సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసును తెలంగాణ పోలీసులు క్లోజ్ చేశారు. ఆయన ఎస్సీ కాదని, ఫేక్ సర్టిఫికెట్ కారణంగానే సూసైడ్ చేసుకుని ఉంటాడని పేర్కొంటూ కేసును క్లోజ్ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీ యూ) విద్యార్థులతో పాటు వివిధ సంఘాలు, రోహిత్ వేముల తల్లి రాధిక వేముల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం హెచ్ సీయూ ఎదుట భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎనిమిదేళ్లుగా కొనసాగిన దర్యాఫ్తును నిలిపివేయడం, రోహిత్ వేముల ఎస్సీ కాదని తేల్చడంపై మండిపడ్డారు. ఈ విషయంపై రాధిక వేముల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చూడాలని అభ్యర్థించారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఓ వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. రోహిత్ వేముల ఆత్మహత్య కేసు ఇప్పటికే రీఓపెన్ చేయించామని వివరించారు. రోహిత్ మరణానికి కారణమైన వాళ్లకు శిక్ష పడేలా చూస్తామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసును రీ ఓపెన్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి రాధిక వేముల కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love