దద్దరిల్లిన పార్లమెంట్‌

the rash Parliament– భద్రతా ఉల్లంఘనలపై చర్చించాలి
– హౌంమంత్రి ప్రకటన చేయాలి : ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన
– సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో నిరసన
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్‌ దద్దరిల్లింది. భద్రత ఉల్లంఘనలపై చర్చించాలని, దీనిపై కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. దీంతో ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. మరోవైపు సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా మిగిలిన ప్రతిపక్ష ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హౌం మంత్రి ప్రకటనకు పట్టుబడుతున్న ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన సెకన్లలోనే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభ మళ్లీ సెకన్లలోనే సోమవారానికి వాయిదా పడింది.
భద్రతా ఉల్లంఘనపై 23 నోటీసుల తిరస్కరణ
మరోవైపు రాజ్యసభలో కూడా ప్రతిపక్ష ఎంపీలు ఇదే అంశంపై చర్చకు డిమాండ్‌ చేయడంతో చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనపై చర్చించాలని ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన 23 నోటీసులను రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ తిరస్కరించారు. దీంతో ఎగిసిన నిరసనల మధ్య రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన కారణంగా తలెత్తిన ”తీవ్రమైన పరిస్థితి”కి సంబంధించి తనకు 23 నోటీసులు వచ్చాయని చైర్మెన్‌ సభకు తెలియజేశారు. ఘటనపై విచారణ జరుగుతోందని, దాన్ని ముగింపునకు తీసుకెళ్తామని ధన్‌ ఖర్‌ చెప్పారు. ”నోటీసులను అనుమతించను” అని అన్నారు. ఇది ప్రతిపక్ష పార్టీల నిరసనకు దారితీసింది. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లను రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ తన ఛాంబర్‌లో సమావేశానికి ఆహ్వానించారు. సమావేశమైనప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనబడలేదు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైన సభ ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లింది. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.
సస్పెన్షన్‌కు గురైన ఎంపీల నిరసన
ఢిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలోగల మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సస్పెన్షన్‌కు గురైన ఎంపీలతో సహా ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు చేబూని మౌన నిరసన చేపట్టారు. అనంతరం పార్లమెంట్‌ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు.
ఉభయ సభల ప్రారంభానికి ముందు ఇండియా ఫోరం ఎంపీలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో భేటీ అయ్యారు. ఉభయ సభల్లో ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగిచాలని తీర్మానం చేస్తూ ముందుకు వెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి.
హౌంమంత్రి పార్లమెంట్‌లో ప్రకటన చేయకుండా టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నారు: మల్లికార్జున్‌ ఖర్గే
భద్రతా ఉల్లంఘన అంశంపై కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా పార్లమెంటులో ప్రకటన ఇవ్వకుండా టీవీ ఛానళ్లకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఉల్లంఘనపై ప్రశ్నలు అడిగిన ఎంపీలను చట్టవిరుద్ధంగా సస్పెండ్‌ చేయడం న్యాయమా? అని అడిగారు. ”పార్లమెంట్‌, దాని ఎంపీల భద్రతలో భారీ లోపానికి కారణమైన ప్రతిపక్ష ఎంపీలను అక్రమంగా సస్పెండ్‌ చేయడం ఏం న్యాయం” అని ఖర్గే ప్రశ్నించారు. ”అమిత్‌ షా పార్లమెంట్‌లో ప్రకటన ఇవ్వాలని, ఆపై ఉభయ సభలలో చర్చించాలని ఇండియా ఫోరం పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి” అని అన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ తీవ్రమైన సమస్యపై స్వరం పెంచడం తమ కర్తవ్యమని, ఇది తమ పార్లమెంటరీ బాధ్యతని ఖర్గే పేర్కొన్నారు.
డీఎంకె నేత టిఆర్‌ బాలు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఉభయ సభలలో నిరసనలను కొనసాగించాలని, సస్పెన్షన్‌కు గురైన ఎంపీలకు సంఘీభావంగా ఆందోళనలు చేయాలని అన్నారు. అలాగే వారికి మద్దతుగా చేసే ఆందోళనల్లో మనల్ని కూడా సస్పెండ్‌ చేసినా వెనక్కి తగ్గకూడదని, ఎంత మందిని సస్పెండ్‌ చేసినా ఆందోళనలు కొనసాగించాలి అన్నారు.
శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్‌ సావంత్‌ పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై మాట్లాడుతూ ”పాస్‌లు ఇచ్చిన ఎంపీ ప్రతిపక్షానికి చెందిన వారైతే బీజేపీ అదే స్థాయిలో సామరస్యాన్ని ప్రదర్శించి ఉండేదా? వారికి ఈ చరిత్ర ఉంది. గుట్టల కొండను తయారు చేయడంలో నైపుణ్యం ఉంది. వాస్తవమేమిటంటే సభకు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత హౌంమంత్రిపై ఉంది. ఆయన రారు, ప్రధాని కూడా రారు” అని విమర్శించారు.
లోక్‌సభ నుంచి సస్పెన్షన్‌పై డీఎంకె ఎంపీ కె. కనిమొళి మాట్లాడుతూ.. ‘దేశాన్ని కాపాడేది తామేనని బీజేపీ పదేపదే చెబుతోంది. కానీ పార్లమెంట్‌ను కూడా రక్షించలేరని రుజువైంది. ప్రధాని లోపల ఉండి ఉంటే… పార్లమెంటును.., తమ సొంత ప్రధానిని కాపాడుకోలేని వారు సమస్యను రాజకీయం చేస్తున్నామని మమ్మల్ని అంటున్నారు. దేశంలో ఎక్కడైనా భద్రతకు విఘాతం కలిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని అన్నారు.
సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ మాట్లాడుతూ.. ‘ ఇండియా ఫోరానికి చెందిన ఎంపీలంతా ఒక్కటయ్యార’ గురువారం మమ్మల్ని అప్రజాస్వామికంగా సస్పెండ్‌ చేశారు. గాంధీ విగ్రహం ముందు మౌన దీక్ష చేస్తున్నాం. నిరసన కొనసాగిస్తాం. సమస్యను పార్లమెంట్‌లో ఇండియా ఫోరం నేతలు లేవనెత్తుతూనే ఉంటారు” అని అన్నారు.
పార్లమెంటరీ భద్రతా ఉల్లంఘన ఘటనపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ ”స్పీకర్‌ ఏ ఆదేశాలు ఇచ్చినా, ప్రభుత్వం వాటిని అక్షరాలా పాటిస్తోంది. ఈ అంశం కోర్టులో కూడా ఉంది. ఉన్నత స్థాయి విచారణ జరుగుతోంది. వారు ( ప్రతిపక్షం) బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి” అని అన్నారు.

Spread the love