అంతా నా ఇష్టం..!

I like everything..!– ప్రభుత్వ వనరులతో ప్రధాని డిజిటల్‌ ప్రచారం…
– వాట్సాప్‌ సందేశాలు పంపుతున్న మోడీ
– పదేండ్ల పాలన ఎలా ఉందో చెప్పాలని సూచన
– విదేశీయులకూ మెస్సేజ్‌లు
– చేష్టలుడిగిన ప్రభుత్వ యంత్రాంగాలు
– పాలక పక్షానికి దాసోహం
ఎన్నికల సీజన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అంతా తానై వ్యవహరిస్తుంటారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌… ఇలా మాధ్యమం ఏదైనా ఆయన వదిలిపెట్టరు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా స్థానాలు గెలుచుకోవడమే ఆయన లక్ష్యం. అందుకోసం ప్రసార మాధ్యమాలన్నింటినీ ఆయన విరివిగా వాడుకుంటారు. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోరు. అవసరమైతే అధికార దుర్వినియోగానికీ వెనుకాడరు. తాజాగా ప్రధాని నుండి ఓటర్లకు వాట్సాప్‌ సందేశం ఒకటి వచ్చింది. అది ఓ లేఖ రూపంలో ఉంది. దానికి సమాధానం ఇవ్వాలని కూడా ఆయన కోరారు. ”వికసిత్‌ భారత్‌ సంపర్క్‌” నుంచి వచ్చిన ఈ లేఖ ఓ గొప్ప ప్రచార వ్యూహం తప్ప మరోటి కాదు. ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని ప్రభుత్వ వనరులను యధేచ్చగా ఉపయోగించుకుంటున్నారని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం.
న్యూఢిల్లీ : ‘వికసిత్‌ భారత్‌ సంపర్క్‌’ నుంచి ప్రజలకు వాట్సప్‌ సందేశాలు వస్తున్నాయి. పది సంవత్సరాల మోడీ పాలనపై అందులో ప్రజాభిప్రాయాన్ని కోరారు. ‘గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం నుంచి ఈ లేఖను పంపుతున్నాము. గత పది సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల ద్వారా 140 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రయోజనం పొందుతారు. వికసిత్‌ భారత్‌ ఆకాంక్షల సాధనకు మీ సూచనలు ఎంతో ముఖ్యం. కాబట్టి దయచేసి మీ సలహాలు, సూచనలు అందించండి’ అని ఆ లేఖలో సూచించారు. వికసిత్‌ భారత్‌, పబ్లిక్‌ అండ్‌ గవర్నమెంట్‌ సర్వీస్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, భారత ప్రభుత్వం, ఎలక్ట్రానిక్స్‌ నికేతన్‌, 6, సీజీఓ కాంప్లెక్స్‌, లోధీ రోడ్డు, న్యూఢిల్లీ చిరునామాతో ఈ సందేశాలు పంపుతున్నారు. సిటిజన్‌ వేదిక ‘మైగవ్‌’ ద్వారా ఈ ప్రచారం సాగుతోంది. డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌లో మైగవ్‌ ఓ భాగం. ఇది ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సెక్షన్‌ 8 కంపెనీ.
ఇదే మొదటిసారి కాదు…
వాట్సాప్‌ అకౌంట్‌ ఉన్న ప్రతి భారతీయుడికీ ఈ ప్రచార సందేశాన్ని పంపారు. మైగవ్‌లోని ప్రభుత్వ వనరులను ఉపయోగించుకొని సందేశాల ద్వారా ప్రచారం నిర్వహించడం ఇది మొదటిసారి కాదు. ఇటీవల ‘మేరా పెహలా ఓట్‌-దేశ్‌ కే లియే’ పేరిట చేపట్టిన ప్రచారాన్ని కూడా మైగవ్‌ వేదికే వ్యాప్తి చేసింది. బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోడీ తన పరిధిని దాటి ఎన్నికల కమిషన్‌ బాధ్యతలను కూడా తానే స్వీకరించి ఈ ప్రచారాన్ని నిర్వహించారు. దేశంలోని పౌరులు, ఓటర్లకే కాదు…. విదేశాలలో నివసిస్తున్న భారతీయులకు కూడా ఈ సందేశాలు చేరుతున్నాయి. దేశంలో ఓటర్లు కాని విదేశీయులకు కూడా వీటిని పంపుతున్నారు. వీరిలో పలువురు దీనిపై తమ అనుభవాలను పంచుకున్నారు కూడా.
ఇదేనా సమాచార గోప్యత ?
ఈ సందేశాలు చూసి యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌లోని వారు ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఓ విదేశీ ప్రభుత్వం తమ సమాచారాన్ని ఉపయోగించుకోవడంపై వారు ఖంగు తింటున్నారు. ఈ సందేశాలను చూసిన విదేశీయులు మన దేశంలో గోప్యతకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే దీనిని ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా చాలా మంది భావించడం లేదు. ఎన్నికల కమిషన్‌ను కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. తమ వ్యక్తిగత సమాచారాన్ని పొందేందుకు ఏ డేటాబేస్‌ను ఉపయోగించుకుంటు న్నారన్నదే వారిని కలవరపెడుతున్న ప్రశ్న.
కంచే చేను మేస్తే…
బీజేపీకి వివిధ వనరుల ద్వారా ఓటర్లకు సంబంధించిన సమాచారం తెలిసిపోతోంది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ పనిలో నిమగమైపోయింది. సమాచార బ్రోకర్లు, పార్టీ కార్యకర్తలు ఇందుకు సహకరిస్తున్నారు. సమాచారం తరచూ చేతులు మారుతోంది. పార్టీ సమాచారం ప్రభుత్వానికి, ప్రభుత్వ సమాచారం బ్రోకర్లకు చేరుతోంది.
వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారంతో రాజకీయ ప్రచారం సాగించేందుకు ఇప్పుడు హైబ్రిడ్‌ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. గత సంవత్సరం ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రొటెక్షన్‌ చట్టం ప్రకారం సమాచార పరిరక్షణ కోసం ఓ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎన్నికలకు ముందు గోప్యతకు సంబంధించిన ఉల్లంఘనలపై ఈ బోర్డు నిబంధనలు రూపొందించాలి. ఈ బోర్డు ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖకు జవాబుదారీగా ఉంటుంది. అయితే కంచే చేను మేసిన చందంగా ఈ మంత్రిత్వ శాఖే ప్రతి వ్యక్తికీ వాట్సప్‌ సందేశాలు పంపుతూ నిబంధనలను ఉల్లంఘిస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ, ప్రభుత్వ యంత్రాంగం కలిసిపోయాయి. పార్టీ పనులు, ప్రభుత్వ విధులకు తేడా లేకుండా పోయింది.
మౌనముద్రలో ఈసీ
మోడీ డిజిటల్‌ ఇండియా మిషన్‌లో మొబైల్‌ ఫోన్లకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. సంక్షేమ సొమ్మును నేరుగా లబ్దిదారుని ఖాతాలో వేసేందుకు ఆయన తీసుకొచ్చిన జన్‌ధన్‌ ఆధార్‌ మొబైల్‌ (జేఏఎం) విధానం విజయవంతమైంది.
ఆర్థిక, భద్రతా కారణాల పేరిట చేపట్టిన కేవైసీ విధానం రాజకీయ పార్టీల ప్రచారానికి బాగా ఉపయోగపడు తోంది. వాట్సప్‌ సందేశాలను గమనించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ వ్యవహారాన్ని మేటా వేదిక దృష్టికి తీసికెళ్లింది. సమాధానం రాకపోవడంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ప్రధాని నుండి వచ్చిన వాట్సప్‌ సందేశాలపై వ్యాఖ్యానించేందుకు ఈసీ కార్యాలయం నిరాకరించింది.
ప్రచార వేదికలుగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌
విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలు సహా ఎన్నికల సంబంధమైన అంశాలను ప్రచారం చేయడంలో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. తన డిమాండ్లకు తలవంచేలా ఈ సంస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ఐటీ నియంత్రణల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. బీజేపీ ఐటీ విభాగం ప్రచారానికి వాట్సప్‌ బాగా ఉపయోగపడుతోంది. బీజేపీకే అనేముంది? అన్ని పార్టీలకూ వాట్సాప్‌ ఇష్టమైన వేదికే. ఇక ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ నిధులను వాడుకోవడం కూడా పరిపాటిగా మారింది. కొందరు పనిగట్టుకొని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. ఇలాంటి వారితో మోడీ ప్రభుత్వం, బీజేపీ సన్నిహితంగా మెలగుతున్నాయి. వారిని ఆకట్టుకునేందుకు నేషనల్‌ క్రియేటర్‌ అవార్డులను ఎర వేస్తున్నాయి.
నియంత్రణలు, నిబంధనలకు పాతర
సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్న ప్రచారాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి నియంత్రణలు, నిబంధనలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. దీనిపై చర్యలు తీసుకోగలిగిన ఒకే ఒక సంస్థ కూడా అచేతనంగా ఉండిపోతోంది. నియంత్రణల కోసం డిమాండ్‌ చేయడానికి ప్రతిపక్షాలు కూడా ఆసక్తి చూపడం లేదు. రాజకీయ పార్టీలు తమకు ఇష్టం వచ్చి నట్లు వ్యవహరించవచ్చునన్న సంకేతాన్ని ఎన్నికల కమిషన్‌ పంపుతున్నట్లు కన్పిస్తోంది. స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన
బాధ్యత నుంచి అది దూరంగా జరిగిపోతోంది.

Spread the love