– తెలంగాణలో ఏడు స్థానాలపై చర్చ
– దేశవ్యాప్తంగా దాదాపు 40 స్థానాలపై అభ్యర్థుల ఎంపిక
– కొన్ని స్థానాలపై భిన్నాభిప్రాయం
– అసంతప్తిగా ముగిసిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ అసంతృప్తిగా ముగిసింది. కొన్ని స్థానాలపై సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీంతో తుది నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి అప్పగించారు. మంగళవారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఛండీగడ్, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, కెసి వేణుగోపాల్ తో పాటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్సీ, కర్నాటక నుంచి ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు, ఇన్ చార్జులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 70 స్థానాలపై చర్చ జరిగింది. అందులో 40 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి అయింది. మిగిలిన స్థానాలపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో అధ్యక్షుడు ఖర్గేకి నిర్ణయాధికారం ఇచ్చారు. అలాగే తెలంగాణకు సంబంధించి దాదాపు ఏడు స్థానాలపై చర్చ జరిగింది. ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, ఈ సమావేశంలో ఏడు స్థానాలపైనే చర్చ జరిగినట్టు సమాచారం. కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను నేడో, రేపో ప్రకటించనున్నారు.