జేఎన్‌.1 ఆందోళనకరం కాదు…హెచ్చరికే…

JN.1 is not alarming...warning...– దీనికంటే ఫ్లూ జ్వరమే ప్రమాదకరం
– నాలుగో డోస్‌ మంచిదే
–  వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : ప్రముఖ వైరాలజిస్ట్‌ షాహిద్‌ జమీల్‌
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నూతన వేరియంట్‌ జేఎన్‌.1 ఆందోళనకరమైనది కాదని, అయితే అది ఓ హెచ్చరిక వంటిదని ప్రముఖ వైరాలజిస్ట్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన గ్రీన్‌ టెంప్లీటన్‌ కళాశాల సీనియర్‌ ఫెలో ప్రొఫెసర్‌ షాహిద్‌ జమీల్‌ తెలిపారు. దీనిలో ఒమిక్రాన్‌ కంటే ఇన్‌ఫెక్షన్‌ కొంచెం ఎక్కువేనని చెప్పారు. జేఎన్‌.1 తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పడానికి ఆధారాలేవీ లేవని, వాస్తవానికి దీనికంటే ఫ్లూ జ్వరమే మరింత ప్రమాదకరమైనదని అన్నారు. ‘ది వైర్‌’ పోర్టల్‌ కోసం సీనియర్‌ పాత్రికేయుడు, టెలివిజన్‌ వ్యాఖ్యాత కరణ్‌ థాపర్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ వివిధ అనారోగ్యాలతో బాధ పడేవారు, వృద్ధులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనసమ్మర్దమైన ప్రదేశాలలో తిరిగే సమయంలో మాస్కులు ధరించాలని సలహా ఇచ్చారు.
‘ఉత్తర భారతదేశంలో చలి అధికంగా ఉంటుంది. వాతావరణ కాలుష్యమూ ఎక్కువే. కాబట్టి వృద్ధులు, ఆరోగ్యపరంగా బలహీనులు జాగ్రత్తగా ఉండాలి’ అని జమీల్‌ చెప్పారు. చలి, వాతావరణ కాలుష్యం రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయని, దీనివల్ల ప్రజలు జేఎన్‌.1కి గురయ్యే అవకాశాలు ఉంటాయని వివరించారు. అయితే గతంలో కోవిషీల్డ్‌, కోవాక్సిన్‌ తీసుకున్న వారికి, గతంలో వచ్చిన ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి సహజంగా రోగ నిరోధక శక్తిని పొందిన వారికి కొత్త వేరియంట్‌ నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. బూస్టర్‌ డోస్‌ తీసుకునే ఆర్థిక స్థోమత ఉన్న వారు దానిని ఈ దశలో తీసుకోవడం మంచిదేనని చెప్పారు. గతంలో తీసుకున్న వ్యాక్సిన్‌కు భిన్నంగా ఉండే వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. అయితే బూస్టర్‌ డోస్‌తో కలిపి ఇప్పటికే కోవిషీల్డ్‌ను మూడుసార్లు తీసుకున్న వారు నాలుగోసారి అదే వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది కాదని, దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయని తెలిపారు.
కేరళలో కోవిడ్‌-19 కేసులు అధికంగా నమోదవడాన్ని జమీల్‌ ప్రస్తావిస్తూ ‘దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఎక్కువ పరీక్షలు చేశారు. నిజాయితీగా, వేగవంతంగా ఫలితాలు ప్రకటించారు. ఇతర రాష్ట్రాలలో అధిక కేసులు నమోదు కాలేదని నమ్మడానికి కారణాలేమీ లేవు. ఏదేమైనా కేరళ అనుభవాన్ని ఓ ఉదాహరణగా చూడాలి’ అని జమీల్‌ వివరించారు.

Spread the love