ప్రతిపక్షాలపై కేంద్ర ఏజెన్సీల దాడి ఆపాలి

Central agencies should stop attacking the opposition– ప్రజా సమస్యలపై చర్చించాలి
– అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్‌
– సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి : ప్రభుత్వం
– నేడు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు అఖిలపక్ష సమావేశం మంగళవారం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరింది. కాంగ్రెస్‌, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీలతో సహా కనీసం సగం మంది ప్రతిపక్ష నాయకులు ”కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం” అంశాన్ని లేవనెత్తారు. జేఎంఎం అధ్యక్షుడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ వంటి నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడిని ఎత్తి చూపారు. దీని తరువాత బీహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, హర్యానా కాంగ్రెస్‌ నేత భూపీందర్‌ సింగ్‌ హుడాపై కేంద్ర ఏజెన్సీ దాడిని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. అసోంలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యారు యాత్రపై ”హింసాత్మక దాడి”, రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలకు అంశాన్ని కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారీ లేవనెత్తారు. ”దేశంలో ‘అలిఖిత నియంతృత్వం’ ఉంది. దేశ రాజ్యాంగ చట్రం ప్రమాదంలో ఉంది. మేం దాని గురించి నిజంగా ఆందోళన చెందుతున్నాం. ఏజెన్సీల తీరుపై మేం కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరుతున్నాం” అన్నారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ వంటి ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను సంప్రదించిన తర్వాత తాను ఈ అంశాలను లేవనెత్తానని తివారీ చెప్పారు.
ప్రజా సమస్యలపై చర్చించాలి: ఎలమారం కరీం
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్న రాజకీయ విధ్వంసక ఎత్తుగడలపై చర్చించేందుకు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపక్షాలు సమయం ఇవ్వాలని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత ఎలమారం కరీం డిమాండ్‌ చేశారు. రాష్ట్రాల అధికారాలపై కేంద్రం దాడి, దేశాన్ని సమూలంగా మార్చడం, రైతులు, కార్మికుల ఆందోళనలు, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌పైనా చర్చించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 8న ఢిల్లీలో కేరళ ప్రభుత్వం ధర్నా చేస్తున్నదని కరీం తెలిపారు. పార్లమెంట్‌పై దాడి గురించి ప్రభుత్వం మౌనం వీడాలని సీపీఐ ఎంపీ పి.సంతోష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో శాంతియుత జీవితం ఎప్పుడు ఉంటుందో ప్రభుత్వం చెప్పగలదా? అని ఆయన ప్రశ్నించారు.
చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి
ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ‘ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్‌ను సమర్పించే ఈ ముఖ్యమైన సెషన్‌లో ప్రతిపక్ష ఎంపీలందరి సహకారం మేం కోరాం. నినాదాలు చేయవద్దని, ప్లకార్డులు తీసుకురావద్దని ప్రతిపక్ష ఎంపీలను మళ్లీ అభ్యర్థిస్తాం’ అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర రక్షణ మంత్రి, లోక్‌సభ ఉపనేత రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యసభ నేత పీయూష్‌ గోయల్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, సహాయ మంత్రులు అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, మురళీధరన్‌ ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్‌లో జరిగిన ఈ సమావేశంలో అనుప్రియ పటేల్‌ (అప్నాదళ్‌), కె.సురేష్‌, ప్రమోద్‌ తివారీ (కాంగ్రెస్‌), సుదీప్‌ బందోపాధ్యాయ, సుఖేదు శేఖర్‌ రారు (టీఎంసీ), టీఆర్‌ బాలు, తిరుచ్చి శివ (డీఎంకే), రాహుల్‌ షెవాలే (శివసేన), ఎలమారం కరీం, పిఆర్‌ నటరాజన్‌ (సీపీఐ(ఎం), సంతోష్‌ కుమార్‌ (సీపీఐ), అమరేంద్ర ధారి సింగ్‌ (ఆర్జేడీ), ఎస్‌.టి.హసన్‌ (ఎస్పీ), రామ్‌నాథ్‌ ఠాకూర్‌ (జేడీయూ), జయదేవ్‌ గల్లా, కనకమేడల రవీంద్రకుమార్‌ (టీడీపీ), భీశెట్టి సత్యవతి (వైసీపీ), నామా నాగేశ్వరరావు, కే. కేశవరావు (బీఆర్‌ఎస్‌), సస్మిత్‌ పాత్ర (బీజేడీ), వైకో (ఎండీఎంకే), హస్నైన్‌ మసూది (నేషనల్‌ కాన్ఫరెన్స్‌) తదితరులు పాల్గొన్నారు. అఖిల పక్ష సమావేశానికి మొత్తం 30 పార్టీల నుంచి 45 మంది నేతలు హాజరయ్యారు.

Spread the love