ఎనిమిదో రోజు ఈడీ కస్టడీలో కవిత

Kavitha in ED custody on eighth dayనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఎనిమిదో రోజు ఈడీ అధికారులు కవితను విచారించారు. తాజాగా కస్టడీ పొడగింపు అప్లికేషన్‌ లో మెన్షన్‌ చేసిన అంశాలపై ఆరా తీసారు. సౌత్‌ గ్రూప్‌ లో నగదు బదిలీ/వినియోగంలో కీలక పాత్ర పొశించిన కవిత మేనల్లుడు మేక శ్రీ శరణ్‌ టార్గెట్‌ గా కవితను విచారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా శరణ్‌ బిజినెస్‌, లావాదేవీల అంశంపై మరోసారి కవితను ప్రశ్నించారు. దీంతో పాటు ఐటీఆర్‌, కుటుంబ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు సమాచారాన్ని కోరినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అంశాలపై కవితను ప్రశ్నించిన ఈడీ…ఆమె నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయామని తాజాగా కోర్టుకు వెల్లడించిన విషయం విధితమే. పైగా కవిత తమ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు కుంటి సాకులు చెబుతోన్నారని, విచారణకు సహకరించడంలేదని ఆరోపించింది. దీంతో కవిత నుంచే కాకుండా… లిక్కర్‌ వ్యాపారీ సమీర్‌ మహేంద్రు వైపు నుంచి మేక శరణ్‌ పాత్రపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తమ ముందు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సమీర్‌ మహేంద్రుకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఏ రోజు సమీర్‌ ను విచారిస్తారనే అంశంపై తెలిపేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు. కేవలం సమీర్‌ ను ఒక్కడినే విచారిస్తారా… లేక ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన సౌత్‌ గ్రూప్‌ లోని కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ్‌, మాగుంట శ్రీనివాస్‌ లుతో కలిపి విచారిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇతరులతో కలిపి కవిత విచారణ…?
తొలి ఏడు రోజులు కస్టడీలో భాగంగా కేవలం ఐదు రోజులు మాత్రమే కవితను ఈడీ అధికారులు విచారించారు. ఇదే టైంలో మరో నలుగురు వ్యక్తులను కూడా ఈడీ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ఈ సందర్బంగా వీరు ఇచ్చిన స్టేట్మెంట్‌ ల ఆధారంగా కవితను క్రాస్‌ ఎగ్జామిన్‌ (కన్ఫట్రంటేషన్‌) చేసినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. వంద కోట్ల ముడుపులు, మరో రూ.192.8 కోట్ల అక్రమార్జనతో కలిపి మొత్తం రూ. 292.8 కోట్ల వ్యవహారంపై కవిత భాగస్వామ్యం ఉన్నట్లు ఈడీ చెబుతోంది. దీనికి సంబంధించి కవిత పాత్ర, ఆమె మేనల్లుడు శరణ్‌ కీ రోల్‌ పై మరికొందరిని విచారించాల్సి ఉందని పేర్కొంది. ఈ విచారించాల్సిన జాబితాలో ఉన్న వ్యక్తులతో కవితను కలిపి ప్రశ్నించే అవకాశం ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇండో స్పిరిట్‌ లో కవిత కు డమ్మీ పర్సన్‌ గా వ్యవహరించిన అరుణ్‌ రామ చంద్ర పిళ్లై, అరబిందో కంపెనీ డైరెక్టర్‌ శరత్‌ చంద్ర ల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే, ఆప్‌ తరపున స్కాంలో ప్రధాన పాత్ర పోశించిన విజరు నాయర్‌ ను విచారించనున్నట్లు తెలిపింది. కాగా, ఎనిమిదో రోజు సైతం ఆమె కుటుంబ సభ్యులు కవితను కలిశారు.

Spread the love