మోడీకి రాహుల్‌ గుబులు

Rahul for Modi the bushes– రాముడు గట్టెక్కించలేడని డౌట్‌..!
– ప్రజాసమస్యల ముందు కొట్టుకుపోయిన హిందూత్వ
– కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపైనే ఫోకస్‌
మోడీకి రాహుల్‌ గుబులు పట్టుకున్నట్టుంది. పడుకున్నా..నిద్ర లేచినా ఉలిక్కిపడుతున్నట్టుంది. అందుకే ప్రచారసభల్లో అభివృద్ధి అంశాలు ప్రస్తావించకుండా.. రాహుల్‌ ప్రసంగాలు, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపైనే ఫోకస్‌ చేస్తున్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌ను హిందూత్వ అంశం గట్టెక్కిస్తుందనుకుంటే..ఇపుడు ప్రజాసమస్యల ముందు బీజేపీకి పరాభవం తప్పదన్న సంకేతాలొస్తున్నాయి.
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే మూడు దశల పోలింగ్‌ పూర్తయింది. పోలింగ్‌ సరళిని గమనించిన బీజేపీలో ‘400 ప్లస్‌’ ఆశలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ‘సంపద పంపిణీ’పై కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను లక్ష్యంగా ఎంచుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హిందువుల సంపదను, ఆస్తులను గుంజుకొని వాటిని దేశంలోని ముస్లింలకు పంపిణీ చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. సంపద పంపిణీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ మెజారిటీ హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఏముంది?
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో సంపద పున:పంపిణీపై నేరుగా ప్రస్తావన లేదు. ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏం చెప్పిందంటే…. ” సంపద, ఆదాయాల్లో పెరుగుతున్న అసమానతలను రాజకీయాల్లో అవసరమైన మార్పులు తీసుకు రావడం ద్వారా నివారిస్తాం. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక, కులగణన చేపడుతుంది. కులాలు, ఉప కులాలు, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను గణించడానికి ఈ సర్వే చేపడతాము. ఈ సమాచారం ఆధారంగా కార్యాచరణకు ఎజెండాను రూపొందిస్తాము.” అని చెప్పింది.
ఇవే అంశాలను రాహుల్‌ ప్రజలకు వివరిస్తున్నారు. కులగణన నుండి తీసుకున్న సమాచారం సంక్షేమ, సామాజిక భద్రతా పథకాల అమలుకు దోహదపడుతుందని అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోటాను పెంచుతామని హామీ ఇస్తున్నారు.
మోడీ వక్రభాష్యం
కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మ్యానిఫెస్టోను, రాహుల్‌ ప్రసంగాలను మోడీ వక్రీకరిస్తున్నారు. ప్రజల సంపదను, హిందూ మహిళల బంగారు ఆభరణాలను గుంజుకొని ముస్లింలకు పంపిణీ చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కుట్ర పన్నిందని ఆయన ఆరోస్తున్నారు. పనిలో పనిగా ముస్లింలను ఆయన చొరబాటుదారులు, అధిక సంతతి కలిగిన వారుగా నిందిస్తున్నారు. నిరుద్యోగం, అధిక ధరలు వంటి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే మోడీ ఇలా అబద్ధాలు చెబుతున్నారని, విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టభద్రులు, డిప్లొమా హోల్డర్లకు అప్రెంటీస్‌షిప్‌, 30 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీపై కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో నిర్దిష్టమైన హామీ ఇచ్చింది. బీజేపీ యువతకు ఉద్యోగావకాశాలు పెంచుతానని మాత్రమే చెప్పింది. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తానని కాంగ్రెస్‌ చెబుతుంటే రైతులకు ఏటా ఇస్తున్న ఆరు వేల రూపాయల సాయాన్ని కొనసాగిస్తానని బీజేపీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వోద్యోగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, పేద కుటుంబాల్లో వృద్ధ మహిళలకు నగదు బదిలీ వంటి హామీలను కూడా కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చేర్చింది. కాగా భాగస్వామ్యపక్షమైన జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలల వీడియోలపై ప్రధాని ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు టిక్కెట్‌ ఇస్తే విమర్శలొస్తాయని… ఆయన కుమారుడిని బీజేపీ పోటీకి దింపింది. ఇలాంటప్పుడు బీజేపీ తన మ్యానిఫెస్టోలో మహిళలకు ఎలాంటి హామీలు ఇవ్వగలదని ఆశించగలం? దేశంలో కులగణనను, సామాజిక-ఆర్థిక సర్వేను చేపడతామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. మోడీ మాత్రం తాను ఓబీసీననే విషయాన్ని ప్రతిపక్షం గుర్తించడం లేదని వాపోతున్నారు.
బీజేపీ దృష్టంతా ‘400 ప్లస్‌’ పైనే
బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రతిపక్షాలపై దాడికే పరిమితం చేస్తోంది తప్ప ప్రజా సమస్యలను పట్టించు కోవడం లేదు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం డిమాండ్‌ చేస్తుంటే ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిర్దిష్ట ప్రణాళికను వివరించలేదు. ధరల పెరుగుదలను కూడా బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ నాయకుల మాటలన్నీ ‘400 ప్లస్‌’ పైనే. కాంగ్రెస్‌ పార్టీ కనీసం 272 సీట్లకు కూడా పోటీ చేయడం లేదని, అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని మోడీ ప్రశ్నించారు. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ 320 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాలను ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు వదిలేసింది. అదే ఇప్పుడు మోడీని భయపెడుతోంది.

Spread the love