– మోడీకి సీఎం రేవంత్ సవాల్
– ఎయిర్‌పోర్ట్, ఓఆర్‌ఆర్ ఏమైనరు..?
– కడియం కావ్యను లక్ష మెజారిటీితో గెలిపించాలి : హన్మకొండ, వరంగల్‌లో రోడ్‌షోలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఏం అభివృద్ధి చేసినవో చెప్పినంకనే వరంగల్‌కు రావాలని ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. వరంగల్‌లో విమానాశ్రయాన్ని పునరుద్ధ రించలే.. అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించలే.. కాజీపేటకు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్‌కు తరలించి చివరకు కాజీపేట రైల్వే జంక్షన్‌ను రద్దు చేసే పరిస్థితికి తీసుకొచ్చిండు.. వీటిపై సమాధానం చెప్పినంకనే వరంగల్‌కు రావాలని అన్నారు. మంగళవారం సాయంత్రం హన్మకొండ చౌరస్తాలో హన్మకొండ డీసీసీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రోడ్డుషోలో సీఎం ప్రసంగించారు. ప్రధాని మోడీ వరంగల్‌కు ఎన్ని కోట్ల నిధులిచ్చిండ్రో చెప్పాలన్నారు. వేయిస్తంభాల గుడికి ఏం గుర్తింపు ఇచ్చిండ్రు ? ఏం ఇవ్వకుండా బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి ? అని ప్రశ్నించారు. బిడ్డకు బెయిల్ ఇప్పించుకునేందుకు కార్యకర్తలను ఫణంగా పెట్టి బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్ నుంచి ఒక నేతను బయటకు పంపి ఆ నేతకే బీజేపీ టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తుందన్నారు. డిసెంబర్‌లో కేసీఆర్‌ను ప్రజలు బండకేసి కొట్టినా ఆయనలో మార్పు రాలేదన్నారు. కారు షెడ్డుకు పోయిందని, దీంతో కేసీఆర్ బస్సులో బయల్దేరిండన్నారు. వరంగల్ నగరాన్ని రెండో రాజధానిలా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంచనాలను రివైస్ చేసి పంపించాలని సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను పునరుద్ధరిస్తామన్నారు. ప్రధాని మోడీ పరిశ్రమలన్నీ గుజరాత్‌కు తరలించుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను 10 ఏండ్లలో నెరవేర్చలేదని, మాజీ సీఎం కేసీఆర్ కూడా అడగలేదని ఆరోపించారు. అందుకే ఈ ఎన్నికలు తెలంగాణ, గుజరాత్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు. మొన్న డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్ మ్యాచ్ అయితే, పార్లమెంటు ఎన్నికలు ఫైనల్ మ్యాచ్ అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్‌ను డకౌట్ చేయాలన్నారు. ఢిల్లీ సుల్తానులను ఎదిరించిన గడ్డ కాకతీయ గడ్డ.. ఇప్పుడు ఒకపక్క మోడీ.. అమిత్ షా, మరోపక్క రాహుల్.. రేవంత్‌రెడ్డి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. ఈ పోరాటంలో కాకతీయుల వారసులైన మీరు నా పక్క వుండి గుజరాత్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. తులసివనంలో గంజాయి మొక్కలా ఒక పక్క ఎర్రబెల్లి, మరోపక్క ‘అరూరి’ అనకొండ వున్నారని, భూమి కనిపిస్తే అనకొండలా మింగుడేనని విమర్శించారు. బీఆర్‌ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, రెండూ కలిసి దొంగ దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నాయని అన్నారు.