కుకీలకు ప్రత్యేక పరిపాలనకు వ్యతిరేకంగా

– ఈ నెల 21న మణిపూర్‌ అసెంబ్లీలో తీర్మానం?
– సీఎం బీరేన్‌కు ఎనిమిది మంది నాగా ఎమ్మెల్యేల మద్దతు
ఇంఫాల్‌ : ఈ నెల 21న జరిగే మణిపూర్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ముందు ఎనిమిది మంది నాగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌కు తమ మద్దతును ప్రకటించడం విశేషంగా మారింది. కుకీలకు ప్రత్యేక పరిపాలన అనే డిమాండ్‌కు వ్యతిరేకంగా ఈ అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి నాగా ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. మూడు నెలలు పై నుంచి మణిపూర్‌లో హింసాకాండ చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కుకీలకు ప్రత్యేక పరిపాలన కావాలనే డిమాండ్‌ ఊపందుకుంది. దీనిని మెయితేలు వ్యతిరేకిస్తున్నారు. కుకీల డిమాండ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని మెయితే గ్రూపునకు చెందిన ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ భావిస్తున్నారు. బిరేన్‌ సింగ్‌కు ఎనిమిది మంది నాగా ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కుకీలకు ప్రత్యేక పరిపాలన వద్దని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వినతిపత్రం కూడా అంద చేశారు. అసెంబ్లీల్లో వివిధ పార్టీల నుంచి మొత్తం 10 మంది నాగా ఎమ్మెల్యేలు ఉన్నారు. నాగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి మద్దతు తెలపడంపై నాగాల సంఘాలు ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నాయి. ఎమ్మెల్యేల చర్య ‘నాగా ప్రజల సామూహిక మనోభావాలను తిరస్కరించింది’ అని యూఎన్‌సీ విమర్శించింది. ఎమ్మెల్యేల చర్య బాధ, దిగ్భ్రాంతి కలిగించిందని మరో సంస్థ తెలిపింది.

Spread the love