అనమణిపూర్‌ శాసనసభ వాయిదా

Adjournment of Anamanipur Assembly– హింసపై చర్చకు మరింత సమయం అవసరం : కాంగ్రెస్‌ డిమాండ్‌
ఇంఫాల్‌ : సమావేశం ప్రారంభమైన గంటకే మణిపూర్‌ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. సభను కేవలం ఒకే ఒక రోజు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కనీసం ఐదు రోజుల పాటు సభ జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు ఒక రోజు సమయం చాలదని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఒక్రం ఇబోబి సింగ్‌ చెప్పారు. కాగా శాసనసభ సమావేశానికి కుకీ తెగకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. శాసనసభ మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశమైంది. మే 3వ తేదీ నుండి కుకీలు, మైతీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తొలుత ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ప్రసంగిస్తూ హింసాకాండలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలను ఓదార్చడానికి మాటలు రావడం లేదని చెప్పారు. చర్చలు, శాంతియుత పద్ధతుల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని, రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాలని శాసనసభ తీర్మానించింది. ‘కులం, మతం, జాతి, భాష ఏదైనా మణిపూర్‌ ప్రజలందరి మధ్య సామరస్యం నెలకొల్పేందుకు ఈ సభ కట్టుబడి ఉంది. శాంతి స్థాపనే రాష్ట్ర ప్రాధాన్యత. రాష్ట్రంలో తిరిగి శాంతిని పునరుద్ధరించే వరకూ ప్రజల మధ్య నెలకొన్న విభేదాలను చర్చలు, రాజ్యాంగ పద్ధతుల ద్వారా పరిష్కరించేందుకు ఈ సభ కట్టుబడి ఉంది’ అని తీర్మానం తెలిపింది. ఆ వెంటనే కాంగ్రెస్‌ సభ్యులు ‘అవహేళనలు ఆపండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితిపై చర్చించేందుకు కనీసం ఐదు రోజుల పాటు సభను నడపాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన కొనసాగడంతో స్పీకర్‌ సభను అరగంట పాటు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా కాంగ్రెస్‌ సభ్యులు నిరసన కొనసాగించారు. ఇలా అయితే సభను నడపలేమని అంటూ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

Spread the love