– రోజుకు 30 మంది అన్నదాతల బలవన్మరణం
– మోడీ పాలన సాధించిన ‘ఘనత’కు నిదర్శనం
– రైతుల ఉసురు తీస్తున్న ప్రభుత్వ విధానాలు
– నానాటికీ పెరుగుతున్న రుణభారం
– వ్యవసాయ పథకాలకు తగ్గుతున్న కేటాయింపులు
‘మా వద్ద డబ్బు లేదు. అప్పు ఇచ్చిన వారు ఇంకెంత మాత్రం ఎదురు చూడబోమని చెప్పేశారు. మేము ఏం చేయాలి? మోడీ జీ…మీరు మీ గురించే ఆలోచిస్తున్నారు. మీరు పంటకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలి. అందుకు గ్యారంటీ ఇవ్వాలి. అప్పు ఇచ్చిన వారు బెదిరిస్తున్నారు. సహకార సంఘం అధికారులేమో అవమానిస్తున్నారు. మేము న్యాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్లాలి? మీరు ఎలాంటి చర్యలు తీసుకోనందునే నేను ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను’……మహారాష్ట్రలోని పూనే జిల్లాలో గత సంవత్సరం బలవన్మరణానికి పాల్పడిన దశరథ్ లక్ష్మణ్ కేదారి ఆఖరి మాటలివి.
న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోడీ 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ బలవంతంగా ప్రాణాలు తీసుకున్న 1,00,474 మంది రైతులలో కేదారి ఒకరు. అన్నదాతల ఆత్మ హత్యలకు సంబధించిన గణాం కాలను ఇటవల జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసింది. దీని ప్రకారం గత తొమ్మిది సంవత్సరాలుగా రోజుకు సగటున సుమారు 30 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
పట్టించుకోని మీడియా
అన్నదాత మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం అనేది సహజంగానే భావోద్వేగాలకు కారణమవుతుంది. అయితే దురదృష్టవశాత్తూ ఎన్‌సీఆర్‌బీ నివేదికను మీడియా ఎంతమాత్రం పట్టించుకోలేదు. వార్తా ఛానల్స్‌లో దీనిపై చర్చలు కూడా జరగలేదు. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో 10,281 మంది అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు బలవన్మరణానికి పాల్పడితే 2022లో ఆ సంఖ్య 11,290కి పెరిగింది. మహారాష్ట్రలోని విదర్భ, మరట్వాడా ప్రాంతాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘జవాన్’ రైతుల కడగండ్లను కళ్లకు కట్టినట్లు చూపింది. ఆ చిత్రంలో ఓ రైతు కుటుంబం పంట నష్టపోవడంతో అప్పు తీర్చలేకపోయింది. బ్యాంకుకు చెందిన రుణ వసూళ్ల ఏజెంట్లు ఆ కుటుంబాన్ని అనేక రకాలుగా వేధించారు. దీంతో చివరికి ఆ కుటుంబ యజమాని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.
ఇవన్నీ కారణాలే
ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం, కీలక పరిశ్రమల ప్రైవేటీకరణ, విదేశీ వాణిజ్యాన్ని అనుమతించడం, ప్రభుత్వ సబ్సిడీలు తగ్గడం, వ్యవసాయ రుణాలు తగ్గిపోవడం….ఇవన్నీ రైతుల ఇబ్బందులను మరింత పెంచాయి. ప్రభుత్వం నుండి భారీ సబ్సిడీలు పొందుతూ విదేశాల నుండి ప్రవాహంగా వచ్చి పడుతున్న వ్యవసాయ దిగుమతులతో పోటీ పడడం అన్నదాతకు అసాధ్యమవుతోంది. ఉన్న కష్టాలు చాలవన్నట్లు వ్యవసా యాన్ని వ్యాపా రంగా మార్చే సిన మోన్ శాంటో వంటి బడా కంపెనీల గుత్తా ధిపత్యం, జన్యు పరంగా అభి వృద్ధి చేసిన ఖరీదైన విత్తనాలు , ఎరువులు, క్రిమి సంహారక మందులు పెట్టుబడి వ్యయాన్ని బాగా పెంచేశాయి. రైతులు అటు ప్రతికూల వాతావరణ పరిస్థితులను, ఇటు మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులను ఎదుర్కోలేక సతమతమవుతున్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత మూడు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో మూడున్నర లక్షల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి.
నీరుకారుతున్న పథకాలు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అండ్ ది ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (ఎంఐఎస్-పీఎస్‌ఎస్), ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) వంటి కీలక వ్యవసాయ పథకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. పీఎంఎఫ్‌బీవై పథకానికి కేటాయింపులు పెరుగుతూ 2022-23 బడ్జెట్ అంచనాలలో రూ.15,550 కోట్లకు చేరాయి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటున్న రైతుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2022-23 రబీ సీజన్‌లో 4.35 కోట్లు, 2023 ఖరీఫ్‌లో 6.89 కోట్ల మంది రైతులు దరఖాస్తు చేశారు. అయితే చెల్లింపులు మాత్రం చాలా తక్కువగా జరిగాయి. 2022-23 రబీ సీజన్‌లో 7.8 లక్షల మంది రైతులకు రూ.3,878 కోట్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో పథకం సమర్ధత ప్రశ్నార్థకమవుతోంది.
పీఎం-కిసాన్‌కు 2022-23 బడ్జెట్ అంచనాలలో కేటాయింపులు రూ.68,000 కోట్లకు చేరాయి. అయితే ఈ పథకం భూమి ఉన్న రైతులకే తప్ప భూమి లేని వ్యవసాయ కార్మికుల అవసరాలు తీర్చలేకపోతోంది. వాస్తవానికి మన దేశంలో 2019 నుండి వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక చెబుతోంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఎంఎస్‌పీలను నిర్ణయిస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2014 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు.
ఉత్తుత్తి హామీలు, విఫలమవుతున్న పథకాలు, అరకొర కేటాయింపులు…ఇవన్నీ దేశంలోని అన్నదాతలను ఆర్థిక సుడిగుండంలోకి నెడుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం నిర్లక్ష్యం చేస్తుండడం వల్లనే అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాతావరణ సంక్షోభం కూడా రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తీవ్రమైన వడగాల్పుల కారణంగా పంట నష్టం జరుగుతోంది. దిగుబడులు పడిపోతున్నాయి. ఆర్థిక భారంపై అలుపెరుగని పోరాటం చేయాల్సి రావడం, అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరగడం…ఇవన్నీ మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా రైతును మరింత కుంగదీస్తున్నాయి. రైతులను ఆత్మహత్యల బారి నుండి కాపాడాలంటే ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యకు మూల కారణాన్ని అన్వేషించి, దానిని పరిష్కరించడానికి బదులు ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం వంటి పైపై పూతల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
పెరుగుతున్న రుణభారం
ఎన్నికల ప్రచార సందర్భంగా మోడీ అన్నదాతలపై అంతులేని ప్రేమ కురిపించారు. కానీ ఆ మాటలన్నీ నీటి మూటలేనని రైతులు ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల బలవన్మరణాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. దేశంలో అప్పులపాలైన రైతుల సంఖ్య 2013లో 52% ఉంటే 2019 నాటికి 50.2%కి తగ్గిందని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. అయితే వాస్తవానికి అదే కాలంలో రుణ ఊబిలో కూరుకుపోయిన అన్నదాతల సంఖ్య 9.02 కోట్ల నుండి 9.30 కోట్లకు పెరిగింది. అంతేకాదు…సగటు రుణభారం 1.6 రెట్లు పెరిగింది. ఫలితంగా అన్నదాతలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.
తగ్గుతున్న కేటాయింపులు
మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ వ్యయంలో వ్యవసాయ కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. ఇక రైతు సంక్షేమానికి కేటాయింపుల సంగతి చెప్పనక్కర లేదు. 2014-15 నుండి 2021-22 వరకూ దేశంలో వాస్తవ వేతనాల వృద్ధి రేటు (వ్యవసాయ కార్మికులతో కలిపి) 1% కంటే తక్కువగా ఉండడం గమనార్హం. ఇక గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేటాయింపులు కూడా తగ్గిపోతున్నాయి. 2014-15 బడ్జెట్‌లో ఈ పథకానికి 1.85% నిధులు కేటాయిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు 1.33%కి తగ్గాయి. ఈ ఏడాది రూ.60,000 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం కంటే కేటాయింపులు 33% తగ్గిపోయాయి. మొత్తం జీడీపీలో ఈ కేటాయింపులు కేవలం 0.198% మాత్రమే. ఏటా 100 రోజుల ఉపాధి కల్పించాలన్న లక్ష్యం కూడా నీరుకారిపోతోంది.