– విచారణానంతరం ఈడీ కస్టడీలోకి హేమంత్
– ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
– రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేత.. ఆమోదం
– నూతన సీఎంగా సీనియర్ మంత్రి చంపారు సొరెన్
– శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
– ప్రమాణస్వీకారం కోసం గవర్నర్‌కు అభ్యర్థన
రాంచీ : భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ అరెస్టయ్యారు. ముందుగా ఊహించినట్టుగానే ఆరు గంటల విచారణానంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనను అదుపులోకి తీసుకున్నది. హేమంత్ సొరెన్ తమ కస్టడీలో ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. అయితే, హేమంత్ సొరెన్‌ను తన పాత ఇంటిలోనే హౌజ్ అరెస్ట్‌లో ఉంచనున్నట్టు ఈడీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈడీ కస్టడీలోకి తీసుకోవటంతో సీఎం పదవికి హేమంత్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ సి.పి రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా లేఖను అందించారు. గవర్నర్ ఆయన రాజీనామాను ఆమోదించారు. హేమంత్ అరెస్ట్, రాజీనామాతో జార్ఖండ్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో తదుపరి సీఎం ఎవరన్నదానిపై తీవ్ర చర్చ నడిచింది. నూతన సీఎంగా పార్టీ సీనియర్ నాయకుడు, క్యాబినెట్ మినిస్టర్ చంపారు సొరెన్ ఉంటారని జేఎంఎం వర్గాలు తెలిపాయి. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి చంపారు సొరెన్ రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. ప్రస్తుతం ఆయన హేమంత్ సొరెన్ ప్రభుత్వంలో రవాణా, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్నారు. హేమంత్ సొరెన్‌కు విధేయుడిగా ఈయనకు పేరున్నది. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలున్న జార్ఖండ్ అసెంబ్లీలో.. ప్రభుత్వ ఏర్పాటుకు 41 మంది ఎమ్మెల్యేల అవసరం ఉన్నది. ” మేము చంపారు సొరెన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నాం. ప్రమాణస్వీకార వేడుకకు గవర్నర్‌ను అభ్యర్థించటానికి మేము రాజ్‌భవన్‌కు వచ్చాం” అని జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా తెలిపారు. చంపారు సొరెన్ తదుపరి సీఎంగా ఉంటారనీ, తమకు అందుకు కావల్సిన సంఖ్య(ఎమ్మెల్యేలు) ఉన్నదని జేఎంఎం ఎంపీ మహువా మజీ అన్నారు. ఇటు హేమంత్ అరెస్టుతో పరిణామాలను రాజ్‌భవన్ నిశితంగా పరిశీలిస్తున్నది. ప్రస్తుత పరిస్థితిపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటున్నది.
అంతకముందు ఈడీ హేమంత్‌ను విచారిస్తున్న తరుణంలో ఆయన అరెస్టు అవుతారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జార్ఖండ్‌లోని సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఒక్కొరొక్కరుగా గవర్నర్ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు చంపారు సొరెన్‌ను తదుపరి సీఎంగా ప్రతిపాదించారు. మంగళవారం తన అధికారిక నివాసంలో నిర్వహించిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో హేమంత్ సొరెన్ భర్య కల్పనా సొరెన్‌ను తదుపరి సీఎంగా నియమించవచ్చనే వార్తలు వెలువడినప్పటికీ.. అనూహ్యంగా చంపారు సొరెన్ పేరు తెర పైకి వచ్చింది.
హేమంత్‌ను విచారించటం కోసం బుధవారం మధ్యాహ్నం రాంచీలోని హేమంత్ సొరెన్ అధికారిక నివాసానికి ఏడుగురు సభ్యుల ఈడీ బృందం చేరుకున్నది. అనంతరం ఈడీ అధికారులు ఆయనను విచారించటం ప్రారంభించారు. ఆరు గంటల సుదీర్ఘ విచారణానంతరం ఈడీ ఆయనను అదుపులోకి తీసుకున్నది.
ఈడీపై హేమంత్ కేసు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌ను రాంచీలోని ఆయన ఇంటిలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది. ఈడీ అధికారులపై హేమంత్ కేసు వేశారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ ధుర్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
‘ఈడీ చర్య బహిరంగంగా తనను అవమానపర్చటమే’
తన ఫిర్యాదులో ఈడీ అధికారుల పేర్లను హేమంత్ లేవనెత్తారు. ఎలాంటి నోటీలు లేకుండానే, తాను లేని సమయంలో ఈడీ అధికారులు గత నెల 29న న్యూఢిల్లీలోని తన నివాసంలో ఉద్దేశపూర్వక సోదాలు నిర్వహించారని ఆరోపించారు. నాకు చెందిన నీలి రంగు కలర్ బీఎండబ్ల్యూ కార్‌ను సీజ్ చేశామనీ, పెద్ద మొత్తంలో అక్రమ నగదును స్వాధీనపర్చుకున్నామని అధికారులు తప్పుడు సమాచారాన్ని లీక్ చేశారని హేమంత్ వివరించారు. అయితే, వాటితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొన్నారు. ఈడీ చర్య తనను బహిరంగ అవమానపర్చటమేనని ఆయన ఆరోపించారు. ఈడీ అధికారుల చర్యల కారణంగా తాను, తన కుటుంబం బాధపడ్డామనీ, తీవ్రమైన మనో వేధనను ఎదుర్కొన్నామనీ, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను మేమంత్ పిర్యాదులో కోరారు
హేమంత్‌ను ఇంటికి ఈడీ
ముందుగా జారీ చేసిన సమన్ల ప్రకారం బుధవారం మధ్యాహ్నం హేమంత్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు. అనంతరం ఆయనను విచారించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన విచారణ కొనసాగింది. ఈ భూకుంభకోణానికి సంబంధించి విచారించటం కోసం హేమంత్‌కు ఈడీ గతంలో అనేక సార్లు సమన్లు పంపింది. దాదాపు తొమ్మిది సార్లు హేమంత్ ఈడీ సమన్లను విస్మరించారు. ఈ క్రమంలో గతనెల (జనవరి 20న) జార్ఖండ్ సీఎంను ఈడీ విచారించింది. మళ్లీ పది రోజుల వ్యవధిలోనే బుధవారం (జనవరి 31న) నాడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయనను ప్రశ్నించటం గమనార్హం.
భద్రత కట్టుదిట్టం..రాంచీలో ఆంక్షలు
హేమంత్ సొరెన్‌ను ఈడీ విచారిస్తున్న సమయంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్‌ను విధించారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని పలు కీలక ప్రాంతాల్లో అధికారులు నిషేదాజ్ఞలు విధించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించటానికి ముగ్గురు సభ్యుల బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. విచారణ కొనసాగుతున్న సమయంలో రాంచీలోని కంకె రోడ్డు వద్ద సీఎం నివాసం వద్ద హేమంత్ సొరెన్‌కు చెందిన జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు గుమిగూడి బల ప్రదర్శనను నిర్వహించారు. కేంద్రం ఆదేశాల మేరకు మా సీఎంను ఈడీ ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నదని హేమంత్ మద్దతుదారులు ఆరోపించారు.
జేఎంఎం నిరసనలు
అలాగే, సంకీర్ణ కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు సైతం సీఎంకు సంఘీభావం తెలిపారు. హేమంత్‌ను ఈడీ విచారిస్తున్న సందర్భంలో జేఎంఎం కార్యకర్తలు, మద్దతుదారులు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళలకు దిగారు. ఈడీకి, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈడీ విచారణ సందర్భంగా హేమంత్‌ను అధికారులు ఏ క్షణాన్నైనా అరెస్టు చేయొచ్చనే వార్తల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకు జార్ఖండ్‌లో హైడ్రామా చోటు చేసుకున్నది. దాదాపు 30 గంటల నిరీక్షణకు తెరదించుతూ హేమంత్ రాంచీలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన విషయం విదితమే. ఈ తరుణంలోనే హేమంత్ తన భార్యకు సీఎం పగ్గాలు అప్పగించనున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి.