నేను ఉగ్రవాదిని కాదు

I am not a terrorist–  జైలు నుంచి కేజ్రీవాల్‌ సందేశం
న్యూఢిల్లీ : తాను ఉగ్రవాదిని కాను అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ జైలు నుండి ఓ సందేశాన్ని పంపారని ఆప్‌ ఎంపీ సంజరుసింగ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ” నాపేరు అరవింద్‌ కేజ్రీవాల్‌. నేను ఉగ్రవాదిని కాదు. మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేను పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ను జైలులో గ్లాసు గోడల మధ్య కలిశాను. ఆప్‌ పార్టీపై కేంద్రం ఎంత ద్వేషం పెంచుకుందో దీని ద్వారా అర్థమౌతోంది ” అని ఆయన జైలు నుంచి పంపిన మెసేజ్‌లో పేర్కొన్నారని అన్నారు.
కేజ్రీవాల్‌ రోజువారీ కార్యకలాపాలతో పాటు కుటుంబసభ్యులతో మాట్లాడే సమయంలో కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ వేధింపులకు గురిచేస్తోందని ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌ మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలతో పాటు దేశ ప్రజలకు ఓ కుమారుడిగా, సోదరుడిగా సేవలందించిన వ్యక్తి పట్ల ఈ విధంగా వ్యవహరించడం మీకు అవమానంగా అనిపించడం లేదా అని కేంద్రాన్ని నిలదీశారు. ప్రధాని మోడీ మనస్సు ద్వేషంతో నిండిపోయిందని, కేజ్రీవాల్‌ తన భార్య, కుటుంబసభ్యులను కూడా గ్లాస్‌ గోడల మధ్య కలుసుకుం టున్నారని సంజయ్ సింగ్‌ ధ్వజమెత్తారు. ఆయన మట్టి మనిషని, ఐఆర్‌ఎస్‌ జాబ్‌ వదులుకుని దేశ ప్రజలకు సేవలందిస్తున్నారని అన్నారు. తన సిద్ధాంతాల కోసం పదవి చేపట్టిన 49 రోజులకే రాజీనామా చేశారని, అదీ కేజ్రీవాల్‌ అంటే అని సంజయ్ సింగ్‌ పేర్కొన్నారు. ఎంత బలంగా అణచి వేయాలని చూస్తే అంత బలంగా తిరిగి వస్తారని అన్నారు.

Spread the love