇంటిలోకి దూసుకువెళ్లినట్లు సమాచారం అందిందని, ఆ ఇంట్లోని వ్యక్తులు కత్తి పోట్లకు గురయ్యారని అన్నారు. ఆ సమయంలో అనుమానితుడు ఇద్దరు పోలీస్‌ అధికారులు సహా మరికొందరిపై దాడికి దిగాడని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుని దాడిలో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు లండన్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ పేర్కొంది. ఘటనా స్థలం నుండి నుండి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనకు ఉగ్రదాడితో సంబంధం లేదని అన్నారు. ఈ ఈ ఘటన గురించి విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని లండన్‌ మేయర్‌ తెలిపారు. మెట్రో పోలీస్‌ కమిషనర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నానని చెప్పారు. అధికారిక సమాచారం ప్రకారం.. 2023లో 14,577 కేసులతో లండన్‌లో కత్తితో దాడి కేసులు 20 శాతం పెరిగాయి. మహమ్మారికి ముందు 2020 మార్చిలో ఉన్న స్థాయిల కన్నా ఒకశాతం తక్కువ. ఇంగ్లండ్‌, వేల్స్‌లో కత్తితో దాడి కేసులు ఏడు శాతం పెరిగి 49,489కి చేరగా, అత్యధికంగా మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో 29 శాతం నమోదయ్యాయని జాతీయ గణాంకాల అధికారి తెలిపారు.

Spread the love