ప్యాసింజర్‌ రైలా అదెక్కడా?

Where is the passenger train?– అదే వేగం…అవే స్టాపులు
– ఛార్జీలు మాత్రం డబుల్‌
– ‘ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌’గా నామకరణం
– పేరులోనే ప్రత్యేకం… సౌకర్యాల్లో సాధారణమే
– కోవిడ్‌ తర్వాత మారిన సీను
న్యూఢిల్లీ : ‘నాన్నా. ప్యాసింజర్‌ రైలు అంటే ఏమిటి?’ అడిగాడో ఆరు సంవత్సరాల పిల్లవాడు తన తండ్రిని. బులెట్‌ రైలు, హైస్పీడ్‌ రైలు, ఎసీ బోగీల రైలు గురించి మాత్రమే అతనికి తెలుసు. మరి ఈ ప్యాసింజర్‌ రైలు ఎలా ఉంటుందో అతనికి ఎలా తెలుస్తుంది? అందుకే సందేహ నివృత్తి కోసం తండ్రిని ప్రశ్నించాడు. కొడుకు ప్రశ్నకు ఆ తండ్రి ‘అదా…మా కాలంలో ఆ రైళ్లు తిరుగుతుండేవి. పేదవారు, దిగువ మధ్య తరగతి ప్రజలు తక్కువ ఛార్జీతో వాటిలో ప్రయా ణించే వారు. నరేంద్ర మోడీ అనే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత వాటిని తీసేసారు’ అని జవాబిచ్చాడు. ఇది వినడానికి అతిశయోక్తిగా అనిపించినా ఇప్పుడు జరుగుతున్నది అక్షరాలా అదే.
రాబోయే కాలంలో ప్యాసింజర్‌ రైళ్ల శకం పూర్తిగా ముగిసినట్లే. ప్రస్తుతం అక్కడక్కడా మనకు కన్పిస్తున్న ప్యాసింజర్‌ రైళ్లకు ‘ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌’గా నామకరణం చేసి పట్టాలపై తిప్పుతున్నారు. ప్యాసింజర్‌ రైలు ప్రయాణికులకు సుపరిచితమైన పదం ‘రెండో తరగతి సాధారణ ఛార్జీ’. అయితే ఇకపై ఆ పదమూ వినిపించదు. ప్యాసింజర్‌ రైలును ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌గా మార్చేసినట్లుగానే అందులో ప్రయాణించే వారి నుండి కూడా ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇవి ప్యాసింజర్‌ రైలు ఛార్జీల కంటే దాదాపు రెట్టింపు ఉంటున్నాయి.
రైలు అదే…ఛార్జీ మాత్రం డబుల్‌ ! డెములు…మెములు
పోనీ ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌గా మార్చిన ప్యాసింజర్‌ రైళ్లలో సౌకర్యాలు ఏమైనా అదనంగా ఉంటాయా అంటే ఆ మాటే అడగొద్దు. అవే పాత బోగీలు, అవే రూట్లు. అవే స్టాపులు. చెన్నరు డివిజన్‌లో ఇప్పటికే ప్యాసింజర్‌ రైళ్ల స్థానంలో మెయిన్‌లైన్‌ ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్లు (మెము) తిరుగుతున్నాయి. తిరుచి, మదురై డివిజన్లలో డీజిల్‌ ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్ల (డెము)ను నడుపుతున్నారు. తెలంగాణలో కూడా నిజామాబాద్‌-కాచిగూడ, సికింద్రాబాద్‌-మనోహరాబాద్‌, నడికుడి-కాచిగూడ, కాచిగూడ-పెద్దపల్లి, మేడ్చల్‌-ఫలక్‌నుమా, మిర్యాలగూడ-కాచిగూడ, సిద్ధిపేట-సికింద్రాబాద్‌ మధ్య ఈ తరహా రైళ్లను నడుపుతున్నారు.
సిబ్బందితో వాదనలు
దక్షిణ రైల్వే బకింగ్‌ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఛార్జీల ఛార్టుల్లో కోవిడ్‌కు ముందు వసూలు చేసిన ఛార్జీలే దర్శనమిస్తున్నాయి. వాటిపై కన్పిస్తున్న రెండో తరగతి సాధారణ ఛార్జీలు ఇక ఎంతమాత్రం చెల్లుబాటు కావు. ‘చాలా సందర్భాలలో ప్రయాణికులు చార్టులపై ఉన్న ఛార్జీలను చూసి మాతో వాదనకు దిగుతున్నారు. వాటి కంటే రెట్టింపు మొత్తాన్ని ఎందుకు వసూలు చేస్తున్నారంటూ గొడవ పడుతున్నారు. ప్యాసింజర్‌ రైళ్లకు కాలం చెల్లిపోయిందన్న వాస్తవాన్ని వారు అర్థం చేసుకోవడం లేదు. యూటీఎస్‌ యాప్‌లు కూడా పాత ఛార్జీలనే చూపిస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి’ అని ఓ టికెట్‌ బుకింగ్‌ క్లర్కు వాపోయారు. ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే తన జోన్‌లో పాత ఛార్జీలనే పునరుద్ధరించింది. ఈ మేరకు ఈ నెల 22న ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్టేషన్లలో ఆగే మెము, డెము, ప్యాసింజర్‌ రైళ్లలో ప్రయాణించే వారి నుండి రెండో తరగతి సాధారణ ఛార్జీలను మాత్రమే వసూలు చేయాలని అందులో సూచించారు.
రికార్డుల్లో ప్యాసింజర్లేనట
ప్యాసింజర్‌ రైళ్లకు ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌గా పేరు పెట్టి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తుండడంతో 2022-23లో ప్రయాణికుల ద్వారా రైల్వే శాఖకు గణనీయమైన ఆదాయం లభించింది. గత సంవత్సరం దక్షిణ రైల్వే ప్రయాణికుల ఛార్జీల రూపంలో గరిష్ట స్థాయిలో రూ.6,345 కోట్లు ఆర్జించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 80% అధికం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమంటే ప్యాసింజర్‌ రైళ్లను ఉపసంహరించుకుంటున్నా మని, లేదా వాటిని ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌గా మార్చి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నామని రైల్వే శాఖ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై రైల్వే శాఖ సీనియర్‌ అధికారులను సంప్రదించగా ‘మా రికార్డుల ప్రకారం నెమ్మదిగా నడిచేవన్నీ ప్యాసింజర్‌ రైళ్లే. అయితే వాటినే ఛార్జీలు పెంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా నడుపుతున్నాం. డివిజన్లలో రోజువారీ సమయపాలన నివేదికల్లో మాత్రం వాటిని మేము ప్యాసింజర్‌ రైళ్లుగానే పిలుస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.
తడిసి మోపెడవుతున్న ఛార్జీలు
దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఎంజీఆర్‌ చెన్నరు సెంట్రల్‌ ఒకటి. ఇకపై సబర్బన్‌ రైళ్లలో సాధారణ ఛార్జీలతో ప్రయాణించడం కుదరదని అక్కడి బుకింగ్‌ క్లర్కులు చెబుతున్నారు. కొన్ని మార్గాలలో ఛార్జీలు రెట్టింపయ్యాయి. ఉదాహరణకు కోవిడ్‌కు ముందు ప్యాసింజర్‌ లేదా డెము రైలులో చెన్నరు నుండి తిరుపతికి ప్రయాణించాలంటే రూ.35 ఛార్జీ మాత్రమే అయ్యేది. అయితే కోవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత ఈ ఛార్జీని అమాంతం రూ.70కి పెంచేశారు. అలాగే చెన్నరు బీచ్‌ నుండి వెల్లూరుకు, చెన్నరు ఎగ్మోర్‌ నుండి పుదుచ్చేరికి గతంలో రూ.30, రూ.45గా ఉండే ఛార్జీని ఏకంగా రూ.65, రూ.80కి పెంచారు. పోనీ ఈ రైళ్ల వేగం ఏమన్నా పెరిగిందా అంటే అదీ లేదు. ‘అది ప్యాసింజర్‌ రైలు అయినా, ఎక్స్‌ప్రెస్‌ అయినా లేదా దాని స్టాపులు ఎన్ని ఉన్నా ఆ రైలు ఏ రకానికి చెందినది అనే విషయం ఆధారంగానే ఆర్డినరీ ఛార్జీని నిర్ణయిస్తారు. కోవిడ్‌కు ముందు ప్యాసింజర్‌ రైళ్లకు వర్తించిన రెండో తరగతి సాధారణ ఛార్జీలను రైల్వే శాఖ రద్దు చేసింది. ఇకపై ప్యాసింజర్‌ రైళ్లు ఉండవు’ అని సీనియర్‌ అధికారులు సెలవిచ్చారు.
పేదలకు ప్రయోజనకరంగా ఉన్నా…
ప్యాసింజర్‌ రైళ్లు దాదాపు అన్ని స్టేషన్లలో ఆగుతూ పేద ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వీధి వ్యాపారులు, వ్యవసాయ కార్మికులు,రోజువారీ  వేతనాలపై ఆధారపడి జీవించే వారు అతి తక్కువ ఛార్జీలతో నిత్యం వీటిలో ప్రయాణిస్తూ ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. రైల్వే వ్యవస్థలో అతి తక్కువ ఛార్జీలు ఉండేది  ప్యాసింజర్‌ బళ్లలోనే. ఇప్పుడు వాటిని ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌గా మార్చేసి ప్రయాణికుల నుండి అధిక ఛార్జీలు గుంజుతున్నారు.

Spread the love