మోడీ మోసం!

– నానో ఎరువు పేరుతో నకిలీ పరిష్కారం
– నిరూపణకాని ఫలితాలు
– దిగుబడి క్షీణత
– ఆహార భద్రతకు ముప్పు
జీవవైవిధ్యం ప్రశ్నార్ధకం
నానో ఎరువుల పనితనం ఇఫ్కో చెప్పినట్టు లేదని అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో పాటు దేశీయ శాస్త్రవేత్తలు సైతం ఢంకా భజాయించి చెపుతున్నారు. నానో ఎరువుల వాడకం వలన మొక్కలకు కావాల్సిన పోషకాలు సమపాళ్లలో అందుతాయనికానీ, దిగుబడి పెరుగుతుందనికానీ, భూసారంలో సమతుల్యత స్థిరంగా ఉంటుందని కానీ పరిశోధల్లో నిరూపితం కాలేదు. ఒక సీజన్‌కే ఒక ప్రాంతంలోనే పరిశోధనలు జరిగాయి. అనేక సీజన్లలో అనేక ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పరిశోధనలు జరగాలి. జీవవైవిధ్యం సంగతేంటో తేల్లేదు. పైగా నానో యూరియా వలన భూమిలో నత్రజని నిల్వలు తగ్గిపోతు న్నాయి. దాంతో ఇంకా ఎక్కువ యూరియా అవసరమవు తుంది. దిగుబడి పెరగడమేమో ఉత్పాదకతలో క్షీణత కనిపిస్తోంది. దీనివలన ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనియత వాతావరణ, ఖరీదైన ఎరువులు, అధిక ఆహార ద్రవ్యోల్బణం సమస్యల నుంచి బయట పడటానికి మోడీ ప్రభుత్వం నానో పేరిట నకిలీ పరిష్కారమార్గాన్ని కనుగొంది. ఈ చర్య అసలు సమస్యల నుంచి రైతులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న నానో యూరియా ప్రాజెక్టు పెద్ద మోసమని అంతర్జాతీయ, జాతీయ పరిశోధనల్లో నిర్ధారణవుతోంది. సంప్రదాయ యూరియాకు బదులు నానో యూరియాను రైతులు ఉప యోగించాలని, ఖర్చు తక్కువ, పంట దిగుబడులు ఎక్కువొస్తాయని మోడీ సర్కారు మీడియాలో అమిత ప్రచారం చేస్తోంది. కాగా ప్రతిష్టాత్మక కొపెన్‌ హగెన్‌ యూనివర్శిటీకి చెందిన మాక్స్‌ ఫ్రాంక్‌, సోరెన్‌ హూస్టెడ్‌లు నానో యూరియాపై పరిశోధనలు చేసి అంతా అంబక్కని తేల్చారు. అశాస్త్రీయమని పత్రాలు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రముఖ వెబ్‌ మీడియా సంస్థ ‘ది వైర్‌’ తెలిపింది. నానో యూరియాకు శాస్త్రీయత లేదని, యూరియాపై సరైన పరిశోధనలు జరగలేదని, నిర్ధారణలు లేవని తాజాగా కథనాన్ని ప్రచురిం చింది. నానో ఎరువుల వలన భవిష్యత్తులో పంటల ఉత్పత్తిలో క్షీణత నెలకొని ప్రజల ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొంది. నానో యూరియాపై మోడీ ప్రభుత్వం చేసిన ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని వారి అధ్యయనంలో తేలింది. దేశంలోనూ అటువంటి అధ్యయనాలు జరగ్గా పేలవ ఫలితాలే వెలువడ్డాయి.
ఇఫ్కో ఉత్పత్తి
సహకార రంగంలోని ఇఫ్కో సంస్థలో కేంద్ర ప్రభుత్వ వాటాలు 41 శాతం ఉన్నాయి. ఇఫ్కో సంస్థ నానో యూరియాను కనుగొన్నట్టు వెల్లడిం చింది. రైతులు నానో యూరియాను ఉపయోగిస్తే మొక్కలు యూరియాను త్వరగా సంగ్రహిస్తాయని, భూమిలో నత్రజని నిల్వలు పెరుగుతాయని, దిగుబడి 8 శాతం అధికంగా లభిస్తుందని, ఖర్చు తక్కువని పర్యావరణ హితమని ప్రకటించింది. సంప్రదాయ యూరియాతో పోల్చితే పంటలపై అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని తెలిపింది. సాధారణ యూరియా 45 కిలోల బస్తాకు ప్రత్యామ్నాయంగా ద్రవ రూపంలోని నానో 500 మిల్లీలీటర్ల బాటిల్‌ను స్ప్రే చేస్తే సరిపోతుందని సిఫారసు చేసింది. ఇఫ్కో సమాచారంపై ఆదారపడి నానో యూరియా ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లో ప్రత్యేకంగా కర్మాగారాన్ని నెలకొల్పింది. ఇక్కడ నానో డిఎపిని కూడా ఉత్పత్తి చేస్తోంది. దేశీయంగా నానో ఎరువుల ఉత్పత్తి కారణంగా ఎరువుల దిగుమతులపై ప్రభుత్వం చేసే ఖర్చు తగ్గుతుందని ఆశించారు. ఏడాదికి ఎరువుల దిగుమతులకు రూ.15 వేల నుంచి 20 వేల కోట్ల వ్యయం తగ్గుతుందని అంచనా వేశారు. ఈ ఊపులో 2025 నుంచి విదేశాల నుంచి ఎరువుల దిగుమతులు ఆపేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పింది. బలవంతంగా రైతులకు నానో యూరియాను అంటగట్టే ప్రయత్నం చేసింది. సాధారణ యూరియా కేటాయింపులను తగ్గించి ప్రత్యామ్నాయం అంటూ నానో ఎరువులను పంపింది. దాంతో గుజరాత్‌ రాష్ట్రం కచ్‌ ప్రాంత రైతుల ఈ ఆగస్టు 15న పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.

Spread the love