పతంజలికి వ్యవస్థ దాసోహం

Patanjali's system is slavery– చూసి చూడనట్టు వ్యవహరించిన ప్రభుత్వాలు
– మీడియా నుంచి బ్యూరోక్రసీ వరకు ఇదే దారి
– రెచ్చిపోయిన బాబా రాందేవ్‌ కంపెనీ
– తప్పుడు ప్రకటనలతో పబ్బం గడుపుకున్న తీరు
– ప్రజలు నమ్మేలా చేసి కోట్ల రూపాయల్లో వ్యాపారం
– ఎట్టకేలకు కొరడా ఝుళిపించిన సుప్రీంకోర్టు
– క్షమాపణలు చెప్తూ దిగొచ్చిన పతంజలి బాబా
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల విషయంలో బాబా రాందేవ్‌ తనకు నచ్చినట్టుగా వ్యవహరించారు. తమ ఉత్పత్తులకు అనేక రోగాలను నయం చేసే సామర్థ్యం ఉన్నదని అధికారికంగా ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి సర్టిఫికెట్‌ లేకున్నా.. బాబా రాందేవ్‌ ప్రకటనలతో హౌరెత్తించారు. స్థానిక పత్రికలు, ఛానెళ్లే కాదు.. ఏకంగా జాతీయ ఆంగ్ల వార్త పత్రికలు, మీడియా ఛానెళ్లలో ఈ ప్రకటనలు వచ్చాయి. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ అంశాన్ని చూసి చూడనట్టుగా వ్యవహరించాయి. మీడియా, బ్యూరోక్రసీ కూడా పతంజలి తప్పుడు ప్రకటనల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించాయి. దీంతో ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని పతంజలి బాబా రెచ్చిపోయి, విపరీత ప్రకటనలు, కోట్ల రూపాయల్లో వ్యాపారం చేశాడని విశ్లేషకులు, మేధావులు అంటున్నారు.
న్యూఢిల్లీ : పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల విషయంలో యోగాబాబా ప్రజలను తప్పుదోవ పట్టించాడని చెప్తున్నారు. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌, కాలేయ రుగ్మతల వంటి వివిధ రోగాలకు కు చికిత్స చేస్తామని పేర్కొంటూ దాదాపు రెండేండ్ల క్రితం పతంజలి తన ఆయుర్వేద ఉత్పత్తుల కోసం ఆంగ్ల భాషా వార్తాపత్రికలలో వరుస ప్రకటనలను ప్రచురించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి ప్రకటనల విషయంలో ఎట్టకేలకు సుప్రీంకోర్టు పతంజలి సంస్థపై కొరడా ఝులిపించింది. దీంతో క్షమాపణలు చెప్పటానికి బాబా రాందేవ్‌, పతంజలి హెడ్‌ బాలకృష్ణలు దిగిరావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే, పతంజలి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన విధానంలో వ్యవస్థ దాసోహమైం దని నిపుణులు చెప్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు, ఇటు ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వాలు బాబా రాందేవ్‌ను నియంత్రించలేదని అంటు న్నారు. అలాగే, ఒక వర్గం మీడియా, ఉన్నతాధికారులు సైతం పతంజలి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారని చెప్తున్నారు.
‘ది హిందూ’, ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వంటి కొన్ని ఆంగ్ల భాషా వార్తాపత్రికలు ఇప్పుడు పతంజలికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చర్యకు మద్దతుగా సంపాదకీయాలను ప్రచురించాయి. చట్టాన్ని ఉల్లంఘిస్తూ వచ్చిన ప్రకటనలను ప్రచురించటంలో కొన్ని పత్రికలు పోషించిన పాత్రకు సంబంధించి వివరించిన ఈ సంపాదకీయలను అంగీకరించాలని విశ్లేషకులు అంటున్నారు. డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమెడీస్‌ (అభ్యంతరకరమైన ప్రకటన) చట్టం, 1954 ప్రకారం.. ఆ చట్టంలో పేర్కొన్న షరతులకు చికిత్స చేయడానికి ఉద్దేశించిన డ్రగ్స్‌ కోసం తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించటానికి పతంజలి మాత్రమే కాదు.. ప్రెస్‌ కూడా బాధ్యత వహిస్తుంది. కాబట్టి, ప్రకటనలను ప్రచురించిన, ప్రసారం చేసిన అన్ని వార్తాపత్రికలు, మీడియా సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించినందుకు పతంజలి వలె బాధ్యత వహిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.
పతంజలి ”డ్రగ్స్‌” తయారీకి లైసెన్స్‌ని జారీ చేసిన ఉత్తరాఖండ్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ పాత్రనూ నిపుణులు, విశ్లేషకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పతంజలి చాలా ప్రకటనలు బీజేపీ పాలిత పలు రాష్ట్రాల్లోని అనేక ఇతర వార్తాపత్రికలలో ప్రచురించబడ్డాయి. వీటిని ప్రచురించినప్పుడు డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమెడీస్‌ (అభ్యంతరకరమైన ప్రకటన) చట్టం కింద చర్యలు తీసుకునే అధికార పరిధి ఈ రాష్ట్రాల్లోని డ్రగ్‌ కంట్రోలర్‌లకు ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోని విషయాన్ని విశ్లేషకులు, నిపుణులు గుర్తు చేస్తున్నారు.
పతంజలి పాపంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్‌ మంత్రిత్వ శాఖలకు చెందిన బ్యూరోక్రసీ ఉన్నదని ఆరోపిస్తున్నారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం తన మొదటి టర్మ్‌లో సృష్టించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇతర ఔషధాల వంటి కఠినమైన డబుల్‌ బ్లైండ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత భద్రత, సమర్థతపై డేటాను రూపొందించటానికి ఆయుష్‌ పరిశ్రమకు అవసరమయ్యే రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించటంలో ఈ రెండు శాఖలకు చెందిన బ్యూరోక్రసీ విఫలమైందని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు.
2010లో, ప్రభుత్వం ఆయుష్‌ పరిశ్రమపై విధించిన రూల్‌ 158బీని ప్రవేశపెట్టింది. ఈ రూల్‌ ప్రకారం.. ఆయుష్‌ విభాగం వారు ప్రవేశపెడుతున్న కొత్త ఔషధాల భద్రత, ప్రభావానికి సంబంధించిన రుజువులను ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. అయితే అటువంటి ఆధారాలను రూపొందించే విధానంపై స్పష్టత రాకపోవటం గమనార్హం. కాగా, ప్రభుత్వం 2018లో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ రూల్‌ 158బీ ప్రకారం పరిశ్రమ ఎలాంటి క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా.. ఆయుష్‌ పరిశ్రమ పైలట్‌ అధ్యయనాలు నిర్వహిస్తే సరిపోతుందని సంబంధిత మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. అయితే, ఈ రోజు వరకు కూడా పైలట్‌ అధ్యయనాలు అంటే మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం లేదని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటివి పతంజలి వంటి సంస్థలకు బలాన్ని అందించాయని చెప్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా, బ్యూరోక్రసీ నుంచి ఆశించిన స్పందన లేకపోవటం, విఫలమైన వ్యవస్థల పూర్తి వైఫల్యం కారణంగానే పతంజలి ఈ రోజు వరకు అభివృద్ధి చెందిందని విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. పతంజలి ద్వారా స్పాన్సర్‌ చేయబడిన ప్రకటనలు ఆయుష్‌ పరిశ్రమ ద్వారా కూడా ప్రచురించబడతాయనీ, 2022లో ప్రచురితమైన ప్రకటనలు ఇంగ్లీషు భాషా వార్తాపత్రికలలో ప్రచురించబడిన కారణంగా అవి ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించాయని గుర్తు చేస్తున్నారు. అడ్డదారుల్లో ప్రకటనల ద్వారా ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకున్న బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నది.
సుప్రీం మళ్లీ మొట్టికాయలు
మీరేమీ అమాయకులు కాదు : బాబా రాందేవ్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం
కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రాందేవ్‌, బాలకృష్ణలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బాబా రాందేవ్‌ అంత అమాయకుడేం కాదనీ, ఆయనది బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన అని ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసును జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ ఎ. అమానుల్లాతో కూడిన సుప్రీకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బాబా రాందేవ్‌, బాలకృష్ణ ఇద్దరూ సుప్రీకోర్టు విచారణకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ”మేము చేసిన తప్పిదాలకు బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఆ సమయంలో మేము చేసింది సరైంది కాదు. మేము చేసిన తప్పును భవిష్యత్తులో కూడా మళ్లీ జగరకుండా గుర్తు పెట్టుకుంటాం” అని బాబా రాందేవ్‌ కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ”చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది. మీరు ఏమి చేసినా.. అది మీ బాధ్యత మాత్రమే. మా ఆదేశాలను అనుసరించి క్షమాపణలు చెప్పారు. నయం చేయలేని వ్యాధుల గురించి ప్రచారం చేయలేరని మీకు తెలియదా?’ అని ప్రశ్నించింది. దానికి రాందేవ్‌ స్పందిస్తూ.. ” మేము అనేక పరీక్షలు చేశాం” అని కోర్టుకు తెలిపారు.
”మీది చాలా బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన. మీ క్షమాపణలు ఆమోదించాలా? వద్దా? అనే అంశంపై మేము ఆలోచిస్తాం. మీరు పదేపదే మా ఆదేశాలు ఉల్లంఘించారు” అని జస్టిస్‌ హిమా కోహ్లి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ క్షమాపక్షణలు హృదయం నుంచి రావటం లేదనీ అని మరో న్యామమూర్తి జస్టిస్‌ ఎ. అమానుల్లా అన్నారు. కాగా, ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఈనెల 23కు వాయిదా వేసింది.

Spread the love