కవితకు మరో మూడు రోజుల కస్టడీ

Kavitha is in custody for another three days– ఇంటి భోజనం, కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతి
– బెయిల్‌ పిటిషన్‌ దాఖలు కవితకు మరో మూడు రోజుల కస్టడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది. ఈనెల 26న ఉదయం 11 గంటల లోపు తిరిగి కోర్టు ముందు హాజరుపరచాలని స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా ఆదేశాల్లో పేర్కొన్నారు. కవిత విచా రణలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌(ఐఓ)కు సూచించింది. అలాగే సీసీటీవీల సమక్షంలో విచారణ నిర్వహించాలని స్పష్టం చేసింది. వీటితో పాటు ఆ సీసీ టీవీ పుటేజ్‌ని భద్రపరచడం, చట్ట ప్రకారం వైద్య పరీక్షల నిర్వహణ, మందులు అందించాలని పేర్కొంది. కవిత కోరిక మేరకు ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. భర్త అనిల్‌, సోదరుడు కేటీఆర్‌, వదిన మంజుల, కొడుకు ఆదిత్య, వరుసకు సోదరైన ననిత, పీఏ శరత్‌, న్యాయవాది మోహిత్‌లను గతంలో కోర్టు సూచించిన సమయంలో కలుసుకునేందుకు అనుమ తి ఇచ్చింది. కాగా, గతవారం విధించిన ఏడు రోజుల కస్డడీ ముగియడంతో శనివారం కవితను మరోసారి ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ఈడీ తరపున న్యాయవాది జోసెబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపిస్తూ… కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి రోజు కవితకు మెడికల్‌ టెస్టులు నిర్వహి స్తున్నట్లు తెలిపారు. వైద్యులు సూచించిన ఆహారాన్ని అందిస్తున్నట్లు కోర్టుకు నివేదించారు. రూ.100 కోట్ల కిక్‌ బ్యాక్‌ల చెల్లింపుల్లో కవిత కుట్ర పన్నారని ఆరోప ించారు. ఈ కేసులో మరో నలుగురి వాంగ్మూలాలు తీసుకొని, కలిపి ప్రశ్నించినట్లు తెలిపారు. కవిత మొబైల్‌ ఫోన్లో నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి, ఫోరెన్సిక్‌ ఆధారాలతో కూడా సరిపోల్చినట్లు వివరించారు. అయితే మొబైల్‌ డేటా నుంచి కవిత కొంత సమాచారాన్ని డిలీట్‌ చేసినట్టు గుర్తించామన్నారు. కవిత, ఆమె కుటుంబ సభ్యులు ఒక చిన్న సమాచారాన్ని కూడా అందించలేదన్నారు. ఆమె మేనల్లుడి వ్యాపార వివరాలు చెప్పాలని అడిగితే, తనకు తెలియదని కవిత సమాధానం ఇచ్చారన్నారు. కవిత నివాసంలో సోదాల సందర్భంగా ఫోన్‌ సీజ్‌ చేశామని, కానీ ఆ వ్యక్తి (కవిత మేనల్లుడు) విచారణకు హాజరు కాలేదని కోర్టుకు నివేదించారు. కోర్టులో వాదనలు జరుగుతోన్న సమయంలోనే హైదరాబాద్‌లోని కవిత కుటుంబ సభ్యుల నివాసంలో సోదాలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నేరపూరిత సొమ్మును కవిత మేనల్లుడి ద్వారా వినియోగించుకున్న విషయంలో సమీర్‌ మహేంద్రుతో కలిపి విచారణ జరపడానికి అప్లికేషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. అయితే విచారణకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున… మరో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని జోసెబ్‌ విజ్ఞప్తి చేశారు. కానీ కోర్టు మూడు రోజులు మాత్రమే ఈడీ కస్టడీకి ఇచ్చింది
బెయిల్‌ పై విచారణ జరపండి
ఈడీ కస్టడీ ముగిసిన రోజే… బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ జరపాలని కవిత తరపు సీనియర్‌ న్యాయవాది రాణా వాదనలు వినిపించారు. అరెస్టు చేసి, ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తి నుంచి కొన్ని పత్రాలను ఈడీ కోరుతుందని, అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఆమెకు బెయిల్‌ మంజూరయ్యే వరకు అది సాధ్యం కాదని అన్నారు. మొదటి విచారణలోనే వివరణాత్మక వాదనలు వినిపించామన్నారు. ఈ వాదనలపై ఈడీ తరపు న్యాయవాది జోసెబ్‌ అడ్డుపడుతూ… వాటిని కోర్టు తిరస్కరించిందన్నారు. మరోవైపు రాణా వాదనలు కొనసాగిస్తూ.. కవిత తరపు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి అభ్యంతరం తెలిపిన జోసెబ్‌, ఆ అప్లికేషన్‌ పరిగణలోకి అనుమతించాల్సినది కాదని వాదించారు. అయితే రాణా తన వాదన వినిపిస్తూ ఈడీ కస్టడీ, జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్నా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసే అధికారం తమకుందన్నారు. ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వడానికి ఈడీకి 5 రోజుల సమయం సరిపోతుందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా… తీర్పును రిజర్వ్‌ చేశారు. ఈ సందర్భంగా.. కవిత ఇద్దరు పిల్లలు కోర్టులోనే ఉన్నందున… కవితతో మాట్లాడేందుకు వారికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అనుమతించారు.
ఏడ్వొద్దు… ధైర్యంగా ఉండండి…:కవిత
కోర్టు అనుమతించడంతో కుటుంబ సభ్యులు, ఎంపీలు, మాజీ మంత్రులతో కోర్టు హాల్‌లోనే కవిత కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా భర్త అనిల్‌, కొడుకులు ఆదిత్య, ఆర్య, ఎంపీలు వద్ది రాజు రవిచంద్ర, కెఆర్‌ సురేశ్‌ రెడ్డి, మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఇతర కుటుంబ సభ్యులు, జాగృతి నేతలు ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్బంగా మాలోతు కవిత, సత్యవతి రాథోడ్‌, కుటుంబ సభ్యులు, అభిమానులు ఆమెను చూసి కన్నీరు పెట్టుకున్నారు. దీంతో వారందరిని దగ్గరికి తీసుకున్న కవిత, ‘ఏడ్వొద్దు. భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండీ. మీరంతా ఉండగా నాకేం కాదు. మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు. ప్రతి ఒక్కరిని పేరు పేరుతో పిలిచిన కవిత, వారితో సరదాగా నవ్వుతూ మాట్లాడారు. కొడుకులు ఆదిత్య, ఆర్యాలతో నవ్వుతూ సంభాషించారు. కోర్టు ఇచ్చిన టైం ముగియడంతో ఈడీ అధికారులతో కస్టడీలోకి వెళ్లారు. కవిత బంధువుల ఇండ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది.

Spread the love