కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారు?

When will democracy be restored in Kashmir?– కేంద్రాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం
– రాష్ట్ర హోదాపై రేపు ప్రకటన : సుప్రీంకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌, లఢక్‌లలో ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్దిష్ట కాలపరిమితికి లోబడి జమ్మూకాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి ఉండవచ్చునని అంటూ… తిరిగి ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయి రాష్ట్రంగా ఎప్పుడు మారుస్తారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రశ్నించారు. దీనిపై కేంద్రం నుంచి సూచనలు పొందాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, తుషార్‌ మెహతాలను ఆదేశించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది మన దేశానికి కీలకమని గుర్తు చేశారు. కాగా, జమ్మూకాశ్మీర్‌పై ఈ నెల 31న సవివరంగా ప్రకటన చేస్తానని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మంగళవారం నివేదించింది. జమ్మూకాశ్మీర్‌కు కల్పించిన కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని తెలిపింది. లఢక్‌ మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటుందని స్పష్టం చేసింది. లఢక్‌లో సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని తెలియజేసింది. ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానానికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ సమాచారం అందజేశారు. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ జమ్మూకాశ్మీర్‌లో సుదీర్ఘ కాలం ఎన్నికలు జరపకుండా ఉండడాన్ని
అనుమతించబోమని స్పష్టం చేసింది. కాగా సోమవారం జరిగిన విచారణలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ రాజ్యాంగంలోని 35-ఏ అధికరణను ప్రస్తావించారు. ఈ ఆర్టికల్‌ జమ్మూకాశ్మీర్‌ వాసులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తోందని, అదే సమయంలో ఇతరుల ప్రాథమిక హక్కులను నిరాకరిస్తోందని ఆయన చెప్పారు. ‘ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్మూకాశ్మీర్‌లోని శాశ్వత నివాసితులకు ప్రభుత్వోద్యోగాలు పొందే హక్కు ఉంది. ఆస్తుల కొనుగోలు చేసే హక్కు ఉంది. ఆ రాష్ట్రంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. అయితే వేరే ప్రాంతాలకు చెందిన వారికి ఈ హక్కులు నిరాకరించారు’ అని తెలిపారు. ఈ ప్రత్యేక సదుపాయాలపై న్యాయ సమీక్ష జరగకుండా ఈ ఆర్టికల్‌ రక్షణ కల్పించిందని ఆయన గుర్తు చేశారు.

Spread the love