– శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు
– రాష్ట్రానికి నేడు అమిత్‌షా, రేపు మోడీ రాక : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎంగా ఉండి రేవంత్‌రెడ్డి రిజర్వేషన్లపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశమన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, శుక్రవారం ప్రధాని మోడీ, 11న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాష్ట్రానికి రాబోతున్నారని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లపై బీజేపీని టార్గెట్ చేసి ఇరకాటంలో పెట్టే కుట్రను కాంగ్రెస్ చేసిందన్నారు. ఆ పార్టీ ఫెయిల్యూర్‌ను తమ మీద మోపాలని చూసిందని విమర్శించారు. రిజర్వేషన్ల సమస్యను ప్రజలెవ్వరూ సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. బీజేపీ అభ్యర్థులకు పెరుగుతున్న ఆదరణను చూసి సీఎం రేవంత్‌రెడ్డిలో కలవరం మొదలైందని చెప్పారు. ముగ్గురు జర్నలిస్టులను జైలు లో వేస్తే సర్దుకుంటుందని సీఎం అహంకారంతో మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఆయన ఒక రీసెర్చ్ టీమ్‌ను పెట్టుకున్నారనీ, ఆ టీమ్ అందించే కొత్తకొత్త తిట్లను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అనే నిజాం పోయి కొత్త నిజాంగా తానొచ్చినట్టు రేవంత్‌రెడ్డి ఫీలవుతున్నారని దెప్పిపొడిచారు. అబద్దాలను ప్రచారం చేయడంలో కేసీఆర్ కుటుంబంతో రేవంత్‌రెడ్డి పోటీపడుతున్నారని విమర్శించారు. ఈ విషయంలో వారికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచన్నారు. రైతు భరోసాపై తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదనీ, ఈ విషయంలో తమపై బురద జల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలియదా? ముందే రైతు భరోసా నిధులను ఎందుకు విడుదల చేయలేదు? అని ప్రశ్నించారు. దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారని కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తారంటూ బీఆర్‌ఎస్ నేతలు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.భువనగిరి అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలతో డీపీఆర్ సిద్ధమైందనీ, దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అనంతగిరి కొండల అభివృద్ధికి కేంద్రం రూ.100 కోట్లకు అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. కోమటిరెడ్డి టూరిజం మంత్రి కాదు కాబట్టి ఆయనకు ఈ విషయం తెలియదన్నారు.