అకాల వర్షానికి కుదేలైన రైతు

అకాల వర్షానికి కుదేలైన రైతు– తడిసి మొలకెత్తిన వేరుశనగ
– దళారులకు ధాన్యం అమ్మకాలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
వ్యయ ప్రయాసలకోర్చి ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే తరుణంలో అకాల వర్షాలకు తడిసి ముద్దవడంతో రైతు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో రబీ పంటగా వరి 1500 ఎకరాల్లో, వేరుశనగ 1000 ఎకరాల్లో సాగు చేశారు. వరి కోసి కల్లాల్లో ఉంచగా, వేరుశనగను యంత్రాలతో వొన్ను చేసుకుంటు న్నారు. మంగళవారం మధ్యాహ్నం అరగంట పాటు గాలులతో కూడిన భారీ వర్షానికి కల్లాల్లో ఉన్న వరి ధాన్యం, పొలంలో ఉన్న వేరుశనగ పంట పూర్తిగా తడిచిపోయింది. దాంతో తడిచిన ధాన్యాన్ని రైతులు దళారులకు ఎంతోకొంతకు అమ్మకానికి పెట్టారు. తడిచిన వేరుశనగ పంటను తిరగేసి ఆరబెడుతు న్నారు. వరి ధాన్యం కాంటాలైన లోడింగ్‌ కాకపోవడంతో తడిసింది.
అకాల వానలతో అపార నష్టం : సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, రైతు
ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ వేశా. ఎకరానికి కౌలుతో సహా రూ.80 వేలు పెట్టుబడితో సుమారు రూ.7 లక్షలు వ్యయమైంది. గత మూడు రోజులుగా వేరుశనగ తీసి యంత్రం ద్వారా పంటను వేరు చేస్తున్నాం. మంగళవారం వచ్చిన అకాల వర్షానికి తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు గానీ రైతుల వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు.

Spread the love