కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ

Hearing on Kavitha's bail petitions– మే 2కు రిజర్వ్‌ చేసిన ట్రయల్‌ కోర్టు
– ఈడీ కేసులో నేడూ వాదనలు
– కవితను టెర్రరిస్ట్‌గా, కరుడు గట్టిన నేరస్తురాలిగా ట్రీట్‌ : కవిత లాయర్‌ సింఘ్వీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు వాదనలు ముగించింది. ఈ పిటిషన్‌ పై తీర్పును మే 2కు రిజర్వ్‌ చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం సీబీఐ కేసులో అరెస్టైన కవిత ఈనెల 15న మొత్తం 664 పేజీలతో ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అంతకు ముందు ఇదే లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ కవిత బెయిల్‌ కోరారు. ఈ రెండు పిటిషన్లపై సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టు స్పెషల్‌ జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఉదయం సీబీఐ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. కవిత తరపున న్యాయవాది విక్రమ్‌ చౌదరి, నితీష్‌ రాణా, మోహిత్‌ రావులు, సీబీఐ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పంకజ్‌ గుప్తాలు హాజరయ్యారు. తొలుత కవిత న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపిస్తూ… మహిళగా కవిత పీఎంఎల్‌ఎ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు అర్హురాలని తెలిపారు. ఈ కేసులో కవిత అరెస్ట్‌ నుంచి ఆమె విచారణ వరకు ఎటువంటి మెటీరియల్‌ లేదని వాదించారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండానే దర్యాప్తు సంస్థలు ఆమెను అరెస్ట్‌ చేశాయన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ కస్టడీలో ఉండగానే… సీబీఐ అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ స్టార్‌ క్యాంపైయినర్‌లలో కవిత ఒకరిగా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల ప్రచారంలో పాల్గొనేలా బెయిల్‌ ఇవ్వాలని కోరారు. ఇక కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కేసులోని తీర్పు కవిత విషయంలో సరిపోతుందన్నారు. ఏడేండ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్ట్‌ అవసరం లేదని వాదించారు. మరోవైపు అరెస్టుకు సరైన కారణాలు లేవని, ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు.
కవితకు బెయిల్‌ ఇవ్వొద్దు
కవితకు బెయిల్‌ ఇవ్వాలన్న ఆమె న్యాయవాది వాదనలపై సీబీఐ తరపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పంకజ్‌ గుప్తా అభ్యంతరం తెలిపారు. లిక్కర్‌ కేసులో ఆమె కింగ్‌ పిన్‌గా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు ఆమెకు తెలుసన్నారు. ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్స్‌, ఆధారాలపై ఆమెను విచారించినా నిజాలు చెప్పడం లేదన్నారు. ఉన్నత రాజకీయ పలుకుబడి ఉన్న కవిత ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేయగలరని ఆరోపించారు. అందువల్ల ఆమెకు బెయిల్‌ నిరాకరించాలని కోరారు. అయితే ఇరువైపు వాదనలు విన్న స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా… ఈ పిటిషన్‌పై వాదనలు ముగిస్తున్నట్లు స్పష్టం చేశారు. మే 2న తుది ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. మరోవైపు ఢిల్లీ మద్యం విధానంలోని ఈడీ కేసులోనూ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.
ఈడీ కేసులో విచారణ నేటికి వాయిదా
ఈడీ కేసులో కవిత పిటిషన్‌పై విచారణను ట్రయల్‌ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌ పై కవిత తరపు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. దాదాపు ఐదారు విచారణలకు హాజరైనా…ఆమెను ఒక టెర్రరిస్టు, కరుడుగట్టిన నేరస్తులను ట్రీట్‌ చేసి నట్లు, దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయని చెప్పారు. అనంతరం కవిత తరపు న్యాయవాది, ఈడీ తరపు న్యాయవాది జోహెబ్‌ హుస్సెన్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ భాను ప్రియ వాదనలు విన్న జడ్జ్‌ కావేరి బవేజా జోక్యం చేసుకొని ఈ బెయిల్‌ పిటిషన్‌ పై మంగళవారం వాదనలు వినిపించేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఇందుకు వాది, ప్రతివాదులు అంగీకరించడంతో పిటిషన్‌పై విచారణను మంగళవారం మధ్యాహ్నం తర్వాత చేపడతామని స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా వెల్లడించారు.
నేడు ట్రయల్‌ కోర్టు ముందుకు కవిత
మరోవైపు ఈడీ, సీబీఐ కేసులో కవితకు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో మంగళవారం కవితను ట్రయల్‌ కోర్టు ముందు హాజరుపరుచనున్నారు. ఈడీ కేసులో ఆమెకు ఈ నెల 9న కోర్టు 14 రోజులు కస్టడీ పొడిగించగా… సీబీఐ కేసులో ఈనెల 15న ఎనిమిది రోజుల కస్టడీ విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే కవిత దాఖలు చేసిన రెండు బెయిల్‌ పిటిషన్లలో సీబీఐ కేసులో తీర్పు మే 2కు రిజర్వ్‌ చేయగా, ఈడీ కేసులో విచారణ నేడు కూడా జరగనుంది. ఈ సందర్భంలో ఆమె జ్యుడీషియల్‌ కస్టడీని ట్రయల్‌ కోర్టు మరో 14 రోజులు పొడిగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Spread the love