– యువత, మహిళ, రైతులు, పేదలే ప్రధానం
– పేదరికాన్ని నిర్మూలించాం : ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
– ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
– నేడు మధ్యంతర బడ్జెట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
యువత, మహిళ, రైతులు, పేదలు అనే నాలుగు స్తంభాలపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి బుధవారం ప్రసంగించారు. దేశ సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని తెలిపారు. 21వ శతాబ్దంలో దేశం కొత్త సంప్రదాయాలకు తెరతీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘శాంతి నికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని జన్ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నాం. తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకానుంది. ఆదివాసీ యోధులను ఇలా స్మరించుకోవడం గర్వకారణం’ అన్నారు. గతేడాది దేశం ఎన్నో విజయాలను సాధించిందన్నారు. ”ఆసియా క్రీడల్లో తొలిసారి 107, పారా క్రీడల్లో 111 పతకాలను సాధించాం. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా ‘నారీశక్తి వందన్ అథీనియమ్’ బిల్లును ఆమోదించుకున్నాం” అన్నారు. అటల్ టన్నెల్‌ను కూడా పూర్తి చేశామన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందనీ, ఆదిత్య ఎల్-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిందని అన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి స్కీమ్‌లు ఇండియాను మరింత బలోపేతం చేశాయన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం చాలా వేగంగా ఎదిగిందన్నారు. ఇటీవల ప్రపంచం రెండు భారీ యుద్ధాలను, కరోనా మహమ్మారిని చూసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితి ఉన్నా.. సంక్షోభ సమయంలో తమ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచేందుకు పటిష్ఠ చర్యలు తీసుకున్నదని వివరించారు. మధ్య తరగతి, సాధారణ ప్రజలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు ముర్ము వివరించారు. ‘మన చిన్నతనం నుంచీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని వింటున్నాం. కానీ, జీవితంలో తొలిసారి పేదరికం తగ్గుదలను చూస్తున్నాం. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా దేశం ముందుకెళ్తోంది” అన్నారు. ”దేశంలో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తున్నది. కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చాం. రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. యూపీ, తమిళనాడులో రక్షణ బారిడార్లు ఏర్పాటయ్యాయి. రక్షణ రంగ ఉత్పత్తులు దేశంలో తయారవడం గర్వకారణం. రక్షణ రంగం కోసం రూ.1 లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం” అని చెప్పారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, లాభాలను అందించడమే తమ లక్ష్యమని, కిసాన్ సమ్మాన్‌తో 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. ఉజ్వల కనెక్షన్లు పది కోట్లు దాటాయన్నారు. ఆవాస్ యోజన పథకం కింద సామాన్యులకు నీడ కల్పిస్తున్నామనీ, 4.10కోట్ల మందికి పక్కా ఇండ్లు నిర్మించామని చెప్పారు. పదేండ్లలో వేల ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. రూ. 7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశామని, సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదనీ, 2 కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారని అన్నారు. ట్రాన్స్ జెండర్లకు సమాజంలో గౌరవస్థానం కల్పించామని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం చరిత్రే అన్నారు. ఎన్నో దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక పనులను పదేండ్లలో జాతీయ ప్రయోజనాల కోసం పూర్తి చేశామన్నారు. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించి, ప్రపంచ దేశాల్లో ఇండియా గుర్తింపును బలోపేతం చేశామన్నారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో ప్రభుత్వ పథకాలపై అర్థవంతమైన చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్టు రాష్ట్రపతి ముర్ము తెలిపారు.
నేడు మధ్యంతర బడ్జెట్
నేడు (గురువారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (ఓటు ఆన్ అకౌంట్) ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం రాజ్యసభలో బడ్జెట్‌ను టేబుల్ చేస్తారు.