నవతెలంగాణ ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీయే (NDA) భాగస్వామ్యపక్షమైన లోక్‌జన శక్తి పార్టీ (రామ్ విలాస్)కి ఎదురుదెబ్బ తగిలింది. చిరాగ్ పాసవాన్ (Chirag Paswan) నేతృత్వంలోని ఈ పార్టీకి 22 మంది సీనియర్ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సీట్లను అమ్ముకుంటోందని ఆరోపణలు చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థులను ఖరారు చేసే ముందు పార్టీలోని సీనియర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. సమస్తీపుర్, ఖగడియా, వైశాలి లోక్‌సభ స్థానాల కోసం రూ.కోట్లు తీసుకున్నారన్నారు. చిరాగ్ పాసవాన్ (Chirag Paswan), ఆయన సన్నిహితులే స్వయంగా సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. రాజీనామా చేసిన వారిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, బిహార్ మాజీ మంత్రి రేణు కుశ్వాహా, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్, రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, రవీంద్ర సింగ్ వంటి కీలక నేతలు ఉన్నారు. వీరంతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రాజు తివారీకి రాజీనామా లేఖలు సమర్పించారు. ఇకపై తాము విపక్ష కూటమి ‘ఇండియా’కు (INDIA Bloc) మద్దతుగా నిలవబోతున్నట్టు వారు ప్రకటించారు.