నన్ను నమ్మండి..ప్లీజ్‌

నన్ను నమ్మండి..ప్లీజ్‌– నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు : ప్రధాని నరేంద్ర మోడీ
– ఇదంతా ఓటు రాజకీయమే : ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: నేను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోన్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఈవిధంగా స్పందించారు.
”అది మా విధానం కాదు. నెహ్రూ కాలం నుంచే వారు (విపక్షాలను ఉద్దేశించి) ఈ కథనాలు ప్రచారం చేస్తున్నారు. ముస్లిం వ్యతిరేకులు అంటూ మాపై ఆరోపణలు చేస్తున్నారు. దానినుంచి లబ్ది పొందాలని చూస్తున్నారు. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి.. తాము వారికి స్నేహితులమంటూ కపట ప్రేమను ప్రదర్శిస్తారు. కానీ ముస్లిం సమాజం చైతన్యవంతంగా మారింది. త్రిపుల్‌ తలాక్‌ రద్దు చేసినప్పుడు వారి ఆందోళనపై నేను నిజాయతీగా ఉన్నానని ముస్లిం సోదరీమణులు భావించారు. ఆయుష్మాన్‌ కార్డులు ఇచ్చినప్పుడు, కోవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చినప్పుడు వారు అలాగే భావించారు. నేను ఎవరిపైనా వివక్ష చూపడం లేదని వారు అర్థం చేసుకున్నారు. విపక్షాల అబద్ధాలు బయటపడ్డాయి. అదే వారి బాధ. అందుకే తప్పుదోవ పట్టించేందుకు రకరకాల అబద్ధాలు చెప్తూనే ఉంటారు” అని మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు.
కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ”ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పున్ణపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చెప్పింది. ఆమేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు” అని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల్లో లబ్ది కోసం ఒక వర్గానికి వ్యతిరేకంగా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే మోడీ స్పందన వచ్చింది. అలాగే తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ముస్లిం వర్గానికి పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా జరిగిన మూడు విడతల పోలింగ్‌లో ఫలితాలు తారుమారు అవతాయని సంకేతాలు రావటంతో మోడీకి ముస్లింలపై ప్రేమవచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Spread the love