– గుజరాత్ డాక్యుమెంటరీ ప్రసారంతో కేంద్రం కక్షసాధింపు చర్యలు
– ఐటీ సోదాలు, వేధింపుల నేపథ్యంలో అసాధారణ నిర్ణయం
– ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్’కు ప్రసార లైసెన్సులు
– 26 శాతం వాటా కోసం కేంద్రానికి దరఖాస్తు
న్యూఢిల్లీ : బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) భారత్‌లో తన ప్రసారాలను నిలిపివేసింది. తన భారతీయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ప్రయివేటు లిమిటెడ్ కంపెనీకి ప్రచురణ లైసెన్సును అప్పగించింది. పన్ను ఉల్లంఘనల పేరుతో గతంలో బీబీసీ కార్యాలయాలలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం, ప్రశ్నలు సంధించడం తెలిసిందే. ఈ వేధింపులు జరిగి సంవత్సరం కూడా పూర్తికాకముందే బీబీసీ భారత్‌లోని తన న్యూస్‌రూమ్‌ను మూసేసింది. అంతర్జాతీయంగా ప్రసార సేవలు అందిస్తున్న ఓ ప్రభుత్వ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్’ పేరిట ఏర్పడిన ప్రయివేటు లిమిటెడ్ కంపెనీతో బీబీసీ కుదుర్చుకున్న ఒప్పందం ఈ వారంలోనే అమలులోకి వస్తుంది. ఈ కంపెనీని నలుగురు బీబీసీ మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేశారు. మన దేశంలో ఈ న్యూస్‌రూమ్‌కు చెందిన కార్యాలయాలు భారత్‌కు సంబంధించిన వార్తలు, ఇతర అంశాలను బీబీసీ డిజిటల్ సర్వీసెస్ కోసం హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, తెలుగు భాషల్లో అందిస్తాయి. కొత్తగా ఏర్పడిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 26 శాతం వాటాల కోసం బీబీసీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసిందని తెలిసింది.
అసాధారణ చర్యే
బీబీసీ తన ప్రచురణ లైసెన్సును మరో సంస్థకు అప్పగించడం అసాధారణమని కలెక్టివ్ న్యూస్‌రూమ్ సీఈఓ రూపా ఝా తెలిపారు. జర్నలిజంలో రాజీ పడబోమని, తమ వెనుక బీబీసీ ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. బీబీసీ ఇండియాలో ఝా సీనియర్ న్యూస్ ఎడిటర్‌గా పనిచేశారు. కలెక్టివ్ న్యూస్‌రూమ్ వ్యవస్థాపక వాటాదారుల్లో ఆయన కూడా
ఒకరు. మన దేశంలో బీబీసీ నిర్వహిస్తున్న కార్యకలాపాలను పునర్నిర్మించాలంటే 2020లో ప్రవేశపెట్టిన నూతన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. వీటి ప్రకారం దేశీయ డిజిటల్ మార్కెట్ రంగంలో విదేశీ కంపెనీల ఎఫ్‌డీఐ పరిమితి 26 శాతం మాత్రమే. గతంలో దేశంలో బీబీసీ ఎడిటోరియల్ కార్యకలాపాలను బీబీసీ ఇండియా నిర్వహించేది. ఇందులో 99 శాతానికి పైగా వాటాలు బ్రిటన్‌కు చెందిన బీబీసీవే. అయితే పెట్టుబడులపై ఆంక్షలు విధించడంతో 26 శాతం ఎఫ్‌డీఐ పరిమితిని దాటిన కంపెనీలు తమ విదేశీ పెట్టుబడులను 2021లో విధించిన నియంత్రణలకు అనుగుణంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది.
‘గుజరాత్’ డాక్యుమెంటరీ ప్రసారమే కారణం
బీబీసీ ఇండియా బ్యూరోలో 200 మంది పనిచేస్తున్నారు. బ్రిటన్ వెలుపల మన దేశంలోనే బీబీసీ కార్యకలాపాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. 1940 మేలో బీబీసీ మన దేశంలో ప్రసారాలను ప్రారంభించింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ, ముంబయిలోని దాని కార్యాలయాలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజులకే దాడులు, సోదాలు జరగడం గమనార్హం.
ఇష్టం లేకపోయినా…
ఎఫ్‌డీఐపై నూతన నిబంధనలు అమలులోకి రావడంతో బీబీసీ కార్యకలాపాలపై నీలినీడలు కమ్ముకొన్నాయి. అయినప్పటికీ ఆ సంస్థ మన దేశంలో తన ఉనికిని కోల్పోవడాన్ని ఇష్టపడలేదు. ఉద్యోగాలలో కోత విధించాలని కోరుకోలేదు. అదే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇష్టం లేకపోయినా విధిలేని పరిస్థితులలో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
బీబీసీ అందుకున్న న్యాయ సలహా ఆధారంగా కలెక్టివ్ న్యూస్‌రూమ్ ఏర్పాటుకే అందరూ మొగ్గు చూపారని ఝా చెప్పారు. తాజా పరిణామాలపై బీబీసీ న్యూస్ డిప్యూటీ సీఈఓ జోనాథన్ మన్రో వ్యాఖ్యానిస్తూ ‘భారత్‌లో బీబీసీ మనుగడకు ఘన చరిత్ర ఉంది. ప్రేక్షకులకే తొలి ప్రాధాన్యత ఇచ్చాం. ఈ పురోగతిని ముందుకు తీసికెళ్లడానికి కలెక్టివ్ న్యూస్‌రూమ్ ఏర్పాటు దోహదపడుతుంది. దీనిని మేము స్వాగతిస్తున్నాం’ అని చెప్పారు.