అంతా గోప్యతే

అంతా గోప్యతే– అదానీ లావాదేవీలపై బ్లూమ్‌బర్గ్‌ కథనం
– వివాదాస్పద పీఎంసీ ప్రాజెక్ట్స్‌కు కాంట్రాక్టులు
– దానికి చిరునామా, ఫోన్‌ నెంబరే లేవు
– అది డమ్మీ కంపెనీ కావచ్చునని అనుమానాలు
కాంట్రాక్టు పనులు నిర్వహించే వివాదాస్పద సంస్థ హోవ్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌తో అదానీ గ్రూప్‌ సంబంధాలు కొనసాగిస్తోంది. తైవాన్‌కు చెందిన ఓ కుటుంబంతో ఈ కంపెనీకి సంబంధాలు ఉన్నాయని బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ తెలిపింది. బ్లూమ్‌బర్గ్‌ కథనం ప్రకారం ఈ కంపెనీ పీఎంసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ అనే మరో కంపెనీకి చెందిన కీలక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే పీఎంసీ ప్రాజెక్ట్స్‌ కంపెనీపై పలు ఆరోపణలు ఉన్నాయి. పీఎంసీ ప్రాజెక్ట్స్‌ మరో రెండు ఇతర కంపెనీలతో కలిసి దిగుమతి చేసుకున్న విద్యుత్‌, మౌలిక సదుపాయాల పరికరాల విలువలో రూ.1,500 కోట్ల మేర దండుకున్నదనే వార్తలు వస్తున్నాయి. కోట్లకు పడగలెత్తిన గౌతమ్‌ అదానీ సామ్రాజ్యం ఈ కంపెనీని ఉపయోగించుకొని దాని ద్వారా విదేశాల నుండి సొమ్ము ఆర్జించిందని 2014లోనే కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది.

న్యూఢిల్లీ : అయితే ఈ ఆరోపణలన్నింటినీ అదానీ తోసిపుచ్చారు. ఈ వ్యవహారంపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)కి చెందిన సంస్థ 2017లో విచారణ జరిపి ఆరోపణలను తోసిపుచ్చింది. దిగుమతులన్నీ నిజంగా జరిగినవేనని తేల్చింది. ప్రకటించిన విలువ సరిగానే ఉన్నదని, దానిని మరోసారి ధృవీకరించాల్సిన అవసరం లేదని తెలిపింది. పీఎంసీ వ్యాపార కార్యకలాపాలు 2016 ఏప్రిల్‌లో హోవ్‌ కంపెనీలో కలిసిపోయాయని కోర్టు ఫైలింగ్స్‌ చెబుతున్నాయి. ఈ ఫైలింగ్స్‌ను ఇటీవల బ్లూమ్‌బర్గ్‌ విశ్లేషించింది. మన దేశంలో నిర్మాణంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ఓడరేవులు, రైల్వే లైన్లకు హోవ్‌ కంపెనీ ఇప్పటికీ అదానీ కాంట్రాక్టర్‌గా కొనసాగుతోందని తేలింది. హోవ్‌ కంపెనీకి, అదానీ గ్రూపుకు మధ్య సంబంధం ఉన్నదా? కాంట్రాక్ట్‌ సంస్థకు అదానీ పోర్ట్స్‌ చేసిన చెల్లింపులపై ఎందుకు అభ్యంతరాలు తెలిపారు? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో అదానీ గ్రూప్‌ కంపెనీల ఆడిటర్‌గా వ్యవహరించిన డెలాయిట్‌ విఫలమైంది.
అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ ఆడిటర్‌ పదవికి డెలాయిట్‌ రాజీనామా చేసింది. అదానీ పోర్ట్స్‌, కాంట్రాక్ట్‌ సంస్థ ఖాతాలను తాను పూర్తి స్థాయిలో పరిశీలించలేదని డెలాయిట్‌ తెలిపింది. పీఎంసీ అనేది అదానీకి సంబంధించినదేనని హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ తన నివేదికలో తేల్చి చెప్పింది. అదానీ గ్రూపుకు చెందిన లిస్టెడ్‌ కంపెనీల నుండి సొమ్మును తరలించేందుకు ఈ కంపెనీని వాడుకున్నారని తెలిపింది. అదానీ గ్రూపుకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌ పీఎంసీ ప్రాజెక్ట్స్‌ గత 12 సంవత్సరాలలో 784 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సంపాదించిందని హిండెన్‌బర్గ్‌ వివరించింది. అయినా ఈ కంపెనీకి ఓ వెబ్‌సైట్‌ అంటూ లేదు. అదానీతో దాని సంబంధాలను రికార్డులు బయటపెడుతున్నాయి. ఆ కంపెనీ కార్పొరేట్‌ చిరునామా, ఫోన్‌ నెంబర్‌ కూడా అదానీ గ్రూపుదే.
పీఎంసీ ప్రాజెక్ట్స్‌ అనేది అదానీ గ్రూపుతో అనుబంధమున్న డమ్మీ సంస్థా అని బ్లూమ్‌బర్గ్‌ వివరణ కోరింది. దీనికి అదానీ గ్రూప్‌ ప్రతినిధి బదులిస్తూ హోవ్‌, పీఎంసీ అనేవి వేర్వేరు కంపెనీలని, వాటికి అదానీతో సంబంధమేమీ లేదని తెలిపారు. అన్ని లావాదేవీలు చట్ట ప్రకారమే జరిగాయని బదులిచ్చారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమంటే తైవాన్‌కు చెందిన పెట్టుబడిదారు ఛాంగ్‌ ఛంగ్‌-లింగ్‌ కుమారుడే పీఎంసీ ప్రాజెక్ట్స్‌ కంపెనీకి అధిపతి. వ్యవస్థీకృత నేరాలు, అవినీతిని బయటపెట్టే ప్రాజెక్ట్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఛాంగ్‌ ఛంగ్‌-లింగ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీల వాటాలను ఆఫ్‌షోర్‌ నిధుల (విదేశీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్‌ ఫండ్స్‌) ద్వారా కొనుగోళ్లు, అమ్మకాలు జరిపి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించారు. హోవ్‌, పీఎంసీలతో తనకు సంబంధం లేదని అదానీ గ్రూప్‌ వాదిస్తున్న నేపథ్యంలో వాటికి జరిపిన చెల్లింపులకు సంబంధించి ఎలాంటి పరిశీలనలు, తనిఖీలు చేయలేదు.
బ్లూమ్‌బర్గ్‌ ప్రతినిధులు హి లింగోస్‌ కంపెనీ లిమిటెడ్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఆ కంపెనీకి తైవాన్‌లో ఛంగ్‌-లింగ్‌ యజమాని. ఆ కార్యాలయంలో అదానీ లోగోను ప్రదర్శించారు. ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఛంగ్‌-లింగ్‌ సుముఖంగా లేరని కార్యాలయ కార్యదర్శి చెప్పారు. పోనీ ఆయన కుమారుడి ఫోన్‌ నెంబర్‌ అయినా ఇవ్వమని బ్లూమ్‌బర్గ్‌ ప్రతినిధులు కోరగా అందుకు కార్యదర్శి నిరాకరించారు. డెలాయిట్‌ ఆరోపణ చేసే వరకూ హోవ్‌కు ఎంత సొమ్ము ఇచ్చిందీ అదానీ వెల్లడించలేదు. అప్పటి నుండి హోవ్‌ 245 మిలియన్‌ డాలర్ల డిపాజిట్లను వాపసు చేశారు. సాధారణంగా కాంట్రాక్ట్‌ పూర్తయితేనో లేదా రద్దయినప్పుడో కాంట్రాక్టర్లు ఈ నిధులను వాపసు చేస్తుంటారు.
‘డబ్బు ఎవరికి ముట్టింది? హోవ్‌, అదానీ కోసం వారు చేసిన పని ఏమిటి? ఆ డబ్బును ఎలా ఖర్చు చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది’ అని హాంగ్‌కాంగ్‌లోని ఆసియన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అసోసియేషన్‌లో భారత ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న షర్మిలా గోపీనాథ్‌ ప్రశ్నించారు. చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకు బహిర్గతం చేయడం లేదని నిలదీశారు. కాంట్రాక్టర్‌కు అదానీ చెప్పుకోదగిన మొత్తంలో చెల్లింపులు జరిపారని, ఆ కాంట్రాక్టర్‌కు యజమాని తైవాన్‌ సంస్థేనని తెలిపారు. అదానీ, హోవ్‌, పీఎంసీ కంపెనీల మధ్య ఉద్యోగులు తరచూ మారుతున్నారని, హోవ్‌, పీఎంసీ కంపెనీలలో గతంలో డైరెక్టర్లుగా పనిచేసిన వారు అదానీ కంపెనీ బోర్డుల్లో సంవత్సరాల తరబడి నియమితులయ్యారని కోర్టు ఫైలింగ్స్‌ను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ తెలియజేసింది. పెట్టుబడిదారుల సొమ్ముతో కూడిన వ్యవహారం కాబట్టి లిస్టెడ్‌ కంపెనీలు చేసే చెల్లింపుల సమాచారం అందుబాటులో ఉండాలని గోపీనాథ్‌ చెప్పారు.

Spread the love