మణిపూర్‌లో శాంతి నెలకొల్పండి

– హింసాకాండకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మణిపూర్‌లో గత ఎనిమిది వారాలుగా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్న జాతుల హింస పరాకాష్టకు చేరిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అందులో భాగంగా గిరిజన మహిళలను నగంగా ఊరేగించి వారిపై లైంగికదాడికి పాల్పడి, ఇద్దరిని దారుణంగా హత్య చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. దోషులను కఠినంగా శిక్షించడంతోపాటు, ఆ రాష్ట్రంలో చెలరేగుతున్న హింసను నివారించి శాంతియుత, సాధారణ పరిస్థితులు నెలకొనేలా సకల చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. హింసాకాండకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మణిపూర్‌లో పరిస్థితిని అదుపుచేయడంలో డబుల్‌ ఇంజన్ల బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇక్కడి పరిస్థితులపై వ్యాఖ్యానించడానికి, స్పందించడానికి కూడా దేశ ప్రధానికి ఇన్ని రోజులు పట్టడం శోచనీయమని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు సుప్రీంకోర్టు స్పందించి హింసను నివారించడానికి ‘మీరు చర్యలు తీసుకుంటారా? మేము తీసుకోవాలా?’ అంటూ  కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన తుస్థితి తలెత్తిందని వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. సంక్లిష్టంగా మారుతున్న హింసాకాండను నియంత్రించలేదని తెలిపారు. రిజర్వేషన్ల సమస్యను సక్రమంగా పరిష్కరించకుండా వివాదాస్పదం చేసి ఘర్షణ వాతావరణం నెలకొల్పడానికి బీజేపీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం కారణమయ్యాయని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏమాత్రం తాత్సారం చేసినా ఈ పరిణామాల దుష్ప్రభావం మిగతా ఈశాన్య రాష్ట్రాలపై పడే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.
ఈ దుర్మార్గానికి ప్రధానిదే బాధ్యత : ప్రజాపంథా
మణిపూర్‌ దుర్మార్గానికి ప్రధానమంత్రి మోడీదే బాధ్యత అని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. అక్కడ కుకీ గిరిజన మహిళలపై సామూహిక లైంగికదాడి జరిపి, వారిని నగంగా ఊరేగించి, హత్య చేయడాన్ని ఆయన గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ కిరాతక, అనాగరికత చర్యకు బీజేపీ, ప్రధాన మంత్రి మోడీ, హోం మంత్రి అమిత్‌ షాలే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. అక్కడ మెజార్టీగా ఉన్న మెయితీ వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోడానికే బీజేపీ పథకం ప్రకారమే వంద రోజులుగా ఈ అల్లర్లకు పూనుకున్నదని విమర్శించారు. కిరాతకాలను చేస్తున్నదనీ, ఇది బీజేపీ ఫాసిస్టు ఎజెండాలో భాగమేనని తెలిపారు. మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలనీ, నాగాలకు, కుకీ గిరిజనులకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ రాజీనామా చేయాలనీ, ఈ ఘటనకు సంబంధించి అమిత్‌ షాపై విచారణ చేపట్టాలని తెలిపారు. అల్లర్ల బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయాలని తెలిపారు.

Spread the love