– ఆర్థికశాఖకు సీఎం ఆదేశాలు-జీవో జారీ
– పంద్రాగస్టు వేళ అన్నదాతకు సర్కారు తీపి కబురు
– 9,02,843 మంది రైతులకు లబ్ది
– మొత్తం రూ.5,809.78 కోట్లు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్వాతంత్య్ర దినోత్సవ వేళ రైతాంగానికి ప్రభుత్వం మరో తీపి కబురును అందించింది. అన్నదాతలను రుణ విముక్తులను చేసేందుకు వీలుగా మరో దఫా రుణమాఫీకి నిధులను విడుదల చేయాలంటూ సీఎం కేసీఆర్ ఆర్థికశాఖను ఆదేశించారు. రూ.99,999 వరకూ ఉన్న రుణాలను రైతుల తరఫున బ్యాంకులకు చెల్లించాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి రామకష్ణారావుకు సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణమే జమ చేయాలని తెలిపారు. దీంతో సోమవారం 9,02,843 మంది రైతులకు సంబంధించి మొత్తం రూ.5,809.78 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యేడాది డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఎన్నికల హామీల్లో కూడా దశలవారీగా రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆయన భావించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి సమగ్ర వివరాలు తెప్పించుకున్నట్టు తెలిపింది. ఇదంతా జరగడానికి ఏడాది సమయం పట్టింది. అనూహ్యంగా కరోనా విజృంభించటం, లాక్‌డౌన్ ఉండడం, దేశంలో నోట్ల రద్దు తదితర పర్యవసానాలతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒడిదొడుకులకు గురైందని సీఎంవో ఈ సందర్భంగా పేర్కొంది. దీంతో ప్రభుత్వానికి వనరులు సమకూరడంలో ఇబ్బంది ఏర్పడింది. అయినా రూ.50వేల లోపున్న రుణాలను (7,19,488 మంది రైతులకు సంబంధించి రూ.1,943 కోట్లను) బ్యాంకులకు చెల్లించింది. ఈ మొత్తాన్ని రైతు రుణమాఫీ కింద బ్యాంకు ఖాతాల్లో సర్దుబాటు చేసింది. మిగిలిన మొత్తాన్ని కూడా మాఫీ చేయడానికి నిధులు సమకూర్చుకున్నది. తాజాగా రూ.99,999 వరకూ ఉన్న రుణాలకు సంబంధించి 5,809.78 కోట్లను విడుదల చేసింది.
45 రోజుల కార్యాచరణ…
రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం 45 రోజుల కార్యాచరణను చేపట్టింది. ఈనెల మూడున రూ.41వేల లోపు రుణాలున్న 62,758 మంది రైతులకు సంబంధించి రూ.237.85 కోట్లను విడుదల చేశారు. నాలుగున రూ.43 వేల లోపు రుణాలున్న 31,339 మంది రైతులకు సంబంధించి రూ.126.50 కోట్లను మాఫీ చేస్తూ నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తాజాగా రూ.99,999 వరకూ ఉన్న రుణ మొత్తాలను ప్రభుత్వం బ్యాంకులకు జమ చేసింది. దీంతో మొత్తం రూ.7,753.43 కోట్లను (అన్ని దఫాలు, అన్ని రుణాలు, రైతులందరికీ కలిపి) పభుత్వం రుణమాఫీ కింద చెల్లించినట్టు అధికారులు వెల్లడించారు. కాగా 2014లో బీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పటి వరకు రూ.లక్ష వరకూ ఉన్న సర్కారు మాఫీ చేసింది. తద్వారా 35.32 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ది చేకూరింది. అందుకోసం ప్రభుత్వం రూ.16, 144 కోట్లను వెచ్చించింది. కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండానే ఈ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించి రైతులను రుణ విముక్తులను చేసింది.
రైతు బీమా.. రైతు బంధు…
మరోవైపు ప్రతీ రైతుకు బీమా సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం.. సంబంధిత ప్రీమియం మొత్తాన్ని తానే భరిస్తున్నది. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఇప్పటి వరకు మరణించిన రైతులకు సంబంధించి 1,08,051 మంది కుటుంబాలకు అండగా నిలిచింది. రూ.5,402.55 కోట్లను ఆయా కుటుంబాలకు పరిహారంగా అందించింది. రైతు మరణించిన కేవలం 15 రోజుల్లోనే బీమా సొమ్ము రైతులకు అందేలా ఏర్పాట్లు చేసిన సంగతి విదితమే. దీంతోపాటు 65 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా ‘రైతు బంధు’ పథకాన్ని రూపొందించారు. తద్వారా ఎకరానికి సాలీనా 10వేల చొప్పున ఇప్పటి వరకూ 11 విడతల్లో కలిపి మొత్తం రూ.71, 552 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రతీయేటా రైతు బంధు అందుకునే రైతుల సంఖ్య పెరుగుతున్నది. ఈసారి కొత్తగా పోడుపట్టాలున్న వారికి కూడా రైతుబంధు, రైతు బీమా వర్తింపజేశారు. దీంతో 1,51,469 మంది గిరిజన రైతులకు (4.06 లక్షల ఎకరాలకు సంబంధించి) ప్రభుత్వం ఇప్పటికే రూ. 200 కోట్లను రైతు బంధు కింద విడుదల చేసింది. ఇది ఈ సీజన్‌కు మాత్రమే. ఈ రకంగా ఏడాదికి రూ.400 కోట్లను పోడు రైతులకు రైతుబంధు కింద అందించనున్నామని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలోని 27.49 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్లు సీఎంవో తెలిపింది. గత తొమ్మిదేండ్లలో ఇందుకోసం రూ.96,288 కోట్లను ఖర్చు చేసినట్టు వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి ఆ రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.32,700 కోట్లను ఖర్చు చేసినట్టు వివరించింది.