కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మ

ED puppet in Kendra's hand– ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్ట్‌, రిమాండ్‌ ఉత్తర్వులపై కవిత సవాల్‌
– 537 పేజీలతో సుప్రీంలో ఫ్రెష్‌ పిటిషన్‌ దాఖలు
– నేడు సీజేఐ బెంచ్‌ ముందు మెన్షన్‌ చేసే అవకాశం
– కవిత కేసు విచారించే న్యాయమూర్తి బదిలీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌, రిమాండ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్‌ అక్రమమని, రిమాండ్‌ ఉత్తర్వులు రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతూ పలు కీలకాంశాలతో తాజాగా క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈడీ కీలు బొమ్మగా (పఫ్పెట్‌) మారిందని ఆరోపించారు. రాజకీయ ఎజెండాతో ఈడీ అధికారులు పని చేస్తున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. కవితపై ఎలాంటి కేసు లేదని, పలువురిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఆమెను అరెస్ట్‌ చేశారని అన్నారు. ఈడీ తీరును నిరసిస్తూ… మొత్తం 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరపు న్యాయవాది మోహిత్‌ రావు సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో ఫ్రెష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో సర్వోన్నత న్యాయస్థానంలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌, ఆ పిటిషన్‌ పై విచారణ, తేదీల వారీగా కోర్టు ఆదేశాలు, ఇతర అంశాలను వరుస క్రమంలో మెన్షన్‌ చేశారు. అయితే విచారణ జాబితాలో ఈ పిటిషన్‌ నమోదు కాకపోవడంతో… బుధవారం సీజేఐ బెంచ్‌ ముందు ఈ అంశాన్ని మెన్షన్‌ చేయనున్నట్లు అడ్వకేట్లు తెలిపారు. కాగా, సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఈడీ అధికారులు తనను అరెస్ట్‌ చేశారని కవిత పిటిషన్‌ లో ఆరోపించారు. ఏడాది కాలంగా తన పిటిషన్‌పై జరిగిన వాదనలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ పిటిషన్‌కు జత చేశారు. చట్ట విరుద్ధంగా కక్ష సాధింపుతో తనను అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. అలాగే గత విచారణల సందర్బంగా కవితను అరెస్ట్‌ చేయబోమని ఈడీ తరపు అడ్వకేట్లు పలు సందర్భాల్లో చేసిన వాదనలపై… కోర్టు ఆదేశాలు, మీడియా సంస్థలు ప్రచురించిన వివరాలను ఫొటోలతో సహా పిటిషన్‌కు జతచేశారు. పిటిషన్‌ మహిళ అయినందున… ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ -2022 సెక్షన్‌ 50(2) ప్రకారం కవితకు రక్షణ ఉంటుందన్నా రు. అలాగే కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం కేసులో మహిళలను ఇంటివద్దనే విచారించాలన్న తీర్పు కాపీలను అటాచ్‌ చేశారు. మహిళా నిందితురాలను ఇంటివద్దనే విచారించాలనే ఉత్తర్వులను ఉల్లంఘించారని వివరించారు.
ఈడీ కస్టడీ రాజ్యాంగ విరుద్ధం
సుప్రీంకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే సోదాల పేరుతో హైదరాబాద్‌లోని తన నివాసంలోకి వచ్చిన ఈడీ అధికారులు అక్రమంగా తనను అదుపులోకి తీసుకున్నారని ప్రస్తావించారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టి కస్టడీకి తీసుకున్న తీరును వివరించారు. సుదీర్ఘ వాదనల అనంతరం తనను ఈడీ కస్టడీకి అప్పగించారని తెలిపారు. అయితే ఈ కస్టడీ విధింపు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 21, 22(1) అండ్‌(2) ప్రకారం విరుద్ధమని పేర్కొన్నారు. ఈడీ అధికారుల అక్రమ అరెస్ట్‌తో పిటిషనర్‌కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. పిటిషనర్‌ ఎలాంటి తప్పు చేయలేదని, కవితపై ఎలాంటి కేసు లేదన్న విషయాలను పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. అందువల్ల తుది తీర్పు వెలువడే వరకు పలు షరతులు విధిస్తూ తక్షణమే కవితను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ రిట్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నంత కాలం కవితపై ఎలాంటి బలవంతపు(అరెస్ట్‌ )చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రస్తుత అరెస్ట్‌పై స్టే విధిస్తూ ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టాలని కోరారు.
పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థల తనపై ఎలాంటి బలవంతపు చర్యలు(అరెస్ట్‌) తీసుకోకుండా చూడాలంటూ కవిత గతేడాది మార్చిలో 105 పేజీలతో కూడిన రిట్‌ పిటిషన్‌ (క్రిమినల్‌) వేశారు. ఇందులో ఈడీ ఆఫీసుకు మహిళలను విచారణకు పిలవవచ్చా? అనే అంశాన్ని కూడా సవాల్‌ చేశారు. అయితే గత ఏడాది కాలంగా ఈ పిటిషన్‌ వాయిదా పడుతూ వస్తోంది. కాగా, గత శుక్రవారం కవితను ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్‌ చేశారు. అయితే కవిత గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. కవిత తరపు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్ట్‌తో తనపై బలవంతపు చర్యలు(అరెస్ట్‌) తీసుకోకూడదంటూ వేసిన పిటిషన్‌ నిరార్థకం అయిందన్నారు. అందువల్ల చట్టపరంగా ఉన్న పరిష్కార మార్గాలతో ముందుకు వెళ్తామని ధర్మాసనానికి నివేదించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం.. పిటిషన్‌ విషయంలో స్పష్టత కోరింది. ఇందుకు బదులిస్తూ తాము వేసిన పిటిషన్‌ను విత్‌ డ్రా (ఉపసంహరణ) చేసుకుంటున్నట్లు విక్రమ్‌ చౌదరి నివేదించారు. ఈ విజ్ఞప్తిపై జస్టిస్‌ బేలా ఎం త్రివేది ఈడీ అభిప్రాయాన్ని కోరింది. ఇందుకు ఈడీ తరపున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు అభ్యంతరం తెలపకపోవడంతో కవిత పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు ధర్మాసనం అనుమతించింది.
తల్లి, కుమారుడు ఇతర కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతి
ఈడీ కస్టడీలో ఉన్న తనను కలిసేందుకు తల్లి, పిల్లలకు అనుమతినివ్వాలని కవిత రౌస్‌ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమణులు అఖిల సౌమ్య, వినుత సోదరుడు ప్రశాంత్‌ రెడ్డిలను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ మేరకు మంగళవారం కవిత తరపు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈడీ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఎక్కువ మంది కలవడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. అయితే కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం తల్లి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కాగా కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ గత శనివారం సీబీఐ స్పెషల్‌ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇందులో భర్త అనిల్‌, సోదరుడు కేటీఆర్‌, బావ హరీశ్‌, ఇద్దరు న్యాయవాదులకు, మరో ముగ్గురికి అనుమతి ఇచ్చింది.
న్యాయవాదితో కేటీఆర్‌ భేటీ
కస్టడీలో ఉన్న కవితను మంగళవారం కేటీఆర్‌ ఒక్కరే కలిశారు. తొలిరోజైన ఆదివారం భర్త అనిల్‌, హరీశ్‌ రావులతో కలిసి కేటీఆర్‌ కవితను పరామర్శించారు. సోమవారం కేటీఆర్‌, హరీశ్‌రావులు వెళ్లగా… మంగళవారం మాత్రం కేటీఆర్‌ ఒక్కరే కలిసి మాట్లాడారు. న్యాయవాది మోహిత్‌ రావుతో కలిసి చట్ట పరంగా ముందుకెళ్తోన్న విషయాలను వివరించారు. అలాగే దర్యాప్తులో ఇతర సమస్యలు, ఫ్రెష్‌ రిట్‌ పిటిషన్‌లోని అంశాలను ఆమెకు తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం… సాయంత్రం 5 గంటలకు కవిత విచారణ సమయం ముగిసింది. 5:30 కి వైద్యుల బృందం రోజువారీ సాధారణ వైద్య పరీక్షలు చేశారు. ఆరు గంటలకు దర్యాప్తు చేస్తోన్న డిప్యూటీ డైరెక్టర్‌ భాను ప్రియ మీనా ఈడీ ఆఫీసు నుంచి వెళ్లి పోయారు. కాగా, మంగళవారం విజిటింగ్‌ సమయంలో మార్పులు జరిగాయి. 6 నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే పలు కారణాల వల్ల కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌ రావు రాత్రి 7 గంటలకు కవితను కలిశారు.
మూడో రోజు సుదీర్ఘంగా సాగిన విచారణ
కస్టడీలో ఉన్న కవితను మూడో రోజు ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈడీ సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలం, సహ నిందితుల నుంచి రాబట్టిన వివరాలపై ఆరా తీశారు. ఉదయం 10.30 గంటల తరువాత కవిత విచారణ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అధికారులు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చారు. మళ్లీ 3 గంటల తరువాత విచారణ ప్రారంభించి, 5 గంటల లోపు ముగించారు. పాలసీ రూపకల్పన సందర్భంలో ఢిల్లీ, హైదరాబాద్‌లోని హౌటల్స్‌లో జరిగిన మీటింగ్‌లు, సౌత్‌ గ్రూప్‌ సభ్యుల ఫోన్లలో దొరికిన కీలక ఆధారాలపై ఈడీ ప్రశ్నించింది. ముఖ్యంగా రూ.100 కోట్ల ముడుపులను ఆప్‌ నేతలకు చేరవేతపై ఆరా తీసినట్లు తెలిసింది. గోవా, పంజాబ్‌ ఎన్నికలకు ఈ నిధులు మళ్లించిన విషయంపై ఆమె స్టేట్మెంట్‌ ను రికార్డు చేసినట్లు సమాచారం. అలాగే బుచ్చిబాబు, అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయిన పల్లితో జరిపిన మీటింగ్‌లు, కాల్‌ డేటా, చాట్స్‌ పై వాంగ్మూలం తీసుకున్నారు. ఇందులో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పిన కవిత, కొన్ని అంశాల్లో తనకు సంబంధం లేదన్నారు. కాగా విచారణ అధికారి భాను ప్రియ మీనా పలు రాజకీయ ప్రశ్నలు వేయగా… ఈ కేసుతో వాటికి ఏం సంబంధం అని కవిత చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కవిత కేసు విచారించే న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్‌ బదిలీ
ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమకం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుని విచారిస్తున్న ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లోని మరో 26 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. అనూహ్యంగా జడ్జి నాగ్‌పాల్‌ కూడా బదిలీ కావడం గమనార్హం.

Spread the love