పత్రికా స్వేచ్ఛపై పంజా.. న్యూస్‌క్లిక్‌పై మళ్లీ దాడి

Claw on press freedom.. Again attack on newsclick– పాత్రికేయుల లాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం
– ఉపా కేసులో పుర్కాయస్థ సహా పలువురి నిర్బంధం
– పోలీసు కార్యాలయానికి తీసికెళ్లి ప్రశ్నల వర్షం
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై మరోసారి పంజా విసిరింది. భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసింది. దేశానికి వ్యతిరేకంగా చైనా నుంచి నిధులు పొందుతోందన్న ఆరోపణ మోపి ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగింది. అందులో పనిచేస్తున్న పలువురు పాత్రికేయులు, ఉద్యోగుల నివాసాలపై ఢిల్లీ పోలీసులు దాడులు జరిపారు. కొందరు పాత్రికేయులను నిర్బంధించి వారి నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కొందరిని అరెస్ట్‌ కూడా చేశారని సమాచారం.
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో అప్పుడే తెలతెలవారుతోంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌కు చెందిన పలువురు పాత్రికేయులు, వ్యాఖ్యాతల నివాసాలపై నగర పోలీసులు ఒక్కసారిగా దాడులు చేశారు. న్యూస్‌క్లిక్‌ సంపాదకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ, రచయిత గీతా హరిహరన్‌, వీడియో జర్నలిస్ట్‌ అభిసార్‌ శర్మ, సీనియర్‌ పాత్రికేయులు భాషా సింగ్‌, ఊర్మిలేష్‌, వ్యాఖ్యాత అనింద్యో చక్రవర్తి, చరిత్రకారుడు సొహైల్‌ హష్మీ, వ్యంగ్యకారుడు సంజయ్ రాజౌర నివాసాలపై దాడులు జరిగాయి. పుర్కాయస్థను ఆయన నివాసం నుండి తొలుత న్యూస్‌క్లిక్‌ కార్యాలయానికి, ఆ తర్వాత ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం కార్యాలయానికి తీసుకెళ్లారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పదిహేను మంది పోలీసులు ఉదయం 6.30-7.00 గంటల మధ్య పుర్కాయస్థ నివాసానికి చేరుకొని ముందుగా ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పుర్కాయస్థ భాగస్వామి గీతా హరిహరన్‌కు చెందిన పరికరాలను కూడా తీసుకున్నారు. ఆ సమయంలో వారు ఎలాంటి పత్రాలు చూపలేదని, ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకున్నట్లు రశీదు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. న్యూస్‌క్లిక్‌లో వివిధ హోదాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, పాత్రికేయుల నివాసాలపై కూడా పోలీసులు దాడి చేసి వారి నివాసాల నుండి కంప్యూటర్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. రైతుల నిరసనల పైన, కోవిడ్‌ పైన గతంలో ఏవైనా వార్తలు రాశారా అంటూ ఆరా తీశారు. పాత్రికేయుడు భాషా సింగ్‌ నివాసంలో రెండు గంటలకు పైగా సోదాలు జరిగాయి. ఢిల్లీ సైన్స్‌ ఫోరంకు చెందిన శాస్త్రవేత్త, రచయిత డి.రఘునందన్‌ను కూడా పోలీసులు నిర్బంధించి తీసికెళ్లారు. పోలీసులు తమ లాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, టెలిఫోన్లు స్వాధీనం చేసుకొని తీసికెళ్లారని పలువురు ఉద్యోగులు తెలిపారు.
న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న, గతంలో పనిచేసిన పాత్రికేయు లు, విలేకరులు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిపారు. వీరిలో హిందూ దినపత్రిక మాజీ పాత్రికేయులు, న్యూస్‌క్లిక్‌ కంట్రిబ్యూటర్‌ అనురాధా రామన్‌, సత్యా తివారీ, అదితి నిగమ్‌, సుమేధా పాల్‌ ఉన్నారని సమాచారం. తివారీని అరెస్ట్‌ చేశారని తెలిసింది. సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌, ప్రముఖ పాత్రికేయుడు పరంజరు గుహ ఠాకూర్తా నివాసాలపై కూడా దాడులు జరిగాయి. ముంబయిలో నివసిస్తున్న తీస్తాను ఢిల్లీ పోలీసు అధికారులు ప్రశ్నిం చారు. తీస్తా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సామాజిక పరిశోధనా సంస్థ ‘ట్రికాంటి నెంటల్‌’ న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌కు వ్యాసాలు అందిస్తోంది.
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో గతంలో పనిచేసి ప్రస్తుతం న్యూస్‌క్లిక్‌తో అనుబంధం కొనసాగిస్తున్న పాత్రికేయుడు సుబోధ్‌ వర్మ ఇంటిపై కూడా దాడి జరిగింది. దాడులు చేసిన తర్వాత ఊర్మిలేష్‌, పరంజరు గుహ ఠాకూర్తా, అభిసార్‌ శర్మ, ప్రబీర్‌ పుర్కాయస్థ, సత్యం తివారీలను ప్రశ్నించే నిమిత్తం ఢిల్లీ పోలీసు కార్యాలయానికి తరలించారు. అక్కడికి న్యాయవాదులను అనుమతించలేదు. ఉదయం నుండి తన క్లయింటును కలవనీయడం లేదని ఊర్మిలేష్‌ న్యాయవాది గౌరవ్‌ యాదవ్‌ చెప్పారు.
పలు సెక్షన్ల కింద కేసులు
న్యూస్‌క్లిక్‌ ఉద్యోగులను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి (ఉపా) సంబంధించిన కేసులో పోలీసులు విచారించారు. ఈ సంవత్సరం ఆగస్ట్‌ 17న నమోదైన ఎఫ్‌ఐఆర్‌ (224/2023)కు సంబంధించి ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. అత్యంత క్రూరమైన ఉపా చట్టంలోని 13, 16, 17, 18, 22 సెక్షన్ల కింద ఈ ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష తదితర కారణాలతో సమాజంలోని వివిధ వర్గాల మధ్య ద్వేషభావం రేకెత్తించారంటూ ఐపీసీలోని 153(ఏ) సెక్షన్‌ను, నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారంటూ ఐపీసీలోని 120 (బీ)ని కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
వారి పని వారు చేస్తున్నారు : అనురాగ్‌ ఠాకూర్‌ సమర్ధన
దాడులపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను పాత్రి కేయులు ప్రశ్నించగా ‘విచారణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. నిబం ధనల ప్రకారం వారి పని వారు చేస్తున్నారు. దాడులను సమర్ధించాల్సిన అవ సరం నాకు లేదు. ఎవరైనా తప్పు చేస్తే విచారణ సంస్థలు తమ పని తాము చేస్తా యి. తప్పుడు వనరుల నుండి మీకు డబ్బు వచ్చినా, అభ్యంతరకరమైనది ఏదైనా జరిగినా విచారణ సంస్థలు చర్య తీసుకోకూడదని ఎక్కడా రాసిలేదు’ అని బదులిచ్చారు.
చైనా నిధుల ఆరోపణలతో…
న్యూస్‌క్లిక్‌ ఉద్యోగులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ మూలాలు ఆగస్ట్‌లో న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో వచ్చిన నివేదికలో ఉన్నాయి. అమెరికాకు చెందిన ఓ కోటీశ్వరుడు చైనా ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా చైనా ప్రచారానికి నిధులు సమకూరుస్తున్నారని ఆ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికనే లోక్‌సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ప్రస్తావిస్తూ భారత్‌ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్‌ నేతలు, న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ చైనా నుండి నిధులు పొందాయని ఆరోపించారు.
ఆందోళనకరం

– పాత్రికేయ సంఘాలు
న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ పాత్రికేయులపై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపాయి. దాడుల విషయంలో తగిన ప్రక్రియను అనుసరించాలని ప్రభుత్వా నికి ఎడిటర్స్‌ గిల్డ్‌ సూచించింది. ఈ దాడి మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రత్యేక నేరాలకు సంబంధించి జరిపే దర్యాప్తు క్రూరమైన చట్టాల నీడలో భయభ్రాంతులకు గురిచేసే వాతావరణాన్ని కల్పించకూడదు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేదిగా, విమర్శకుల గొంతు నొక్కేదిగా ఉండకూడదు’ అని ఆ ప్రకటన తెలిపింది. దాడులపై తాను తీవ్ర ఆందోళన చెందుతున్నానని ప్రెస్‌ క్లబ్‌ వ్యాఖ్యా నించింది. పాత్రికేయులకు సంఘీ భావం తెలిపింది. కేసుకు సంబంధించిన వివరాలు బయటపెట్టాలని ప్రభుత్వా న్ని కోరింది. డిజిటల్‌ వార్తలు అందించే 11 సంస్థలకు చెందిన డిజిపబ్‌ న్యూస్‌ ఇండియా ఫౌండేషన్‌, ముంబయి ప్రెస్‌ క్లబ్‌ కూడా దాడులను ఖండించాయి. ఇది ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి, భయపెట్టే చర్యకు మరో నిదర్శనమని, ఈ పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని సామాజిక మాధ్యమాలలో డిజిపబ్‌ పోస్ట్‌ చేసింది. నిస్పక్షపాతంగా విచారణ జరపాలని ముంబయి ప్రెస్‌ క్లబ్‌ కోరింది. ఇది పత్రికా స్వేచ్ఛను అణచివేయడమేనని మీడియా నిపుణుల ఫౌండేషన్‌ విమర్శించింది. రైతులు, కార్మికుల సమస్యలను వెలుగులోకి తెస్తున్నందునే న్యూస్‌క్లిక్‌ను ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్నదని పాత్రికేయుల జాతీయ కూటమి, ఢిల్లీ పాత్రికేయుల సంఘం, కేరళ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (ఢిల్లీ శాఖ) ఓ ప్రకటనలో ఆరోపించాయి.
గొంతు నొక్కుతున్నారు
–  ఇండియా కూటమి మండిపాటు
న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌పై జరిగిన దాడిని ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్రంగా ఖండించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా నిజాన్ని నిర్భయంగా చెప్పే మీడియా సంస్థలను ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని, వాటి గొంతు నొక్కుతోందని విమర్శించింది. దీనిని పరిణితి చెందిన ప్రజాస్వామిక దేశంలో మీడియాపై జరిగిన తాజా దాడిగా అభివర్ణించింది. ఈ మేరకు ఇండియా కూటమి ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పాత్రికేయులు దేశంలో విద్వేషాలను రేపి, ప్రజలను విభజిస్తు న్నారని ఆరోపిస్తూ వారిపై బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాస్తవానికి దేశం ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. వాటి నుండి, తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోంది. ప్రభుత్వం వెంటనే ఇటువంటి చర్యలకు స్వస్తి చెప్పి దేశానికి, ప్రజలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలి’ అని ఆ ప్రకటనలో ఇండియా కూటమి సూచించింది. బీబీసీ, న్యూస్‌లాండ్రీ, దైనిక్‌ భాస్కర్‌, భారత్‌ సమాచార్‌, ది కాశ్మీర్‌ వాలా, ది వైర్‌ వంటి మీడియా సంస్థలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగి స్తోందని ఆరోపించింది. పెట్టుబడిదారులతో మీడియా సంస్థలను కొనిపించి వాటిని తన పక్షపాతపూరితమైన, సైద్ధాంతిక ప్రయోజనాల ప్రచారానికి బీజేపీ ఉపయోగించుకుంటోందని తెలిపింది. ‘వాస్తవాలు మాట్లాడే స్వతంత్ర పాత్రియులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రభుత్వం, దాని సిద్ధాంతాలకు అనుబంధంగా ఉండే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. పైగా సమాచార సాంకేతిక నిబంధనల వంటి తిరోగమన విధానాలను అవలంబిస్తూ మీడియా సంస్థలకు కళ్లెం వేయాలని చూస్తున్నాయి. తద్వారా ప్రజలకు తన తప్పిదాలు తెలియకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. మన దేశం పరిణితి చెందిన ప్రజాస్వామిక దేశమన్న అభిప్రాయం ప్రపంచ దేశాలలో నెలకొని ఉంది. దానిని బీజేపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది’ అని ఇండియా కూటమి మండిపడింది. భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు నిరంతరం కృషి చేస్తున్న మీడియాకు సంఘీభావం తెలిపింది. కాంగ్రెస్‌ ప్రతినిధి పవర్‌ ఖేరా, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ తదితరులు కూడా ఈ దాడులను నిరసించారు.

Spread the love