ప్రజాస్వామ్యం ఖూనీ

Democracy is murderous– మతోన్మాదం పెచ్చరిల్లుతోంది
– అధికారపార్టీ రాజకీయ అస్త్రాలుగా ఈడీ, సీబీఐ
– ప్రతిపక్షాలను భయపెట్టడానికి, వేధించడానికే దర్యాప్తు సంస్థలు
– విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి
– ముగిసిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి గద్దె దించే పోరాటానికి నాయకత్వం వహిస్తామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తిరువనంతపురంలోని ఈఎంఎస్‌ అకాడమీలో మూడు రోజుల పాటు జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు మంగళవారం ముగిశాయి. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎత్తుగడలు, దేశంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై సమావేశాల్లో చర్చించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యాదర్శి, పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎంవి గోవింధన్‌ మాస్టార్‌, పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎంఏ బేబిలతో కలిసి ఏచూరి మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ఖూనీ చేస్తోందని విమర్శించారు. ”ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉంది. కేరళలో ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ మధ్య ప్రత్యక్ష పోరు. ఇక్కడ బీజేపీకి సీట్లు రావు. అదే తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్‌ ఫ్రంట్‌. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ పార్టీ మినహా మహాకూటమి ఉంది. ‘ఇండియా’ ఫోరంకు చాలా రాష్ట్రాల్లో సాధారణ అభ్యర్థులు ఉన్నారు. కేరళ, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఇది సాధ్యం కాదు. బీహార్‌లో ప్రస్తుత పరిణామాలకు నితీష్‌ కుమార్‌ మాత్రమే బాధ్యత వహించాలి. మోడీ కేరళకు వచ్చి మాట్లాడితే ఏమీ జరగదు. ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలే నిర్ణయిస్తారు. ఈడీ, సీబీఐని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఈడీ కేసు పెట్టిన వారు బీజేపీలో చేరితే కేసు క్లోజ్‌ అయ్యే పరిస్థితి ఉంది. 2019 తరువాత ఈడీ 5,500 కంటే ఎక్కువ కేసులను నమోదు చేసింది. 23 శాతం కేసులు మాత్రమే కోర్టుకు చేరాయి. ప్రత్యర్థులను భయపెట్టడానికి, వేధించడానికే ఈడీ ఉపయోగించబడుతుంది. కేరళను కష్టాల్లోకి నెట్టిన బిజెపికి సాయం చేయడమే కాంగ్రెస్‌ వైఖరిగా ఉంది” అని ఏచూరి అన్నారు.
ఈవీఎంల్లోని సీక్వెన్స్‌లో మార్పులు చేయాలి
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఈవీఎం) సిస్టమ్‌లోని యంత్రాల క్రమాన్ని రీఆర్డరింగ్‌ చేయాలని అన్నారు. ఈవీఎం వ్యవస్థలో బ్యాలెట్‌ యూనిట్‌ (బీయూ), కంట్రోల్‌ యూనిట్‌ (సీయూ), ఇటీవల జోడించిన ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వివిప్యాట్‌) ఉన్నాయి. ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని సీపీఐ(ఎం) గుర్తించింది. అందుకే పోలింగ్‌ బూత్‌లో ఈ మెషీన్ల ప్లేస్‌మెంట్‌ సీక్వెన్స్‌లో మార్పును ప్రతిపాదించాం” అని ఏచూరి తెలిపారు. ”ప్రస్తుతం, ఈ ప్రక్రియలో యూనిట్‌లో ఓటింగ్‌ ఉంటుంది. ఇది కంట్రోల్‌ యూనిట్‌కి బదిలీ చేయబడే ముందు ధ్రువీకరణ కోసం వివిప్యాట్‌కు పంపిస్తుంది. మేం ఓటరు యూనిట్‌ నుంచి వివిప్యాట్‌కు ప్రసారాన్ని ట్రాక్‌ చేయగలిగినప్పటికీ, వివిప్యాట్‌ నుంచి కంట్రోల్‌ యూనిట్‌కు ఏమి ప్రసారం చేయబడుతుందనే దానిపై అనిశ్చితి ఉంది. కాబట్టి, మేం మార్పును సూచిస్తున్నాం. ఓటర్‌ యూనిట్‌, తరువాత కంట్రోల్‌ యూనిట్‌, ఆ తరువాత వివిప్యాట్‌. ఈ విధంగా, ఓటర్లు తమ ఓటు ఖచ్చితంగా కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైందని ధ్రువీకరించుకోవచ్చు” అన్నారు. 50 శాతం వివిప్యాట్‌లను ఓటింగ్‌ మెషీన్‌లో ప్రదర్శించే సమాచారంతో క్రాస్‌ చెక్‌ చేసుకోవాలనే అవసరాన్ని ఏచూరి నొక్కిచెప్పారు. ”ఈ విధానంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సమానమైన అవకాశాన్ని అందించేలా, ప్రజలలో విశ్వాసాన్ని నింపడం లక్ష్యంగా పెట్టుకోవాలి” అని ఏచూరి తెలిపారు.

Spread the love