– ఎంపీ నిధుల పనులపై ఫోకస్
– ఈవీఎంల తనిఖీ షురూ..
– అభివృద్ధి పనుల పూర్తికి ప్లానింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
లోక్‌సభ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో ఈసీ నుంచి అధికార ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అధికారులు పనుల్లో నిమగమయ్యారు. ఇప్పటికే ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై ఓసారి సమీక్షా సమావేశం జరగ్గా.. రెండ్రోజుల కిందట అసెంబ్లీ ఎన్నికల కోసం వినియోగించిన ఈవీఎం మిషన్ల పరిశీలన సైతం మొదలైంది. పెండింగ్ పనులను మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఒక్క ‘మల్కాజిగిరి’ పార్లమెంట్ సెగ్మెంట్ మాత్రమే ఉంది. ఈ సెగ్మెంట్ ఇండియాలోనే అతి పెద్దది. దీన్ని మినీ భారత్‌గా కూడా పిలుస్తారు. ఈ సెగ్మెంట్ పరిధిలో 40 లక్షల మంది వరకు ఓటర్లు ఉంటారు. ఈ సెగ్మెంట్ మేడ్చల్-మల్కాజి గిరి జిల్లా పరిధిలోని మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ఐదు నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్బీనగర్, హైదరాబాద్ జిల్లా పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం తో ముడిపడి ఉంది. ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికలను నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అధికారులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. పెండింగ్ పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాగా ఎల్బీనగర్, కంటో న్మెంట్ నియోజకవర్గాల్లో ఎంపీ నిధుల తో చేపట్టిన పనుల పురోగతిపై సమావేశం జరగాల్సి ఉంది.
ఎంపీ నిధులపై ఫోకస్
మల్కాజిగిరి ఎంపీ నిధులపై ఫోకస్ చేశారు. ఈ విషయంపై రెండ్రోజుల కిందట జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించిఅధికారులకు దిశానిర్దేశం చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పనులు పెండింగ్‌లో ఉంచొద్దని ఆదేశించారు. ఈ పనులన్నింటినీ మార్చి 31వ తేదీ లోపు పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్), పార్లమెంట్ ప్రాంత నిధులు (సీబీఎఫ్), ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్) నిధులకు సంబంధించి జిల్లాలోని రహదారులు భవనాలు (ఆర్‌అండ్‌బీ), పంచాయతీరాజ్, అటవీశాఖ (డీఎఫ్‌ఓ), జిల్లా అభివృద్ధి నిధులు (డీడబ్ల్యూఓ), డీఆర్డీఏ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పోలీస్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్ పనులపై ఆరా తీశారు. ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని పనులు పూర్తయ్యాయి..? ఇంకా ఎన్ని పనులు ఏ ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి..? పూర్తిగా క్యాన్సిల్ అయిన పనులు ఎన్ని..? అనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో జిల్లా అధికారులు అభివృద్ధి పనులను గడువులోపు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 15 రోజుల తర్వాత పనుల పురోగతిపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పడంతో అధికారులు పనుల్లో నిమగమయ్యారు.
ఈవీఎంల పరిశీలన..
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈసీఐఎల్ కంపెనీకి చెందిన అధికారులు మూడ్రోజుల కిందట మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ పరిధిలో భద్రంగా ఉంచిన ఈవీఎంలను పరిశీలించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఈవీఎంలనే వినియోగించడంతో ఈసీఐఎల్ అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. కూకట్‌పల్లి, మేడ్చల్ ఈవీఎంల పనితీరుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.