– సుప్రీంకోర్టు తీర్పులూ బేఖాతరు
– ఎన్నికల కమిషన్‌పైనా పెత్తనం
– ఏకపక్షంగా బిల్లులు అమోదించుకున్న కేంద్రం
పార్లమెంట్ సమావేశాల చివరి రోజు మోడీ ప్రభుత్వం బ్రిటీష్ కాలం నాటి చట్టాలను మార్చే పేరుతో మూడు బిల్లులను హిందీ పేర్లతో ప్రవేశపెట్టింది. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య (బీఎస్) బిల్లులను సభ ముందు ఉంచింది.
అయితే పాత చట్టాలలోని నిబంధనలను, శిక్షలను ఈ బిల్లులలో మరింత కఠినతరం చేశారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే వీటి ఉద్దేశమని ప్రతిపక్షాలు విమర్శించాయి. పైగా కొత్త బిల్లులకు హిందీ పేర్లు రుద్దడంపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసి మూడు రోజులు గడిచాయి. ఉభయ సభలు నడిచిన తీరును దేశమంతా గమనించింది. అయితే సభా కార్యకలాపాలకు సంబంధించి కొన్ని వాస్తవాలు వెలుగు చూడకుండానే మరుగున పడ్డాయి. ప్రభుత్వం కోరుకున్నది కూడా అదే. ఉదాహరణకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్నికల కమిషన్ బిల్లునే తీసుకుందాం. రాజ్యాంగంలోని 324 (2) అధికరణను పరిశీలిస్తూ ఈ సంవత్సరం ప్రారంభంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మొండిగా ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర సభ్యుల ఎంపిక పార్లమెంట్ చట్టానికి, రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఎన్నికల కమిషన్ బిల్లు దీనికి విరుద్ధంగా ఉంది. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులోని సెక్షన్ 6 ప్రకారం ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న వారి పేర్లను కేబినెట్ నేతృత్వంలోని కమిటీ నియామక ప్యానల్‌కు ప్రతిపాదించాలి. అయితే అదే బిల్లులోని సెక్షన్ 8 (2) ప్రకారం కమిటీ ప్రతిపాదించిన వారిని కాకుండా నియామక బృందం వేరే వ్యక్తులను కూడా ఎన్నికల కమిషన్‌లో నియమించవచ్చు. ఎన్నికల కమిషన్ నియామక కమిటీ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నియమించిన కేంద్ర మంత్రి మాత్రమే సభ్యులుగా ఉంటారు. అంటే ఎన్నికల కమిషన్ నియామకం విషయంలో అధికార పార్టీ మాటే చెల్లుబాటు అవుతుంది. ఎన్నికల కమిషన్‌ను అవమానించడానికే నియామకాల ప్రక్రియలో సీజేఐ ప్రమేయం లేకుండా చేశారని న్యాయ కోవిదుడు గౌతమ్ భాటియా అభిప్రాయం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చట్టసభలను, ఇతర సంస్థాగత సాధనాలను ఉపయోగించుకొని తన కేంద్రీకృత అజెండాను అమలు చేసేందుకే ఇలాంటి బిల్లులు తీసుకొస్తోందని, తద్వారా తన ఆధిపత్యాన్ని బలపరచుకుంటోందని న్యాయ నిపుణులు తెలిపారు. అసలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రభుత్వంలో ‘జవాబుదారీతనం’ అనేదే కానరాలేదు. మణిపూర్ ఘర్షణలపై ప్రతిపక్షాలు అరచి గీపెట్టినా అటు ప్రధానిలో కానీ, ఇటు హోం మంత్రిలో కానీ సరైన స్పందన కన్పించలేదు. డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు ఆమోదం పొందే విషయంలో కూడా ప్రభుత్వం తొందరపాటుగానే వ్యవహరించింది. ఈ బిల్లు వ్యక్తిగత సమాచార గోప్యతకు విఘాతం కలిగిస్తుందని అనేకమంది మేధావులు, ప్రజాస్వామ్యవాదులు గగ్గోలు పెట్టినప్పటికీ ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఈ బిల్లులో పొందుపరచిన కొన్ని మినహాయింపులు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయని తెలిసినప్పటికీ మోడీ ప్రభుత్వం ముందుకే వెళ్లింది. అనేక ఇతర బిల్లుల విషయంలో కూడా ఈ వర్షాకాల సమావేశాలు సరైన దృష్టి సారించలేకపోయాయి. కీలకమైన అంశాలకు తగిన ప్రాధాన్యత లభించలేదు. ఏదైనా బిల్లు చట్టరూపం దాలిస్తే కేంద్రానికి దానిని నిర్వచించేందుకు, అమలు చేసేందుకు విశేషాధికారాలు సంక్రమిస్తాయి.
రాజధాని ఢిల్లీలో సేవల బిల్లు విషయంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కొట్టొచ్చినట్లు కన్పించింది. దీనిపై ఉభయ సభలలోనూ విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ ప్రభుత్వం సంఖ్యా బలంతో దానిని నెగ్గించుకుంది. ఇప్పుడు రాజధానిలో సేవల విషయంలో కేంద్రానికి అపరిమితమైన అధికారాలు లభించాయి. అధికారుల నియామకాలు, బదిలీలు అన్నీ కేంద్రం చేతిలోకే వెళ్లాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ‘సూపర్ సీఎం’గా వ్యవహరించే ప్రమాదం ఏర్పడింది. ఇది నిజంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం నిమిత్తమాత్రంగా ఉండిపోతుంది. కనీసం శాసనసభ సమావేశాలు నిర్వహించే అధికారం కూడా దానికి లేకుండా పోయింది. ఢిల్లీ సర్వీసులపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ మోడీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది.