– ఉద్యోగ కల్పనకు మంగళం
– వేలల్లో ఉద్యోగాలు…లక్షల్లో దరఖాస్తులు
– చిన్న ఉద్యోగాలకు పోటీ పడుతున్న పెద్ద సార్లు
– భర్తీ ఊసే ఎత్తని ప్రభుత్వం
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్యులనే కాదు….నిరుద్యోగ యువతనూ నిలువునా ముంచేసింది. వారి ఆశలపై నీళ్లు చల్లింది. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామంటూ తీయని కబుర్లు చెప్పి చివరికి మొండిచేయి చూపింది. మోడీ పాలనలో ఉద్యోగాలు వస్తాయని, తమ జీవితాలు బాగుపడతాయని, కుటుంబాలు చల్లగా ఉంటాయని ఎన్నో కలలు కన్న యువతను తీవ్రంగా నిరాశ పరిచింది.
చెప్పిందేమిటి?
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దాని ప్రకారం గడిచిన పది సంవత్సరాలలో ఇరవై కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగులు కావాల్సి ఉంది. ‘స్కిల్ ఇండియా’లో భాగంగా 2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇస్తామని కూడా కమలదళం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మహిళలకు మరిన్ని ఉద్యోగాలు ఇస్తామని ఊరించింది. అయితే ఈ హామీలేవీ నెరవేరలేదు.
వ్యాపారంగా మారిన విద్య
మోడీ పాలనలో విద్యా రంగాన్ని లాభాపేక్ష కలిగిన వ్యాపారంగా మార్చేశారు. ఆ రంగానికి ప్రభుత్వం బడ్జెటరీ కేటాయింపులను, గ్రాంట్లను తగ్గించి వేసింది. దీంతో పుట్టగొడుగుల మాదిరిగా పుట్టుకొచ్చిన ప్రయివేటు విద్యా సంస్థలు రకరకాల వ్యాపార ప్రకటనలతో, కల్లబొల్లి కబుర్లతో విద్యార్థులను ఆకర్షించి జేబులు నింపుకున్నాయి. పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఉన్నత విద్య అందని ద్రాక్షే అయింది. అనేక కష్టనష్టాలు అనుభవించి, తల్లిదండ్రులపై భారీగా ఆర్థిక భారం మోపి బీఏ, బీఎస్సీ, బీకాం, బీఈడీ, ఎంఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా, ఐటీఐ, ఇంజినీరింగ్ వంటి డిగ్రీలు పొందిన యువత ఉద్యోగాల వేటలో కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మంచి ఉద్యోగంతో మెరుగైన జీవితాన్ని అనుభవించాలని అనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి.
16 వేల పోస్టులకు 50 లక్షల దరఖాస్తులు !
పదో తరగతి చదివిన వారి కోసం పత్రికలలో ఉద్యోగ ప్రకటనలు ఇస్తుంటే బీఏ, ఎంఏ, చివరికి పీహెచ్‌డీ చేసిన వేలాది మంది సైతం వాటి కోసం దరఖాస్తు చేస్తున్నారు. గత సంవత్సరం ఉత్తర ప్రదేశ్‌లో 16 వేల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే యాభై లక్షల అప్లికేషన్లు వచ్చాయి. నిరుద్యోగ సమస్య తీవ్రతకు ఇది అద్దం పడుతోంది. డిగ్రీలు, డబుల్ డిగ్రీలు కలిగిన లక్షలాది మంది పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు చివరికి రూ.6,000 నుండి రూ.12,000 జీతం కోసం గెస్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పని చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
భర్తీకి నోచుకోని లక్షల ఉద్యోగాలు
వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుం డడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది యువకులు జీవనోపాధి కోసం మూటా ముల్లే సర్దుకొని పెద్ద సంఖ్యలో పట్టణాలు, నగరాలకు వలస వస్తున్నారు. అయితే అక్కడ కూడా ఉపాధి అవకాశాలు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ తొలి ఐదు సంవత్సరాల కాలంలో… అంటే 2014-19 మధ్యకాలంలో 60 లక్షల ప్రభుత్వోద్యోగాలు భర్తీకి నోచుకోక ఖాళీగా ఉండిపోయాయి. ఖాళీగా ఉన్న ఉద్యోగాల వాస్తవ సంఖ్యను బహిర్గతం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య బహుశా ఇప్పుడు రెట్టింపై ఉండవచ్చు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా అతి తక్కువ సంఖ్యలోనే సిబ్బంది కన్పిస్తుంటారు. ఉన్న వారు సైతం అలసత్వం, ఉదాశీనత ప్రదర్శిస్తున్నారు. కొందరు తక్కువ వేతనాలతో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల సాయంతో పనులు పూర్తి చేస్తున్నారు. వ్యవస్థలను బలహీనపరచి, వాటిని ప్రయివేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం పన్నిన ఎత్తుగడలో ఇదంతా భాగమే.
సాయుధ దళాలలోనూ బ్రేక్
ప్రతి సంవత్సరం సాయుధ దళాలలో యాభై వేల మందిని నియమించే వారు. అయితే ఇప్పుడు ‘అగ్నివీర్’ పథకాన్ని తీసుకొచ్చి నియామకాలను నిలిపివేశారు. ఈ పథకం కింద నియమితులైన వారిలో 75 శాతం మంది నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ నిరుద్యోగులుగా మారిపోతారు.
మూతపడుతున్న సంస్థలు, పరిశ్రమలు
మోడీ ప్రభుత్వ పాలనలో చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు, కుటీర పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ మద్దతు లేకపోవడం, జీఎస్టీ విధింపు, పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ సమయంలో సాయం కొరవడడం వంటి కారణాలతో ఈ వ్యాపార సంస్థలు బడా కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడలేకపోతున్నాయి. ఈ సంస్థలు చవిచూస్తున్న నష్టాలకు, 25 శాతం నుండి 35 శాతం మధ్యతరహా సంస్థలు, 40 శాతం చిన్నతరహా సంస్థలు మూతపడడానికి మోడీ ప్రభుత్వం అవలంబించిన విధానాలే కారణం. ఫలితంగా లక్షలాది ఉద్యోగాలు అదృశ్యమయ్యాయి.
కార్పొరేట్ కంపెనీలలో పెట్టుబడులు
అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు చెందిన కంపెనీలలో మోడీ ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఫలితంగా ప్రభుత్వ రంగంలోనూ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన బాధ్యతను నిర్లక్ష్యం చేసింది. తద్వారా యువత భవిష్యత్తును నాశనం చేసింది.
ఉపాధి వెతుక్కుంటూ…
పది సంవత్సరాల క్రితం 2.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఇప్పుడు 8.1శాతానికి చేరుకుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువత దక్షిణాదికి తరలివచ్చి ఉపాధి వెతుక్కుంటోంది. తమ విద్యార్హతకు సంబంధించిన ఉద్యోగం కోసం అన్వేషించడం మానేసి, కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి దొరికితే చాలునని నిరుద్యోగులు భావిస్తున్నారు.