మోడీ పాలనలో బ్రిటీష్‌ రాజ్‌ లాంటి పరిస్థితులు

మోడీ పాలనలో బ్రిటీష్‌ రాజ్‌ లాంటి పరిస్థితులు– ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే సంస్థలన్నీ నిర్వీర్యం : ప్రియాంక గాంధీ
లక్నో : ప్రధాని మోడీ హయాంలో దేశంలో బ్రిటిష్‌ రాజ్‌ తరహా పరిస్థితులు నెలకొంటున్నాయనీ, ప్రభుత్వ విధానాలతో కోటీశ్వరులకే మేలు జరుగుతున్నదని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలు పేదలను దృష్టిలో ఉంచుకుని రూపొందించటం లేదనీ, కోటీశ్వరులకు మేలు చేసేలా తయారైందని చెప్పారు. నేడు భారత్‌లో అసమానత పరిస్థితి దారుణంగా ఉన్నదని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయని ఆమె గుర్తు చేశారు. తన సోదరుడు, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న యూపీలోని రారుబరేలీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి ”ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే అన్ని సంస్థలు.. మీడియా, పార్లమెంటు వంటివి నిర్వీర్యమవుతున్నాయి. మహాత్మాగాంధీ, పండిట్‌ నెహ్రూ ప్రజల హక్కులను బలోపేతం చేసేందుకు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజల హక్కులను హరించే స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పడే రోజు వస్తుందని వారికి తెలియదు” అని ఆమె కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోట్లాది ప్రజల జీవితాలను మార్చే రిజర్వేషన్‌ లాంటి వ్యవస్థను కల్పించే రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భాష, ప్రవర్తన, చర్యలు నాసిరకంగా ఉన్న వ్యక్తి నేడు ప్రధాని కుర్చీపై కూర్చోవటం దేశ దౌర్భాగ్యమని ఆమె అన్నారు. ”మేము ఎల్లప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తాం. అభివృద్ధి చెందిన, సంపన్నమైన రారుబరేలీ గురించి కలలు కన్నాం. మాకు అవకాశం వచ్చినప్పుడు, మేము రారుబరేలీలో ఉపాధి, అభివృద్ధి అవకాశాలను సృష్టించాం. కానీ మోడీ ప్రభుత్వం మేము ప్రారంభించిన అనేక ప్రాజెక్టులను మూసివేసింది” అని ప్రియాంక గాంధీ అన్నారు.
రారుబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ఈనెల 20న పోలింగ్‌ జరగనున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడ నుంచి 5,34,918 ఓట్లతో గెలుపొందారు. ఆమె సమీప ప్రత్యర్థి దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ 3,67,740 ఓట్లను సాధించి బలమైన పోటీనిచ్చారు. రాహుల్‌ గాంధీ 2004 నుంచి 2019 వరకు లోక్‌సభలో పొరుగున ఉన్న అమేథీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఆయన బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని చవి చూశారు.

Spread the love