దశాబ్దం నుంచి దగా

Daga since the decade– మోడీ హామీలు నీటి మీద రాతలే….!
– రెట్టింపు కాని అన్నదాతల ఆదాయం
– ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమంటూ బుకాయింపు
– యూపీఏ పాలనలో కంటే దారుణం
– ఎంఎస్‌పీల పెంపూ కనిష్టమే
2016లో జరిగిన పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 2022 నాటికి దేశంలో అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తానని అందులో సగర్వంగా ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తామని 2019లో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో కూడా బీజేపీ నమ్మబలికింది. ఇందుకోసం సంస్థాగత సంస్కరణల నిమిత్తం నగదు బదిలీ సహా పలు చర్యలను ఏకరువు పెట్టింది. ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. మోడీ ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. ఆయన హయాంలో రైతన్నల ఆదాయం మరింత పడిపోయింది.
న్యూఢిల్లీ : అన్నదాతల్ని ఆదుకుంటామంటూ మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది…ఆ లక్ష్య సాధన కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు 2016లోనే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2012-13లో జాతీయ శాంపిల్‌ సర్వే కార్యాలయం అందించిన సమాచారాన్ని ఉపయోగించుకుంటూ 2015-16లో భారతీయ రైతుల జాతీయ సగటు వార్షిక ఆదాయం రూ.96,703 ఉంటుందని అంచనా వేసింది. దీని ఆధారంగానే 2022 నాటికి రైతుల ఆదాయం రూ.1,92,694 (2015-16 ధరల ప్రకారం) ఉండాలని లక్ష్యంగా నిర్దేశించింది. 2022-23 ధరల ప్రకారమైతే అన్నదాతల వార్షిక సగటు ఆదాయం రూ.2,71,378 ఉండాలని కూడా తెలిపింది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఏడు సంవత్సరాల పాటు వ్యవసాయ ఆదాయం ఏటా 10.4% వృద్ధి సాధించాల్సి ఉంటుందని లెక్కలు వేసింది.
ఇవీ వాస్తవాలు…
2022-23 సంవత్సరపు లెక్కలు ఇంకా అందుబాటులోకి రాలేదు. 2021లో విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం 2015-16లో రూ.96,703గా ఉన్న రైతు కుటుంబాల సగటు వార్షిక ఆదాయం 2018-19 నాటికి రూ.1,22,616కి పెరిగింది. దీనిని బట్టి అర్థమయింది ఏమిటంటే రైతుల ఆదాయం కేవలం నామమాత్రంగా 2.98% మాత్రమే పెరిగింది. 2002-03 నుండి 2012-13 మధ్య కాలం వరకూ రైతు కటుంబాల సగటు వార్షిక ఆదాయం 3% మేర పెరగగా తాజాగా ఆ స్థాయిలో కూడా పెరుగుదల లేకపోవడం గమనార్హం. 2003-2013 మధ్య దశాబ్ద కాలం దేశాన్ని కాంగ్రెస్‌ నేతృతత్వంలోని యూడీఎఫ్‌ పరిపాలించింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమంటే 2015-16 నుండి పంటల సాగు ద్వారా వచ్చిన ఆదాయం ఏటా 1.5% మేర తగ్గుతూ వస్తోంది.
రాష్ట్రాల పైకి నెట్టేసిన కేంద్రం
రైతుల ఆదాయం తగ్గుతున్నప్పటికీ దేశీయ వ్యవసాయ రంగం గత దశాబ్ద కాలంలో 3.8% వృద్ధి నమోదు చేసింది. అంతకుముందు దశాబ్ద కాలంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఈ వృద్ధి 3.5%గా నమోదైంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ అమలులో పురోగతిపై గత సంవత్సరం డిసెంబరులో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సమాధానమిస్తూ ‘వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి, రైతుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలే అవసరమైన చర్యలు తీసుకుంటాయి’ అని చెప్పి తప్పించుకున్నారు. రాష్ట్రాల ప్రయత్నాలకు కేంద్రం విధానపరమైన చర్యలు, బడ్జెటరీ మద్దతు, వివిధ పథకాలు-కార్యక్రమాల ద్వారా మద్దతు మాత్రం అందిస్తుందని చెప్పుకొచ్చారు.
అమలుకు నోచని జాతీయ కమిషన్‌ సిఫార్సులు
రైతులపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ చేసిన సిఫార్సులకు 2018-19 బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పంటల కనీస మద్దతు ధరలు సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం యాభై శాతం అదనంగా ఉండాలన్న సిఫార్సును ఆమోదించింది. దీనికి కట్టుబడి ఉంటామని 2022 డిసెంబరులో వ్యవసాయ మంత్రి పార్లమెంటుకు తెలియజేశారు. అయితే గత దశాబ్ద కాలంలో కనీస మద్దతు ధరల పెంపు యూపీఏ హయాంతో పోలీస్తే కనిష్ట స్థాయిలోనే ఉన్నదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
భూమి లేని రైతులకు అందని పథకం
వ్యవసాయ రంగం కోసం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి. దీనిని పీఎం కిసాన్‌ అని పిలుస్తున్నారు. ఈ నగదు బదిలీ పథకాన్ని 2019లో ప్రారంభించారు. గత సంవత్సరం డిసెంబరులో పార్లమెంటుకు ప్రభుత్వం అందజేసిన సమాచారం ప్రకారం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ 11 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు. అయితే దేశలోని వ్యవసాయ కార్మికుల్లో కనీసం 55%గా ఉన్న భూమిలేని రైతులు ఈ పథకం పరిధిలోకి రావడం లేదు.
వ్యవసాయ చట్టాలపై వెనక్కి
ఇక 2020లో మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాల ద్వారా వ్యవసాయ వాణిజ్యం పెరుగుతుందని, రైతులు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ ఉత్పత్తులను ప్రైవేటు కంపెనీలకు అమ్ముకోవచ్చునని తెలిపింది. అయితే ఈ చట్టాలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు ఉద్దేశించినవేనని ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలపై తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం, అన్నదాతలు దీర్ఘకాలం ఉద్యమించడంతో 2021లో వాటిని కేంద్రం వెనక్కి తీసుకోక తప్పలేదు.
జులుం తగదు..- సీతారాం ఏచూరిసీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి 
అన్నదాతలపై జులుం తగదు.తులపై పోలీసుల చర్యను ఖండిస్తున్నాం. రైతులపై టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ కాల్చడానికి డ్రోన్‌లను ఉపయోగించడం, అన్ని రకాల బారికేడ్లు ఏర్పాటు చేయడం గురించి మేము ఎప్పుడూ వినలేదు. రైతుల పాదయాత్రను ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రైతులను గౌరవించడం, మనందరికీ అన్నం పెట్టే అన్నదాతలను గౌరవించడం ప్రభుత్వం బాధ్యత. ఈ అణచివేతకు తక్షణమే ముగింపు పలకాలి. అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుతూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం జరగనుంది. కార్మిక సంఘాలతో పాటు రంగాల పారిశ్రామిక సమ్మె కూడా జరుగుతుంది. ఇది మోడీ ప్రభుత్వం విస్మరించలేని విషయం. ఇది వెంటనే అంగీకరించాలి”.

Spread the love