విశ్వసిస్తలేరు

Can't believe it– బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అంతే
– రాజ్యాంగం మారుతుందని జనంలో భయం
– రిజర్వేషన్లు రద్దవుతాయనీ ఆందోళన
– ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో కాషాయపార్టీపై పెరిగిన తీవ్ర వ్యతిరేకత
– ‘చార్‌ సౌ పార్‌’పై మోడీ మాటల్లో తగ్గిన విశ్వాసం
– రాజకీయ విశ్లేషకులు, నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ : ‘అబ్‌ కీ బార్‌.. చార్‌ సౌ పార్‌’ అంటూ మొన్నటి వరకు నినాదాలు వినిపించిన బీజేపీని ప్రజలు విశ్వసించటం లేదు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ..రాజ్యాంగాన్ని మారుస్తారనీ, రిజర్వేషన్లు రద్దవుతాయని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కాషాయ పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తొలి రెండు దఫా ఎన్నికల సరళిని అర్థం చేసుకున్న బీజేపీ అధినాయకత్వంలో నమ్మకం సన్నగిల్లిందనీ, ‘చార్‌ సౌ పార్‌’పై మోడీ మాటల్లో ఇప్పుడు విశ్వాసం కనిపించటం లేదని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు.
బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణాన్ని మార్చబోదనీ, రిజర్వేషన్లను రద్దు చేయదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వంటి అగ్రనాయకులు కాషాయపార్టీ తరఫున స్పష్టం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మోడీ క్యాబినెట్‌లో సీనియర్‌ నాయకుడైన రాజ్‌నాథ్‌ సింగ్‌ మళ్లీ రిజర్వేషన్లపై స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదన్న సంకేతాలు కాషాయ పార్టీకి అందిన తర్వాతే.. రాజ్‌నాథ్‌సింగ్‌ వంటి సీనియర్‌ నాయకుడు ఈ విధంగా స్పందించాల్సి వచ్చిందని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. ”రిజర్వేషన్లను ఆపే ప్రశ్నే లేదు. రిజర్వేషన్లు అవసరమని నేను గట్టిగా నమ్ముతున్నా. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని మార్చవలసిన అవసరం మాకు ఎప్పటికీ ఉండదని నేను గట్టిగా నమ్ముతున్నాను” అని ఒక ఆంగ్ల వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. మోడీ తర్వాత రెండో స్థానంలో ఉన్న అమిత్‌షా సైతం ఇవే మాటలను వల్లె వేయాల్సిన పరిస్థితులు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నదనీ, రిజర్వేషన్లను రద్దు చేయనున్నదని ప్రజల్లో ప్రస్తుతం నడుస్తున్న చర్చ. కాంగ్రెస్‌ వంటి ప్రతిపక్షాలు సైతం బీజేపీపై ఇవే ఆరోపణలను గుప్పిస్తున్నాయి. మొత్తానికి ఈ ప్రచారం ప్రజల్లోకి లోతుగా వెళ్లిందనీ, ఇది కాషాయ పార్టీకి రానున్న ఎన్నికల్లో తీవ్ర నష్టాన్నే తెచ్చిపెడుతుందని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2009 నుంచి ఓబీసీ ఓట్లపై పెరుగుతున్న పట్టు కారణంగా బీజేపీ విజయం సాధించిందనీ, అది ఈ సారి ఎన్నికల్లో ఈ ప్రచారంతో తగ్గిపోయే ప్రమాదమున్నదని అంటున్నారు.
కానీ బీజేపీ నేతలు మాత్రం ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ‘చార్‌ సౌ పార్‌’ నినాదాన్ని వినిపిస్తు న్నారు. మోడీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇటు రాజకీయ సమావేశాల్లో, అటు సోషల్‌ మీడియాల్లో బీజేపీ విస్తృత ప్రచారాన్నే చేసుకుంటున్నది. బీజేపీ అగ్రనాయకత్వం రాజకీయాన్ని మార్చబోమని, రిజర్వేషన్లను రద్దు చేయబోమని ప్రకటనలిస్తున్నా.. బీజేపీ కిందిస్థాయి నాయకులు, శ్రేణులు మాత్రం ‘హిందూత్వ దేశం’ బీజేపీ నినాదమనే ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉన్నందున దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లు కావాలని వారు పిలుపునిస్తున్నారు.
అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ బీజేపీ, మోడీ వ్యవహార శైలిలో మార్పు కనిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న మోడీ.. విడతలవారీగా ఎన్నికలు ముగస్తున్నా కొద్దీ ఆ స్వరాన్ని మారుస్తున్నారనీ, క్షేత్రస్థాయిలో క్లియర్‌ పిక్చర్‌ మోడీ, షా ద్వయానికి అవగతమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 400 సీట్లు సాధించటం ప్రస్తుత పరిస్థితుల్లో కాషాయపార్టీకి చాలా కష్టమైన పనేనని చెప్తున్నారు.
ఆరెస్సెస్‌ సిద్ధాంతాలను అమలు చేయాలనే గట్టి సంకల్పంతో బీజేపీ ఉన్నదనీ, ఇందులో భాగంగానే ఆర్టికల్‌ 370 రద్దు, రామ మందిర నిర్మాణం వంటి లక్ష్యాలను కాషాయపార్టీ పూర్తి చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే.. యూసీసీ, మత మార్పిడి నిరోధక చట్టాలు మాత్రమే కాదు.. ఏకంగా భారత రాజ్యాంగమే మార్పునకు గురయ్యే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు. ఇందుకు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ 2015లో సంఫ్‌ు మౌత్‌పీస్‌ పాంచజన్యలో ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని (రాజ్యాంగంలో ప్రాథమిక మార్పులకు సంబంధించిన కోడ్‌) చెప్పినట్టు ఉదహరించారు. అయితే, ఇది ఆ తర్వాత ఆ ఏడాది తర్వాత జరిగిన బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌ బంధన్‌కు బీజేపీ పరాజయానికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు.

Spread the love