– అంతర్జాతీయ మీడియా కథనాలు
న్యూఢిల్లీ : మతాన్ని పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం, ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎన్నికల కోడ్‌కు విరుద్దం. అయితే, కొద్దిరోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిందిదే! రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బహిరంగంగానే విద్వేష వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా మెజార్టీ హిందువులను రెచ్చగొట్టారు. ఈ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి పలువురు తీసుకెళ్లినా వీసమంత ఫలితం లేదు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా పెదవి విప్పడానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. నిష్పక్షపాతంగా ఎన్నికల నియమావళిని అమలు చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న వైఖరి ఇది! మరోవైపు రాజస్థాన్‌లో ఏం జరిగిందో… మోడీ ఏం మాట్లాడారో ప్రపంచం చెబుతోంది. అంతర్జాతీయ మీడియా ఒక్క మాటలో ‘మోడీ విషం చిమ్మారు’ అని ఘోషిస్తోంది. మోడీ ప్రసంగాన్ని, దానికి దారి తీసిన పరిణామాలను కథలు, కథలుగా ప్రచురిస్తోంది.
పాత విద్వేషం : అల్ జజీర
‘ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాత ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి మొగ్గుచూపారు. ఇది ఆయన ప్రచార వ్యూహంలో వచ్చిన మార్పును సూచిస్తోంది’ అని అల్ జజీర పేర్కొంది. ‘ భారత ఎన్నికల కోడ్ ప్రకారం పార్టీలు, రాజకీయ నాయకులు మత, కులపరమైన విభేదాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు. అయితే, ఎన్నికల అధికారులు, ప్రభుత్వ నిఘా సంస్థలు ప్రధాని ప్రసంగాన్ని పట్టించుకోలేదు. ఈ సంస్థలు చాలా నిదానంగా పనిచేస్తాయన్న ఫిర్యాదులు చాలా కాలంగా ఉన్నాయి. అధికార పక్షంపై వచ్చే ఫిర్యాదుల విషయంలో మరింత నెమ్మదిగా వీటి పని ఉంటుంది.’ అని కూడా ఆ సంస్థ పేర్కొంది. . దేశంలో ఉన్న ముస్లింలను బయటి వ్యక్తులుగా, చొరబాటుదారులుగా బిజెపి ప్రచారం చేస్తున్న తీరును వివరించింది. బిజెపితో పాటు దాని భాగస్వామ్య పక్షాలు చాలా కాలంగా భారతీయ ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారంటూ ప్రచారం చేస్తున్నారని, భవిష్యత్తులో హిందువుల కంటే ముస్లిలం జనాభా పెరిగిపోతుందని చెబుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపింది. నిజానికి భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు ఇతరుల కన్నా వేగంగా పడిపోతున్న తీరును, ప్రభుత్వ డేటా ప్రకారమే మూడు దశాబ్దాల కాలంలో సగానికన్నా పడిపోయిన అంశాన్ని ఆ సంస్థ వివరించింది.
ఇస్లామోఫోబియోతో హింస : సిఎన్‌ఎన్
గత దశాబ్ధకాలంలో మోడీ, బిజెపి రెచ్చగొడుతున్న ఇస్లామోఫోబియా అతి పెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఘోరమైన మత ఘర్షణలకు దారి తీసిందని సిఎన్‌ఎన్ పేర్కొంది. ‘హిందూ జాతీయవాద విధానాలతో దేశాన్ని మత విభజన దిశగా బిజెపి నడిపిస్తోంది. వాక్‌చాతుర్యంతో చాలా కాలంగా ఈ పనిని చేస్తోంది.’ అని వివరించింది.
స్వాతంత్య్ర స్ఫూర్తికి భిన్నంగా : వాషింగ్టన్ పోస్టు
లౌకిక, బహుళ సాంస్కృతిక, ప్రజాస్వామిక దేశాన్ని తీర్చి దిద్దాలన్న స్వాతంత్య్ర స్ఫూర్తికి భిన్నంగా భారత దేశ గుర్తింపును హిందూ దేశంగా మార్చడానికి మోడీ పార్టీ పనిచేస్తోందని వాషింగ్టన్ పోస్టు ప్రచురించింది. స్వాతంత్య్రం అనంతరం మొదటి, రెండవ తరం నాయకులు కూడా సెక్యులరిజాన్నే కోరుకున్నారని, బిజెపి దానికి భిన్నంగా మతతత్వాన్ని బలంగా ముందుకు తీసుకువచ్చిందని పేర్కొంది. మోడీ పాలనలో ముస్లింలపై జరుగుతున్న దాడులను వివరించింది.
ప్రపంచ వేదికలపై ఈ భాష మాట్లాడలేదు : న్యూయార్క్ టైమ్స్
ముస్లింలను ఉద్ధేశించి మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల న్యూయార్క్ టైమ్స్ విస్మయం ప్రకటించింది. పలు ప్రపంచస్థాయి వేదికల్లో మోడీ చేసిన ప్రసంగాలను గుర్తు చేసుకున్న ఆ పత్రిక ‘ఆ వేదికలపై మోడీ ఇలా మాట్లాడలేదు, ఇటువంటి భాషను వాడలేదు. రాజస్థాన్‌లో ఆయన చేసిన ప్రసంగం ప్రపంచంలో ఆయనకు ఉన్న ఇమేజికి భిన్నమైనది’ అని పేర్కొంది.
మోడీ విద్వేష విషంపై ప్రపంచం ఏమంటోంది?
4:15 am